Nifty All Time High Price : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం రాణించిన స్టాక్ మార్కెట్ సూచీలు, గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగడం వల్ల ఆఖర్లో నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా చివరి అరగంటలో సూచీలు ఒక్కసారిగా నష్టాల్లోకి చేరుకున్నాయి. దీంతో డే మధ్యలో 22,783.35 వద్ద సరికొత్త గరిష్ఠాలకు అందుకున్న నిఫ్టీ, మళ్లీ 22,600 పాయింట్ల వద్ద స్థిరపడింది.
దాదాపు రోజంతా లాభాల్లోనే!
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ- సెన్సెక్స్ మంగళవారం ఉదయం 74,800 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. దాదాపు రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 75,111.39 పాయింట్ల వద్ద గరిష్ఠాలను తాకిన సూచీ తర్వాత ఒక్కసారిగా కుదేలైంది. చివరకు 188.50 పాయింట్ల నష్టంతో 74,482.78 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్ఛేంజీ- నిఫ్టీ 38.55 పాయింట్ల నష్టంతో 22,604.85 వద్ద స్థిరపడింది.
- లాభపడిన స్టాక్స్ : సెన్సెక్స్-30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, హీరో మోటోకార్ప్ , యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, అల్ట్రా సెమ్కో, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, మారుతీ, ఏషియన్ పెయింట్, ఎన్టీపీసీ
- నష్టపోయిన షేర్స్ : టైటాన్, ఐటీసీ, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్ టెల్, టీసీఎస్, టాటాస్టీల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ
క్రూడ్ బ్యారెల్ ధర : అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 0.21 శాతం పెరిగి 88.53 డాలర్లుకు చేరుకుంది.
రూపాయి విలువ : డాలరుతో రూపాయి మారకం విలువ 83.43గా ఉంది.
అమెరికా ఫెడ్ పాలసీ సమావేశానికి ముందు గ్లోబల్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. గత రెండు సెషన్లలో లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు అందుకే మంగళవారం నష్టపోయి ఉంటాయని అంచనా వేశారు.