Reliance 1:1 Bonus Issue On Sep 5 : రిలయన్స్ షేర్ హోల్డర్లకు గుడ్ న్యూస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల హోల్డర్లకు 1:1 బోనస్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ సంస్థ అధిపతి ముకేశ్ అంబానీ తెలిపారు. దీనిపై సెప్టెంబర్ 5న నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం జరిగిన రిలయన్స్ సర్వసభ్య సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. అంతకుముందే బోనస్ షేర్ల జారీకి సంబంధించిన సమాచారన్ని సెబీకి పంపింది రిలయన్స్.
2017, 2009లోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇదే విధంగా తమ షేర్ హోల్డర్లకు 1: 1 నిష్పత్తిలో బోనస్ ఇచ్చింది. తాజాగా మరోసారి బోనస్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ముకేశ్ అంబానీ చెప్పిన నేపథ్యంలో మదుపరులు ఫుల్ కుష్ అవుతున్నారు.
" at 1.45 pm today, reliance industries limited has sent a notice to the stock exchanges that the board of directors will meet on 5th september to consider issuing bonus shares in the ratio of 1:1. when reliance grows, we reward our shareholders handsomely. and when our… pic.twitter.com/ngjsDQU2zx
— ANI (@ANI) August 29, 2024
కంపెనీలో జారీ చేసే అదనపు వాటాలను ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు ఉచితంగా ఇవ్వడాన్ని బోనస్ ఇష్యూ లేదా బోనస్ షేర్లు అంటారు. ఇప్పటికే వాటాదారుల వద్ద ఉన్న షేర్ల ఆధారంగా వీటిని కేటాయిస్తారు. మీ వద్ద రిలయన్స్ షేర్ ఒకటి ఉంటే, బోనస్‌గా మరో షేర్ లభిస్తుంది.
ఈ రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో రిలయన్స్ షేర్ ధర భారీ లాభాల్లోకి వెళ్లింది. ఏజీఎంలో ముకేశ్ అంబానీ బోనస్ గురించి ప్రకటన చేసిన తరువాత మరింత లాభాల్లోకి దూసుకుపోయింది. వాస్తవానికి రూ.3,007 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి మధ్యాహ్నం 2.29 సమయానికి 3,049 వద్దకు వెళ్లింది. ఒక దశలో రూ.3,065కు చేరుకుంది. చివరకు రూ.3,042 వద్ద స్థిరపడింది.
గ్రోత్ ఇంజిన్‌గా భారత్
రిలయన్స్ ఇండస్ట్రీస్ కేవలం స్వల్ప కాలిక లాభాల కోసం పనిచేయడం లేదని, దేశం కోసం సంపద సృష్టించడంపై దృష్టి సారించిందని ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు.
డీప్ టెక్ కంపెనీగా రిలయన్స్
రిలయన్స్ ఇప్పుడు డీప్ టెక్ కంపెనీగా రూపాంతరం చెందిందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత మానవులు ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన సమస్యలను సులువుగా పరిష్కరించుకునేందుకు అవకాశం ఏర్పడిందని ముకేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద గ్రోత్ ఇంజిన్లలో ఒకటని ఆయన పేర్కొన్నారు.
'రిలయన్స్ 2024 ఆర్థిక సంవత్సరంలో ఆర్ అండ్ డీ కోసం రూ.3,643 కోట్లు ఖర్చు చేసింది. గత నాలుగేళ్లలో కేవలం పరిశోధనల కోసం రూ.11వేల కోట్లు ఖర్చు పెట్టింది. మా వద్ద 1000 కంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఉన్నారు' అని ముకేశ్ అంబానీ తెలిపారు. అలాగే గతేడాది బయో-ఎనర్జీ ఇన్నోవేషన్, సోలార్, గ్రీన్ ఎనర్జీ సోర్సెస్, హైృ-వాల్యూ కెమికల్స్‌కు సంబంధించి 2,555 పేటెంట్లు ఫైల్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
'రిలయన్స్ ప్రపంచంలోని టాప్ 500 కంపెనీల్లో చేరడానికి 2 దశాబ్దాలు పట్టింది. తరువాతి రెండు దశాబ్దాల్లో ఇది టాప్-50లోకి చేరింది. సమీప భవిష్యత్‌లోనే ఇది టాప్-30లోకి చేరుతుందని నేను విశ్వసిస్తున్నాను' అని ముకేశ్ అంబానీ అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా కంపెనీగా రిలయన్స్
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా మార్కెట్‌గా ఉందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 490 మిలియన్ల కస్టమర్లతో, 8 శాతం గ్లోబల్ మొబైల్ టారిఫ్‌తో 'జియో' గ్లోబల్ మొబైల్ డేటా కంపెనీగా అవతరించిందని ఆయన అన్నారు. యూజర్లు నెలకు యావరేజ్‌గా 30 జీబీ వరకు డేటా వినియోగిస్తున్నారని తెలిపారు. అంతేకాదు జియో 5జీ, 6జీ టెక్నాలజీకి సంబంధి 350 పేటెంట్లను కూడా ఫైల్ చేసిందని ఆయన స్పష్టం చేశారు.
100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్
ముకేశ్ అంబానీ జియో యూజర్లకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ కింద్ యూజర్లకు 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ అందిస్తామని స్పష్టం చేశారు. దీని వల్ల యూజర్లు చాలా సురక్షితంగా తమ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు సహా డిజిటల్ కంటెంట్‌ను, డేటాను క్లౌడ్‌లో భద్రపరుచుకోవడానికి వీలవుతుంది. హయ్యర్ స్టోరేజ్ కావాలని అనుకునేవారికి ఇది కచ్చితంగా చాలా మంచి అవకాశం అని చెప్పవచ్చు.