Risky Transactions To Lead IT Notice : ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. మన దగ్గర మొబైల్, బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే చాలు, చేతిలో డబ్బులు లేకపోయినా సులువుగా ఆర్థిక లావాదేవీలు చేసేయవచ్చు. ఇక డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా సింపుల్‌గా పేమెంట్స్ చేయవచ్చు. అందుకే డిజిటల్ పేమెంట్స్‌కు అనతికాలంలోనే మంచి ఆదరణ లభించింది. పైగా ప్రభుత్వం కూడా నగదు లావాదేవీలను తగ్గించి, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది. దీని వల్ల ఎవరు ఏ మేరకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు? వాస్తవానికి వారి ఆదాయం ఎంత? పరిమితికి మించి ఖర్చులు ఏమైనా చేస్తున్నారా? మొదలైన వివరాలు అన్నీ ప్రభుత్వానికి తెలిసిపోతున్నాయి.
అందుకే సౌకర్యంగా ఉందని ఎడాపెడా డిజిటల్ పేమెంట్స్ చేయడం; పరిమితికి మించి క్రెడిట్, డెబిట్ కార్డులు వాడడం చేస్తే, ఆదాయపు పన్ను శాఖ రూపంలో సమస్యలు ఎదర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ ఆర్టికల్‌లో ఎలాంటి రిస్కీ ట్రాన్సాక్షన్స్ చేయకూడదో వివరంగా తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డు చెల్లింపులు : ఒకటో తారీఖున జీతం పడగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది క్రెడిట్ కార్డ్ బకాయిలే. నెలంతా ఎడాపెడా క్రెడిట్ కార్డులతో ఖర్చులు చేసిన వారు, ముందుగా ఆ బిల్లులు తీర్చకపోతే, తరువాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల మీ కార్డు పరిమితి మేరకు మాత్రమే డబ్బు వినియోగించుకోవాలి. అలా కాకుండా పరిమితికి మించి క్రెడిట్, డెబిట్ కార్డ్ వాడి, ఆర్థిక లావాదేవీలు చేస్తుంటే, ఆదాయ పన్ను శాఖ పంపే నోటీసులకు బదులు చెప్పాల్సి వస్తుంది. వాస్తవానికి రూ.1 లక్షకు మంచి క్రెడిట్ కార్డు బిల్లు సెటిల్ చేస్తే మీకు ఐటీ శాఖ నుంచి తాఖీదు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఒక లక్ష రూపాయలలోపు మాత్రమే క్రెడిట్ కార్డ్ బిల్లులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
బ్యాంక్ డిపాజిట్లు : బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసేటప్పుడు కొన్ని ఆదాయపు పన్ను పరిమితులు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే సమయంలో రూ.10 లక్షలకు మించి నగదు డిపాజిట్ చేయకూడదు. రూ.10 లక్షల పరిమితి దాటితే, దానికి సంబంధించిన వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది.
పొదుపు / కరెంట్ అకౌంట్ : ఒక ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా పొదుపు ఖాతాలో(Savings Account) రూ.10 లక్షలకు మించి పొదుపు చేస్తే, ఐటీ శాఖ మీకు నోటీసులు పంపించవచ్చు. కరెంట్ ఖాతాదారులకు అయితే ఈ పరిమితి రూ.50 లక్షలు వరకు ఉంటుంది. ఈ పరిమితిలను దాటినప్పుడు ఆదాయపు పన్ను శాఖ పంపించే నోటీసుకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
రియల్ ఎస్టేట్ లావాదేవీలు : భూ క్రయవిక్రయాల సమయంలోనూ ఐటీ రూల్స్ కచ్చితంగా పాటించాలి. రియల్ ఎస్టేట్ లావాదేవీలను ఆదాయపు పన్నుశాఖ నిశితంగా గమనిస్తూ ఉంటుంది. భూములు, ఇళ్లు, అపార్ట్మెంట్ లాంటి స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాల్లో రూ.30 లక్షలు వరకు నగదు లావాదేవీలు చేసుకోవచ్చు. అంతకుమించిన చెల్లింపులు చేయాల్సి వస్తే, ఐటీ శాఖవారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ పెట్టుబడులు : చాలా మంది స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇలాంటివారు ఏడాదికి గరిష్ఠంగా రూ.10 లక్షలు వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆర్థిక లావాదేవీలు చేయవచ్చు. ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్స్ రూ.10 లక్షలు పరిమితిని దాటితే ఐటీ శాఖ నోటీసులు పంపిస్తుంది.
ఈ తప్పులు చేయవద్దు!
మనం చేసే ఆర్థిక లావాదేవీలను ఐటీ శాఖ నిశితంగా పరిశీలిస్తుంది. కనుక ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కానివారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ ఆదాయం పెరిగినా, లేక పరిమితికి మించి ఆర్థిక లావాదేవీలు నిర్వహించినా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. లేదంటే ఆదాయ పన్నుశాఖ మీకు నోటీసులు పంపిస్తుంది. పైగా ఆర్థిక లావాదేవీల్లో ఏదైనా అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే, మీపై తగిన చర్యలు కూడా తీసుకుంటుంది.
మీ ఫోన్ పోయిందా? పేటీఎం/ గూగుల్ పే/ ఫోన్‌పే వాలెట్లలోని డబ్బును కాపాడుకోండిలా!
స్మాల్ క్యాప్ Vs మిడ్ క్యాప్ Vs లార్జ్ క్యాప్ స్టాక్స్ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్!