రెండు అవుట్‌లెట్‌లు.. 8మంది ఉద్యోగులు.. పెద్దగా పరిచయం లేని కంపెనీ.. ఐపీఓలో అదరగొట్టేసింది! అవును మీరు చదివింది నిజమే. దిల్లీకి చెందిన రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ సంస్థ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజ్ సెగ్మెంట్‌లో(SME) ఐపీఓకు వచ్చిన ఆ కంపెనీకి రూ.4,800 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. రూ.12 కోట్ల ఐపీఓకు ఏకంగా 419 రెట్లు ఓవర్ స్క్రైబ్ అవ్వడం గమనార్హం.
Resourceful Automobile IPO : 2018లో రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ కంపెనీ ప్రారంభం అయింది. సహానీ ఆటోమొబైల్ బ్రాండ్ పేరుతో ప్రస్తుతం బిజినెస్ చేస్తోంది. యమహా కంపెనీతో డీలర్షిప్ ఉన్న ఆ సంస్థ- మోటార్ సైకిళ్లు, స్కూటర్ల సేల్స్, సర్వీసింగ్‌ను నిర్వహిస్తోంది. ఆ సంస్థకు ఉన్న రెండు షోరూమ్‌లలో 8 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
ఆగస్టు 22 నుంచి 26 వరకు ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కొనసాగింది. ఒక్కో షేరును రూ.117 చొప్పున సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంచగా, 40.76 కోట్ల బిడ్లు దాఖలయయ్యాయి. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 315.61 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 496.22 రెట్లకు సమానమైన బిడ్లు దాఖలు చేయడం విశేషం. ఆగస్టు 29న బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ కానున్న రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ సంస్థ, ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కొత్త షోరూమ్‌లను తెరవడం కోసం, రుణాలతోపాటు నిర్వహణ ఖర్చుల కోసం వినియోగించుకుంటామని తెలిపింది.
మరోవైపు, హీరో గ్రూప్‌నకు చెందిన ఆటో కాంపొనెంట్ సంస్థ అయిన హీరో మోటార్స్ IPOకు సిద్ధమైంది. ఈ మేరకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి కోరుతూ ప్రాథమిక పత్రాలు సమర్పించింది. ఐపీఓ ద్వారా రూ.900 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పబ్లిక్ ఇష్యూలో కొత్తగా రూ.500 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయాలనుకుంటున్నట్లు ప్రాథమిక పత్రాల్లో పేర్కొంది. మరో రూ.400 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయానికి ఉంచుతున్నట్లు తెలిపింది. కంపెనీ ప్రమోటర్లు ఓపీ ముంజల్ రూ.250 కోట్ల విలువైన షేర్లను ఓఎఫ్‌ఎస్ ద్వారా విక్రయించనున్నారు. ఇతర ప్రమోటర్లయిన భాగ్యోదయ్, హీరో సైకిల్స్ రూ.75 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌లో మరో రూ.100 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ ఇది విజయవంతమైతే ఐపీఓ పరిమాణం తగ్గనుంది.