Shantanu Naidu Tribute To Ratan Tata : దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మరణం యావత్ భారత దేశాన్ని కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలు, ప్రముఖులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ముఖ్యంగా ఆయన సన్నిహితులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో టాటాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి శంతను నాయుడు కూడా ఉన్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా రతన్ టాటా మృతికి నివాళులు అర్పించారు. తామిద్దరు కలిసి దిగిన ఓ పాత ఫొటోను షేర్ చేసి దానికి 'గుడ్‌బై మై డియర్ లైట్‌హౌస్' అంటూ ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.
"మీ నిష్క్రమణతో మన స్నేహంలో ఓ శూన్యం మిగిలింది. ఆ లోటును అధిగమించడానికి నేను ఈ జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవ్వడం వల్ల కలుగుతోన్న దుఃఖం ఏమాత్రం పూడ్చలేనిది. గుడ్‌బై మై డియర్ లైట్‌హౌస్" అని శంతను భావోద్వేగానికి లోనయ్యారు.
Shantanu Naidu, Ratan Tata's trusted assistant post an emotional goodbye to Ratan Tata#RatanTataPassedAway #tata #RatanTata pic.twitter.com/QtMGT4elxV
— Greater jammu (@greater_jammu) October 10, 2024
ఎవరీ శంతను నాయుడు?
చివరిదశలో రతన్ టాటాతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో శంతను ఒకరు. ఈ యువకుడితో టాటా స్నేహం అందరినీ ఆశ్చర్యపర్చింది. టాటా ట్రస్ట్‌లో అతి పిన్నవయస్కుడైనా జనరల్ మేనేజర్‌గానూ, అలాగే టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడైన అసిస్టెంట్‌గానూ శంతను వ్యవహరించిన తీరు ఎంతో మందిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్‌గా ఉంటున్నారు శంతను. తొలుత బిజినెస్ పరంగా మాట్లాడే ఈ ఇద్దరికీ ఆ తర్వాతి కాలంలో మంచి స్నేహం కుదిరింది. అలా 80స్లో ఉన్న టాటాకు, ఈ యువకుడికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే వీధి శునకాలపై ఉన్న ప్రేమే వీరిద్దరిని కలిపింది.
ఇదే కాకుండా పెద్ద వయస్కులతో స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు, వృద్ధాప్యంలో వారిపై చూపాల్సిన ఆప్యాయత రతన్‌జీతో స్నేహం వల్లే తనకు తెలిసిందంటూ శంతను ఓ సందర్భంలో వెల్లడించారు. ఆ ఆలోచన నుంచి పుట్టింటే 'గుడ్‌ఫెలోస్' అనే ఓ అంకుర సంస్థ. పిల్లలకు దూరంగా ఉన్న వయసు మళ్లిన వృద్ధులకు ఆసరాను అందించే లక్ష్యంతో దీన్ని శంతను ఏర్పాటు చేశారు. ఇందులో టాటా కూడా పెట్టుబడులు పెట్టారు. అంతేకాకుండా ఆ సంస్థ లాంచింగ్ కార్యక్రమానికి హాజరై అక్కడి వారితో సమయం గడిపారు.
దయామయుడు - మూగజీవాల కోసం భారీ ఆసుపత్రి నిర్మించిన రతన్ టాటా
చిన్నకార్లతో మిడిల్ క్లాస్ కల సాకారం- ఆటోమొబైల్ ఇండస్ట్రీపై టాటా మార్క్