Nirmala Sitharaman Budget 2024 : కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఆరో బడ్జెట్ కానుంది. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె సమం చేయనున్నారు. భారతదేశంలో తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ఘనత సాధించిన ఆమె 2019 జులై నుంచి ఇప్పటివరకు ఐదు పూర్తి స్థాయి బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. మరో కొద్ది రోజుల్లో ఆరో బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
మొరార్జీ దేశాయ్ 1959-1964 మధ్య ఆర్థిక మంత్రిగా 5 వార్షిక బడ్జెట్‌లను, ఒక తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. డాక్టర్ మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హాలు కూడా వరుసగా ఐదు సార్లు బడ్జెట్‌ను సమర్పించారు. వీళ్ల రికార్డును త్వరలో నిర్మలా సీతారామన్ అధిగమించనున్నారు.
తాత్కాలిక బడ్జెట్ ఎందుకంటే?
సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్‌ను మధ్యంతర బడ్జెట్‌గా వ్యవహరిస్తారు. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు తీరాక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు, ప్రభుత్వం కొన్ని రకాల వ్యయాలను చేసేందుకు అనుమతి అవసరం. దీనికోసమే మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ ఏడాది ఏప్రిల్- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
వరుసగా ఆరోసారి
- 2014లో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2014-19 మధ్య వరుసగా 5 బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.
- ఆ తర్వాత జైట్లీ ఆరోగ్యం దెబ్బతింది. దీనితో పీయూష్ గోయల్‌కు ఆర్థికమంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గోయల్ 2019-20లో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.
- 2019లో నరేంద్ర మోదీ నేతృత్వలో రెండోసారి భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
- భారతదేశంలో ఇందిరా గాంధీ తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ నిలిచారు. ఇందిరా గాంధీ 1970-71 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించారు.
- భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు బ్రీఫ్‌కేస్‌తో ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు హాజరవడం సంప్రదాయంగా ఉండేది. దాన్ని నిర్మలా సీతారామన్ పక్కకుపెట్టారు.