Reliance Jio Data Traffic : భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో డేటా ట్రాఫిక్ (డేటా వినియోగం) పరంగా చైనా మొబైల్‌ను అధిగమించి, ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా అవతరించింది. 2024 మార్చి నాటికి జియో 48.18 కోట్ల చందాదారులను కలిగి ఉంది. అందులో 10.8 కోట్ల మంది జియో 5జీను వాడుతున్నారు. ఈ సంఖ్య భారతీయ టెలికాం మార్కెట్లో జియో బలమైన స్థానాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం జియో నెట్‌వర్క్ మొత్తం ట్రాఫిక్ 40.9 ఎక్సాబైట్‌లకు చేరుకుంది. వాస్తవానికి ఈ డేటా ఏటా 35.2 శాతం వరకు పెరుగుతోంది. 5G, హోమ్ సర్వీస్‌లు క్రమంగా పెరుగుతుండడమే ఇందుకు కారణం.
భారీగా పెరుగుతున్న 5జీ యూజర్స్
5G సబ్స్క్రైబర్ల నుంచి మాత్రమే జియోకు 28 శాతం శాతం వరకు డేటా ట్రాఫిక్ పెరుగుతోంది. దీనితోపాటు జియో ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) సేవలు కూడా డేటా ట్రాఫిక్ పెరుగుదలకు గణనీయంగా దోహదపడుతున్నాయి.
కొవిడ్ సంక్షోభం తరువాత నుంచే!
కొవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి జియో వార్షిక డేటా ట్రాఫిక్ చాలా డ్రెమటిక్‌గా 2.4 రెట్లు పెరిగింది. తలసరి నెలవారీ డేటా వినియోగం మూడేళ్ల క్రితం కేవలం 13.3 జీబీ ఉండగా, ప్రస్తుతం ఇది 28.7 జీబీకి పెరిగింది. ఈ పెరుగుదల భారతదేశంలో డిజిటల్ కనెక్టివిటీ పెరుగడాన్ని స్పష్టంగా నొక్కి చెబుతోంది.
ఆల్ హ్యాపీస్
జియో ఫలితాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ & ఎండీ ముకేశ్ అంబానీ ఆనందం వ్యక్తం చేశారు. కంపెనీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. "భారత ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల వృద్ధిని పెంపొందించడంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ విశేషమైన సహకారం అందించింది. జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం సహా అన్ని విభాగాలు పటిష్ఠమైన పనితీరును కనబర్చడం హర్షణీయం. జియోకు 10.8 కోట్లకు పైగా 5జీ కస్టమర్లు ఉన్నారు. ఇప్పటివరకు 2జీ వినియోగదారులను స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ చేయడం నుంచి ఏఐ ప్రొడక్ట్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయత్నాల వరకు అన్నింటికీ నాయకత్వం వహించాం. దేశాన్ని బలోపేతం చేయడంలో జియో తన వంతు పాత్రను పోషిస్తోంది" అని ముకేశ్ అంబానీ తెలిపారు.
జియో అదుర్స్
భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో త్రైమాసిక ఫలితాలను ఇటీవలే ప్రకటించింది. క్యూ4లో రూ.5,337 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,716 కోట్లతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.20,466 కోట్ల నికర లాభం వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇది FY23 కంటే 12.4 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.1,00,119 కోట్లుగా నమోదైంది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 10.2 శాతం పెరిగింది. పన్ను ముందు లాభాల్లో రూ.1,00,000 కోట్ల థ్రెషోల్డ్‌ను దాటిన మొదటి భారతీయ కంపెనీగా రిలయన్స్ నిలిచింది.
గూగుల్ వాలెట్ ఇండియాలో లాంఛ్ అవుతుందా? క్లారిటీ ఇదే! - Google Wallet
మొదటిసారి ITR ఫైల్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీ కోసమే! - ITR Filling Tips