PPF Special Scheme : పదవీ విరమణ సమయానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ప్రతీ ఒక్కరు భావిస్తుంటారు. ఆ దిశగా పక్కా ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేసుకుంటుంటారు. అయితే ఇలాంటి పెట్టుబడులకు సంబంధించి చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే మంచి మెచ్యూరిటీ బెనిఫిట్స్‌ను అందించే ‘పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) స్పెషల్ స్కీం’పై ఓ లుక్కేద్దాం రండి.
సురక్షిత పెట్టుబడి - పన్ను ప్రయోజనాలు
పీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టడం అనేది ఒక తెలివైన దీర్ఘకాలిక వ్యూహం అని చెప్పుకోవచ్చు. దీనిలో మనం చేసే డిపాజిట్లకు ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయం లభిస్తుంది. పీపీఎఫ్ స్కీంకు కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కూడిన భద్రత ఎలాగూ ఉంటుంది. ఈ పెట్టుబడి నుంచి మనకు వచ్చే రాబడిపై ట్యాక్స్ పడదు. రాబడిపై చక్రవడ్డీ ప్రయోజనం కూడా దక్కుతుంది. పీపీఎఫ్‌లో మనం పెట్టే పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు.
పెట్టుబడి పరిమితులు
పీపీఎఫ్ అకౌంటులో మనం ఒక సంవత్సరానికి కనిష్ఠంగా రూ.500 నుంచి మొదలుకొని గరిష్ఠంగా రూ.1.50 లక్షల దాకా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ స్కీం మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలు. మెచ్యూరిటీ గడువుకు ఒక ఏడాది ముందు అప్లై చేయడం ద్వారా ప్రతీసారీ చెరో ఐదేళ్ల పాటు పెట్టుబడి కాల వ్యవధిని పొడిగించుకోవచ్చు.
నెలకు రూ.5వేల పెట్టుబడితో భారీ ఆదాయాలు
ప్రతినెలా రూ.5వేలు పీపీఎఫ్ అకౌంటులో పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ.60వేలు జమ అవుతాయి. ఈ లెక్కన 15 ఏళ్లలో దాదాపు రూ.9 లక్షలు డిపాజిట్ అవుతాయి. మన పెట్టుబడిపై 7.1 శాతం వడ్డీ ఆదాయం లభిస్తుంది. వడ్డీ, చక్రవడ్డీ రూపంలో రూ.7,27,284 ఆదాయం వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే మెచ్యూరిటీ సమయానికి దాదాపు రూ.16.27 లక్షలు వస్తాయి. ఒకవేళ మీరు మీ పెట్టుబడి కాలవ్యవధిని పదేళ్లు పొడిగిస్తే (మొత్తం 25 సంవత్సరాలు), మీ పీపీఎఫ్ ఫండ్ విలువ దాదాపు రూ.42 లక్షలకు చేరుతుంది. ఈ 25 ఏళ్ల వ్యవధిలో మీకు వడ్డీ ద్వారా లభించే ఆదాయం రూ.26 లక్షలకుపైనే ఉంటుంది.
లోన్, ఉపసంహరణ సౌకర్యాలు
పీపీఎఫ్‌లో మనం ఒకేసారి పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. మన సౌలభ్యాన్ని బట్టి ప్రతినెలా నిర్దిష్ట మొత్తాన్ని కూడా పెట్టుబడిగా పెట్టొచ్చు. కనీసం 1 సంవత్సరం తర్వాత, ఏదైనా అత్యవసరం వస్తే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని మనం వెనక్కి తీసుకోవచ్చు. అయితే డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం అమౌంటు మాత్రమే విత్‌డ్రా చేయగలుగుతారు. పూర్తిగా పెట్టుబడి మొత్తాన్ని విత్‌డ్రా చేయాలంటే, పీపీఎఫ్ అకౌంటు కనీసం ఆరేళ్లపాటు యాక్టివ్‌గా ఉండాలి. పీపీఎఫ్ స్కీంలో మూడేళ్ల ఇన్వెస్ట్‌మెంట్ తర్వాత మనం జమ చేసే అమౌంటుపై లోన్‌ను పొందొచ్చు.
అప్పులు దొరకట్లేదా? బ్యాంకులు నో అంటున్నాయా? ఇలా చేస్తే లోన్ గ్యారెంటీ! - Personal Loan Rejected