Second Hand Car Buying Tips : కొత్త కారు కొనాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఈ కల నెరవేరడం కష్టం అవుతుంది. ఎందుకంటే కార్ల ధరలు బాగా ఎక్కువగా ఉంటాయి. అందుకే కొంతమంది సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మీరు కూడా సెకండ్ హ్యాండ్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే తరువాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. కారు గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి
కారును కొనుగోలు చేసేటప్పుడు, దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంతకు ముందు కారుకు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఫైనాన్షియల్ స్టేటస్ ఏమిటి? సర్వీస్ రికార్డ్ ఎలా ఉంది? అనే విషయాలను చెక్ చేసుకోవాలి. ఈ వివరాలను మీకు దగ్గరలో ఉన్న ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) దగ్గర ఉంటాయి. లేదా సింపుల్‌గా ఆన్‌లైన్‌లోనూ తెలుసుకోవచ్చు.
2. టెస్ట్ డ్రైవ్ చేయాలి
మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసేముందు, కచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేయాలి. అప్పుడే వాహనంలో ఏవైనా లోపాలు ఉన్నాయా? లేదా? అనేది తెలుస్తుంది. ముఖ్యంగా వాహనం కదులుతున్నప్పుడు దాని ఇంజిన్‌తో సహా, ఇతర భాగాల నుంచి ఏవైనా శబ్దాలు వస్తున్నాయా? లేదా? అనేది చూసుకోవాలి. ఇంజిన్, గేర్ బాక్స్, సస్పెన్సన్, బ్రేక్‌లు ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి.
3. బడ్జెట్‌ను అంచనా వేసుకోవాలి
పాతకారు కొనుగోలు చేసే ముందు మీరు ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారో ముందే ఫిక్స్ చేసుకోండి. తర్వాత మీరు సెలక్ట్ చేసుకున్న కారు మార్కెట్ విలువ, రీసేల్ వ్యాల్యూ, డిమాండ్ గురించిన సమాచారాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. సెకండ్ హ్యాండ్ కారు వ్యాల్యూను, అలాగే అదే మోడల్‌కు చెందిన కార్ల ధరలను తప్పనిసరిగా పోల్చి చూసుకోవాలి.
4. సర్వీస్ రికార్డు తప్పనిసరిగా చెక్ చేయాలి
మీరు కారును కొనుగోలు చేయాలని డిసైడ్ అయినప్పుడు, దాని సర్వీసు రికార్డును కూడా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే, కారులోని ఏయే భాగాలను మార్చారు అనే విషయాలు సర్వీస్ రికార్డులో ఉంటాయి. పైకి అందంగా కనిపించినప్పటికీ, సర్వీస్ రికార్డు చెక్ చేస్తేనే కారు అసలు విషయం బయటపడుతుంది.
5. కచ్చితంగా డాక్యుమెంట్స్ పరిశీలించాలి
మీరు కారుకు సంబంధించిన అన్ని పత్రాలను కచ్చితంగా చెక్ చేయాలి. ఆర్టీవో ఆఫీస్వారు ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా పాలసీ, ఇతర ఆర్థిక సంబంధిత పత్రాలు అన్నింటినీ పరిశీలించాలి. ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మీరు సెకండ్ హ్యాండ్ కారును సరైన ధరకు కొనుగోలు చేయడానికి వీలవుతుంది.