Most Successful Indian Businessman First Job : దేశంలోని అత్యంత సంపన్నులైన రతన్ టాటా, గౌతమ్ అదానీ వంటివారి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని, వారు ఆ స్థాయికి ఎలా చేరుకోగలిగారని, అసలు వారు మొదట్లో ఏం చేసేవారన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. వాస్తవానికి రతన్ టాటా, గౌతమ్ అదానీ వంటివారు రాత్రికి రాత్రే ఆ స్థాయికి చేరుకోలేదు. వారు కూడా తొలుత చిన్నచిన్న ఉద్యోగాలు చేసినవారే. వాళ్లు అత్యంత నిబద్ధతతో ఆయా రంగాల్లో పట్టు సాధించి జీవితంలో అత్యన్నత స్థాయికి చేరుకుని, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అందుకే ఈ ఆర్టికల్‌లో ధీరూబాయ్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ, సుధామూర్తి మొదలైన గొప్ప వ్యాపారవేత్తల తొలి జీవితం, వారు చేసిన మొదటి ఉద్యోగం గురించిన వివరాలు తెలుసుకుందాం.
ధీరూభాయ్ అంబానీ
ధీరూభాయ్ అంబానీ గుజరాత్‌లోని ఓ మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక పాఠశాల దశలోనే చదువు మానేశారు. కూలీ పనులకు వెళ్లేవారు. ధీరూభాయ్ అంబానీ 17ఏళ్ల వయసులోనే యెమన్ వెళ్లారు. అక్కడ ఏడెన్‌లోని గ్యాస్‌స్టేషన్‌లో అటెండర్‌గా మొదటి ఉద్యోగం చేశారు. ఆయన మొదటి జీతం రూ.300. అంత తక్కువ జీతంతో ప్రస్థానం ప్రారంభించిన ధీరూభాయ్ అంబానీ ఆ తర్వాత దిగ్గజ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయన మరణించినప్పటికీ ఆయన కుమారుడు ముకేశ్ అంబానీ వ్యాపారాల్లో అదరగొడుతున్నారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ ఆస్తుల మొత్తం విలువ 109 బిలియన్ డాలర్లుగా ఉంది.
రతన్ టాటా
భారతదేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో రతన్ టాటా ఒకరు. ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి పురస్కారాలు వరించాయి. ఆయన దేశ ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. రతన్ టాటా 1961లో టాటా స్టీల్ కంపెనీలో చేరారు. అక్కడ జరిగే పనులను (మేనేజింగ్ ఆపరేషన్స్) పర్యవేక్షిస్తుండేవారు. అదే ఆయన మొదటి ఉద్యోగం. ఆ తర్వాత ఆయన టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ (టెల్కో)లో ఆరు నెలలపాటు ట్రైనీగా ఉద్యోగం చేశారు. ఐబీఎమ్ నుంచి మంచి సాలరీతో ఆఫర్ వచ్చినప్పటికీ, ఆయన టాటా స్టీల్‌లోనే తొలి ఉద్యోగం చేశారు. ప్రస్తుతం రతన్ టాటా దేశంలోని అత్యంత గొప్ప ధనికుల్లో ఒకరిగా ఉన్నారు.
కిరణ్ మజుందార్ షా
బయోకాన్ లిమిటెడ్ ఛైర్పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ సక్సెస్ఫుల్ మహిళా వ్యాపారవేత్తగా పేరుపొందారు. ఆమె బెంగళూరులో బయోకాన్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించారు. అయితే ఆమె మొదటిసారి ఆస్ట్రేలియా, మెల్బోర్న్లోని బ్రూవరీస్‌లో ట్రైనీ బ్రూవర్‌గా పని చేశారు. ఆ తర్వాత భారత్‌కు వచ్చారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆమె పట్టు వదలకుండా కంపెనీని ప్రారంభించి విజయం సాధించారు. 2.5 బిలియన్ డాలర్ల సంపదతో ఆమె భారతదేశంలోని ఐశ్వర్యవంతుల్లో ఒకరిగా నిలిచారు.
గౌతమ్ అదానీ
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 111 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. అదానీ గ్రూప్ పేరిట పలు వ్యాపారాలను ఆయన చేస్తున్నారు. గౌతమ్ అదానీ యుక్త వయస్సులోనే (1978)ముంబయికి వెళ్లారు. మహేంద్ర బ్రదర్స్ అనే వజ్రాల దుకాణంలో మొదటి ఉద్యోగం చేశారు. అక్కడే దాదాపు రెండుమూడేళ్లు పనిచేసిన తర్వాత ముంబయిలోని జవేరీ బజార్‌లో సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఉన్నారు అదానీ.
సుధామూర్తి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి అయిన సుధామూర్తి కర్ణాటకలోని షిగ్గావ్‌లో 1950లో జన్మించారు. ఆమె చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఆమె మొదట్లో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం అయిన టాటా మోటార్స్‌లో ఇంజినీర్‌గా పనిచేశారు. ఆ కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్ కూడా ఆమే. తరువాత ఆమె ప్రొఫెసర్‌గానూ పనిచేశారు. ఇన్ఫోసిస్‌లో ఆమెకు భారీ స్థాయిలో షేర్లు ఉన్నాయి.
ఇంద్రా నూయీ
ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన పెప్సికోకు ఇంద్రా నూయీ 12 ఏళ్ల పాటు సీఈఓగా పనిచేశారు. 1955లో భారత్‌లో జన్మించిన ఇంద్రా నూయీ వ్యాపారంలో ఉన్నత శిఖరాలకు చేరారు. 18 ఏళ్ల వయసులో ఇంద్రా నూయీ ఓ బ్రిటిష్ టెక్స్టైల్ సంస్థలో వ్యాపార వ్యూహకర్తగా పనిచేశారు. అదే ఆమె మొదటి ఉద్యోగం. ఆ తర్వాత ముంబయిలోని జాన్సన్ & జాన్సన్లో ప్రొడక్ట్ మేనేజర్‌గా కూడా పనిచేశారు.
అర్దేషిర్ గోద్రెజ్
గోద్రెజ్ గ్రూప్ అధినేత అర్దేషిర్ గోద్రెజ్ తొలుత ఓ కెమిస్ట్ షాపులో అసిస్టెంట్‌గా పనిచేశారు. అనంతరం ఆయన తాళాలు తయారుచేసే వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒక చిన్న షెడ్లో వ్యాపారం ప్రారంభించిన ఆయన, అంచెలంచెలుగా ఎదిగి, తన వ్యాపారాన్ని విస్తరించారు. ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అర్దేషిర్ గోద్రెజ్ మరణించినప్పటికీ ఆయన వారసులు సబ్బులు, గృహోపకరణాల నుంచి స్థిరాస్తి దాకా వివిధ వ్యాపార రంగాల్లోకి విస్తరించారు. దేశంలో దిగ్గజ వ్యాపారసంస్థల సరసన గోద్రెజ్ గ్రూప్‌ను నిలిపారు.
సత్య నాదెళ్ల చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే - ఉద్యోగులకు ప్రమోషన్ గ్యారెంటీ! - Satya Nadella Life Lessons
మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? ఈజీగా మార్చుకోండిలా! - How To Exchange Torn Notes