Pink Tax : మనకు ఇన్‌కమ్ ట్యాక్స్(ఐటీ) గురించి తెలుసు! గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) గురించి తెలుసు! కానీ చాలా మందికి ‘పింక్ ట్యాక్స్’ (పీటీ) గురించి తెలియదు. ఇది కూడా ప్రభుత్వం విధించే ట్యాక్సే అనుకుంటే, మీరు తప్పులో కాలేసినట్టే. ఈ ట్యాక్స్‌ను నేరుగా కంపెనీలే బాదేస్తుంటాయి. ప్రత్యేకించి మహిళలకు సంబంధించిన సౌందర్య ఉత్పత్తులు, ఉపకరణాలు, దుస్తులు తయారు చేసే కంపెనీలు పింక్ ట్యాక్స్ బాదుడుతో లాభాలు గడిస్తుంటాయి. ఎలా అంటే? ఉదాహరణకు షేవింగ్ చేసుకునేందుకు వాడే ఒక పురుషుల రేజర్ ధరతో పోలిస్తే, మహిళలు వినియోగించే పింక్ రేజర్ ధర ఎక్కువగా ఉంటుంది. ఈ తేడాకు కారణం పింక్ ట్యాక్స్ బాదుడే. ఈ విధంగా లింగ వివక్షతో, ఏకపక్షంగా పింక్ ట్యాక్సును మోపుతున్నందు వల్లే మహిళలకు సంబంధించిన సౌందర్య ఉత్పత్తుల రేట్లు మండిపోతున్నాయి. ఫలితంగా వాటిని కొనేందుకు చాలా మంది మహిళలు మొగ్గుచూపలేకపోతున్నారు.
ఆ సాకుతో ధరల బాదుడు!
పింక్ ట్యాక్స్ బాదుడు వల్ల మహిళలు వినియోగించే రేజర్లు, షాంపూల నుంచి మొదలుకొని డ్రై క్లీనింగ్ వరకు అనేక ఉత్పత్తులు, సేవల రేట్లు చుక్కలను అంటుతున్నాయి. పురుషుల సౌందర్య ఉత్పత్తులకు, మహిళల సౌందర్య ఉత్పత్తులకు రంగులో తేడా ఉంటుంది. చాలా వరకు మహిళల ప్రత్యేక సౌందర్య ఉత్పత్తులు, ఉపకరణాలు పింక్ కలర్‌లో లభిస్తుంటాయి. రంగుతో పాటు క్వాలిటీలోనూ పెద్ద తేడా ఉంటుందనే సాకుతో కంపెనీలు ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం, మహిళలు తాము కొనే ప్రత్యేక ఉత్పత్తులకు సగటున 7 శాతం దాకా అదనపు రేటును చెల్లిస్తున్నారు. మహిళలు కొనే ఇతర సాధారణ ఉత్పత్తుల రేట్లు కూడా 13 శాతం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. చివరకు మహిళల హెయిర్ కటింగ్ రేట్లు కూడా పురుషుల హెయిర్ కటింగ్ రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు మహిళలకు మంజూరు చేసే ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంలు కూడా చాలా అధికంగా ఉన్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. మహిళలు తాము తీసుకునే లోన్లకు కూడా అధికంగా వడ్డీరేట్లను కట్టాల్సి వస్తోందని ఆయా స్టడీల్లో తేలింది.
చిన్న విషయమేం కాదు!
పింక్ ట్యాక్స్ బాదుడు అనేది చిన్న విషయమేం కాదు. మహిళలకు సంబంధించిన ప్రత్యేక ఉత్పత్తుల ధరల్లో ఉండే తేడా అంతా కలిపితే, ఏటా కొన్ని వందల కోట్లు అవుతుంది. అంటే అంత మొత్తంలో మహిళలు నష్టపోతున్నారన్న మాట. ఒకవేళ పింక్ ట్యాక్స్ బాదుడును ప్రభుత్వాలు తమ నియంత్రణ సంస్థల ద్వారా ఆపగలిగితే, ఇంత భారీ దోపిడీ నుంచి మహిళా లోకం రక్షణ పొందుతుంది. దీని వల్ల పొదుపు చేసుకోవడానికి ఏటా చాలా మొత్తం వారి అకౌంట్లలో మిగులుతుంది. ఆ డబ్బును వారు జీవితంలో ఎదురయ్యే అత్యవసరాల కోసం వినియోగించుకునేందుకు ఆస్కారం కలుగుతుంది. మహిళలపై వివక్షకు ప్రతిరూపంగా నిలుస్తున్న పింక్ ట్యాక్స్ బాదుడును నిలువరిస్తే, సమన్యాయం అనే పదానికి ప్రభుత్వం స్పష్టమైన నిర్వచనం ఇచ్చినట్లు అవుతుంది. ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలు ఇప్పటికే ఈ దిశగా చర్యలు చేపట్టాయి. వస్తువులు, సేవల ధరలను నిర్ణయించే క్రమంలో లింగ వివక్షకు తావులేకుండా చేసే చట్టాలను అవి అమల్లోకి తెచ్చాయి. మన దేశంలోనూ వస్తువుల ధరల నిర్ణయంలో లింగ వివక్షకు తావు ఇవ్వకుండా నడుచుకునేలా కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు.
భవిష్యత్ కోసం మనీ సేవ్ చేయాలా? ఈ 5 టిప్స్ మీ కోసమే! - Money Saving Tips
వాట్సాప్‌లో ITR ఫైల్ చేయాలా? ఇదీ ప్రాసెస్! - How To File ITR Via WhatsApp