Ola EV Scooter Offers : విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా (Ola electric) తన ఎంట్రీ లెవెల్ స్కూటర్స్ అయిన ఎస్1 ఎక్స్ (S1 X) సిరీస్ ధరలను భారీగా తగ్గించింది. ఇకపై ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.69,999 (ఎక్స్ షోరూమ్) నుంచే ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. కొత్త ధరలను ఓలా కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తొలిసారి విద్యుత్ స్కూటర్లు కొనుగోలు చేసేవారికి తక్కువ ధరలకే స్కూటర్లను అందించనున్నట్లు తెలిపింది. అంతేకాదు వచ్చే వారం నుంచే డెలివరీలు కూడా ప్రారంభిస్తామని పేర్కొంది.
Ola EV Scooter Prices : కొత్త ఎస్1 ఎక్స్ 3 బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్కూటర్లు 8 ఏళ్లు/80వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీతో వస్తాయి.
- 2 kWh వేరియంట్ ధర రూ.69,999 (ప్రారంభ ఆఫర్)
- 3 kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.84,999
- 4 kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.99,999
Ola EV Scooter Features : ఫీచర్ల విషయానికొస్తే, ఎస్1 ఎక్స్ స్కూటర్లు ఫిజికల్ కీతో వస్తాయి. ఇందులో 2 kWh స్కూటర్ ఐడీసీ రేంజ్ 95 కిలోమీటర్లు ఉంటుంది. 3 kWh స్కూటర్ 143 కిలోమీటర్లు, 4 kWh 190 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.
ఎస్ 1ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో 6kW మోటార్ ఉంటుంది. ఈ ఈవీ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని ఓలా కంపెనీ తెలిపింది. 2 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ టాప్ స్పీడ్ 85 కిలోమీటర్లు. మిగిలిన రెండు స్కూటర్లు గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఈ స్కూటర్లలో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. క్రూయిజ్ కంట్రోల్, రివర్స్‌మోడ్, ఓలా ఎలక్ట్రిక్ యాప్‌తో కనెక్టివిటీ లాంటి పలు లేటెస్ట్ ఫీచర్లు వీటిలో ఉన్నాయి. మొత్తం 7 కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్లు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. ఓలా స్కూటర్లకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. అందుకే గత రెండున్నరేళ్లలో మొత్తం 5 లక్షల వాహన రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని ఓలా కంపెనీ పేర్కొంది.
రూ.70వేలు బడ్జెట్లో మంచి టూ-వీలర్ కొనాలా? టాప్-10 బైక్స్ & స్కూటీస్ ఇవే! - Best Bikes Under 70000