Petrol Diesel Price Reduction : సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అధిక ఇంధన ధరలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. సవరించిన ఈ ధరలు మార్చి 15 శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను దేశవ్యాప్తంగా సవరిస్తున్నట్లు సమాచారం ఇచ్చాయని పెట్రోలియం శాఖ వెల్లడించింది. ఈ తగ్గింపు నిర్ణయం వినియోగదారులకు ఊరటనిస్తుందని, డీజిల్‌తో నడిచే 58 లక్షల గూడ్స్ వాహనాలు, ఆరు కోట్ల కార్లు, 27 కోట్ల ద్విచక్రవాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని పేర్కొంది. లీటర్ పెట్రోల్‌పై రూ.2 తగ్గిస్తూ తీసుకున్న తాజా నిర్ణయంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం నుంచి ఇలా ఉండనున్నాయి.
- దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72
- ముంబయిలో రూ.104.21
- కోల్‌కతా రూ.103.94
- చెన్నై రూ.100.75
సవరించిన ధరల ప్రకారం లీటర్ డీజిల్ ధర వివిధ నగరాల్లో మార్చి 15 నుంచి ఈ విధంగా ఉండనున్నాయి.
- దిల్లీ- రూ.87.62
- ముంబయి- రూ.92.15
- కోల్‌కతా- రూ.90.76
- చెన్నై- 92.34
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఎల్లప్పుడూ కోట్లాది భారతీయుల సంక్షేమం, సౌలభ్యమే లక్ష్యమని మరోసారి నిరూపించుకున్నారని కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పురీ ట్వీట్ చేశారు.
మహిళలకు మోదీ ఉమెన్స్ డే గిఫ్ట్
అంతకుముందు మహిళ దినోత్సవం సందర్భంగా మోదీ ప్రభుత్వం గృహిణీలకు శుభవార్త చెప్పింది. 14.82 కేజీల వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల లక్షలాది కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపింది. ముఖ్యంగా 'నారీశక్తి'కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. మహిళా సాధికారత, సులభతర జీవన విధానాన్ని అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
సబ్సిడీ గడువు పొడిగింపు
ప్రస్తుతం 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ. 955గా ఉండగా కేంద్రం నిర్ణయంతో రూ.855కి చేరుకుంది. దేశ రాజధాని దిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 803కు తగ్గింది. కోల్‌కతాలో రూ.829కు, ముంబయిలో రూ.802.50కు చేరుకుంది. మరోవైపు, ఉజ్వల యోజన కింద ఎల్‌పీజీ సిలిండర్‌పై అందిస్తున్న రూ.300 రాయితీని వచ్చే ఆర్థిక సంవత్సరం(2024-25) వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ఇటీవలే ప్రకటించింది.
నెలవారీ ఆదాయం కావాలా? పోస్టాఫీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే రూ.9వేలు ఇన్కమ్ పక్కా!
ఆర్థిక కష్టాల్లో ఆదుకునే బీమా పాలసీలు- ఇన్సూరెన్స్ రకాలు, వాటి ప్రయోజనాలేంటో తెలుసా?