EPFO Latest News : ఈపీఎఫ్ఓ ఖాతాదారులు త్వరలోనే బ్యాంకింగ్ సిస్టమ్‌తో సమానంగా సేవలు పొందనున్నారని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా వెల్లడించారు. ఖాతాదారులు ఇకపై తమ పీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. ఇందుకోసం ఈపీఎఫ్‌ఓ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు. ఆమె చెప్పిన మరిన్ని విశేషాలు:
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కలిగే బెస్ట్ బెనిఫిట్స్ ఇవే!
- ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరుస్తున్నారు.
- 2025 జనవరిలోపు హార్డ్‌వేర్ అప్‌గ్రేడేషన్ జరిగే అవకాశం ఉంది. దీని వల్ల ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు పొందడానికి వీలవుతుంది.
- పీఎఫ్ క్లెయిమ్ సహా అన్ని ప్రక్రియలను మరింత సులువుగా, సమర్థవంతంగా చేసేందుకు వ్యవస్థాగత సంస్కరణలు తీసుకురావడానికి ఈపీఎఫ్‌ఓ కృషి చేస్తోంది.
- బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా ఈపీఎఫ్‌ఓ వ్యవస్థలను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పనిచేస్తోంది.
- ఖాతాదారుల జీవన సౌలభ్యం కోసం మరింత పారదర్శకంగా, క్లెయిమ్ ప్రాసెస్ జరిగేలా చూడడమే లక్ష్యంగా ఈపీఎఫ్‌ఓ పనిచేస్తోంది.
- కొత్త విధానం ప్రకారం, లబ్ధిదారులు లేదా క్లెయిం చేసేవాళ్లు తమకు వచ్చే డబ్బులను నేరుగా ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు.
- ఒక వేళ ఈపీఎఫ్ ఖాతాదారులు మరణిస్తే, వారి వారసులకు ఎంప్లాయూస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్‌ఐ) పథకం కింద గరిష్ఠంగా రూ.7 లక్షలు అందిస్తారు.
- కొత్త వ్యవస్థలో ఈపీఎఫ్‌ఓ చందాదారులు వారసులు కూడా తమ క్లెయిమ్ సెటిల్‌మెంట్ డబ్బులను నేరుగా ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది.
- ఈపీఎఫ్‌ఓ హార్డ్‌వేర్ అప్‌గ్రేడేషన్ పూర్తయిన తరవాత కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
- త్వరలోనే ఈపీఎఫ్‌ఓ సబ్‌స్క్రైబర్లకు సరికొత్త డెడికేటెడ్ కార్డులను జారీ చేస్తారు. వీటి ద్వారా వారు నేరుగా ఏటీఎం నుంచి తమ పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు.
- ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓలో ఈపీఎఫ్, పెన్షన్, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ల కింద సుమారుగా 7 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు.