Petrol Price Comparison State Wise : పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా? ఆంధ్రప్రదేశ్!! వైసీపీ అధికారంలో ఉన్న ఏపీలో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.109.87, డీజిల్ ధర 97.6గా ఉంది. దక్షిణాదిలోని తెలంగాణ, కేరళలోనూ పెట్రోలు రేట్లు దాదాపు ఇదే రేంజ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణలో లీటరు పెట్రోలు ధర రూ.107.39, డీజిల్ ధర రూ.95.63గా ఉంది. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో లీటరు పెట్రోలు ధర రూ.107.54, డీజిల్ ధర రూ.96.41గా ఉంది. ఈ రాష్ట్రాల్లో స్థానిక సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్‌లు ఎక్కువగా ఉన్నందున పెట్రోలు, డీజిల్ రేట్లు ఇంతలా మండిపోతున్నాయి.
వ్యాట్ తక్కువగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు, పలు రాష్ట్రాల్లో ఇంధన రేట్లు తక్కువగానే ఉన్నాయి. లీటరు పెట్రోలు ధర అండమాన్ నికోబార్ దీవుల్లో రూ.82, సిల్వస్సా అండ్ డామన్‌లో రూ. 92.38 మాత్రమే ఉంది. పెట్రోలు ధర తక్కువగా ఉన్న రాష్ట్రాలు/యూటీల జాబితాలో దిల్లీ (లీటరుకు రూ. 94.76), గోవా (రూ. 95.19), మిజోరం (రూ. 93.68), అసోం (రూ. 96.12) ఉన్నాయి. చౌకైన డీజిల్ లభిస్తున్న రాష్ట్రాలు/యూటీల లిస్టులో అండమాన్ నికోబార్ దీవులు (లీటరుకు రూ.78), దిల్లీ (రూ. 87.66), గోవా (రూ. 87.76) ఉన్నాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇలా..
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ పెట్రోలు, డీజిల్ రేట్లు ఎక్కువే ఉన్నాయి. లీటరు పెట్రోల్ ధర మధ్యప్రదేశ్‌లో రూ.106.45, బిహార్‌లో రూ.105.16, రాజస్థాన్‌లో రూ.104.86, మహారాష్ట్రలో రూ.104.19 ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం పెట్రోలు రేటు కాస్త తక్కువగా రూ.100.37గా ఉంది. మమతా బెనర్జీకి చెందిన రాజకీయ పార్టీ టీఎంసీ అధికారంలో ఉన్న బంగాల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.103.93గా ఉంది. నవీన్ పట్నాయక్ పార్టీ అధికారంలో ఉన్న ఒడిశాలో పెట్రోలు ధర రూ.101.04, డీఎంకే పాలిస్తున్న తమిళనాడులో రూ. 100.73గా ఉంది. బీజేపీ పాలిత మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్‌లో డీజిల్ రేటు సగటున రూ.92 నుంచి రూ.93 రేంజ్‌లో ఉంది.
రూ.2 తగ్గింపు.. రూ.33వేల కోట్లు లాస్!
గత వారమే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 2 రూపాయల చొప్పున తగ్గించాయి. ఆ తర్వాత ఇంధన ధరలు కొంతమేర దిగొచ్చాయి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రేట్లు అత్యధికంగా కొనసాగుతూ ఉండడం గమనార్హం. సేల్స్ ట్యాక్స్, వ్యాట్‌లను తగ్గించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపితే ఈ రేట్లు కొంతైనా దిగ్గొచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం వల్ల ఇటీవల రూ.2 చొప్పున పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గాయి. అయితే ఈ నిర్ణయంతో సామాన్యులకు కొంత ఊరట లభిస్తుంది. కానీ ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం భారీగా నష్టపోనున్నాయి. ఎంతగా అంటే.. వాటి వార్షిక ఆదాయంలో దాదాపు రూ.30వేల కోట్ల మేర ఈసారి కోల్పోతాయని అంచనా వేస్తున్నారు.