Survey On UPI Transaction Fee : భారతదేశంలో యూపీఐ లావాదేవీలు ఎంత భారీ ఎత్తున జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ యూపీఐ లావాదేవీలపై ట్రాన్షాక్షన్ ఛార్జీలు కనుక విధిస్తే కచ్చితంగా ఈ సేవలను వినియోగించడం మానేస్తామని దాదాపు 75 శాతం మంది యూజర్లు చెప్పినట్లు లోకల్ సర్కిల్స్ చేపట్టిన ఓ సర్వే ద్వారా తెలిసింది.
సర్వే ప్రకారం
- సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 38 శాతం మంది తాము చేసే ఆర్థిక లావాదేవీల్లో 50 శాతానికి పైగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్లు తెలిపారు. డెబిట్, క్రెడిట్ లేదా మరో ఇతర డిజిటల్ లావాదేవీలు కంటే యూపీఐ లావాదేవీలకే వారు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
- సర్వేలో పాల్గొన్న వారిలో 22 శాతం మంది యూపీఐ వినియోగదారులు మాత్రమే ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ 75 శాతం మంది యూజర్లు మాత్రం ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేస్తే, కచ్చితంగా సదరు సేవలు వాడడం ఆపేస్తామని తెలిపారు.
- దేశంలోని ప్రతి 10 మంది యూజర్లలో నలుగురు యూపీఐ వాడుతున్నారు. అయితే ఈ యూపీఐ లావాదేవీలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఛార్జీలు విధించినా- అందుకు వారు విముఖంగా ఉన్నారు.
దేశంలోని దాదాపు 308 జిల్లాల్లో 42,000 మంది యూజర్లను అడిగి ఈ సర్వే ఫలితాలు ప్రకటించారు. అయితే సర్వేలో అడిగిన ప్రశ్నలకు భిన్నమైన సమాధానాలు వచ్చాయి. యూపీఐ లావాదేవీల రుసుముకు సంబంధించిన ప్రశ్నలకు 15,598 ప్రతిస్పందనలు వచ్చాయి. ఈ సర్వే జులై 15 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ఆన్లైన్లో చేశారు.
భారీగా పెరిగిన లావాదేవీలు
'గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, 2023-24లో యూపీఐ లావాదేవీలు రికార్డ్ స్థాయిలో (57 శాతం వరకు) పెరిగాయి. విలువపరంగా చూస్తే 44 శాతం పెరుగుదల నమోదైంది' అని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది.
2022-23లో దేశంలో 84 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. కానీ ఇప్పుడు ఈ లావాదేవీల సంఖ్య 100 బిలియన్లు దాటి, అక్కడితో ఆగకుండా 131 బిలియన్లకు చేరుకున్నాయి. విలువ పరంగా చూస్తే, ఈ యూపీఐ లావాదేవీల విలువ రూ.139.1 ట్రిలియన్ల నుంచి రూ.199.89 ట్రిలియన్లకు చేసుకుంది.