Adani Stock Price Graph : అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తర్వాత సోమవారం నష్టాలతో ముగించిన అదానీ గ్రూప్‌నకు చెందిన షేర్లు మంగళవారం పుంజుకున్నాయి. అదానీ పెయింట్స్ మినహా మిగిలిన కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 6 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 4 శాతం, ఎన్డీటీవీ 2.56 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 2.55 శాతం మేర లాభాలతో ట్రేడవుతున్నాయి. అదానీ విల్మార్ 2.15 శాతం, ఏసీసీ 1.93 శాతం, అదానీ పవర్ 1.74 శాతం, అదానీ పోర్ట్స్ 1 శాతం, అంబుజా సిమెంట్స్ 0.43 శాతం మేర లాభాలతో కొనసాగుతున్నాయి.
తప్పు చేయలేదని నిరూపించుకోండి!
సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌పై, అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొనసాగిస్తోంది. ఆమెకు వాటాలున్న కన్సల్టింగ్ సంస్థలకు సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి తప్పు చేయలేదని ఆమె నిరూపించుకోవాలని సవాలు విసిరింది. మరోవైపు సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌కు స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టు (రీట్స్), ప్రత్యామ్నాయ పెట్టుబడుల సంఘాలు మద్దతుగా నిలిచాయి. రీట్స్‌పై సెబీ రూపొందించిన విధానం, కొంతమందికి ప్రయోజనం చేకూర్చడమే కోసమేనంటూ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఇండియన్ రీట్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది.
అదానీ గ్రూప్‌లోని 10 నమోదిత కంపెనీల్లో 8 కంపెనీల షేర్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. అయితే ఆరంభ భారీ నష్టాల నుంచి మాత్రం కోలుకోగలిగాయి. ఒకదశలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.5%, అదానీ ఎనర్జీ 17% కుదేలయ్యాయి. ట్రేడింగ్ ముగిసేసరికి అదానీ విల్మర్ 4.14%, అదానీ టోటల్ గ్యాస్ 3.88%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 3.70%, ఎన్‌డీటీవీ 3.08%, అదానీ పోర్ట్స్ 2.02%, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.09%, ఏసీసీ 0.97%, అదానీ పవర్ 0.65% నీరసించాయి. అంబుజా 0.55%, అదానీ గ్రీన్ ఎనర్జీ 0.22% మాత్రం పెరిగాయి. 10 అదానీ గ్రూప్ సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.17 లక్షల కోట్లుగా నమోదైంది.
FD చేద్దామనుకుంటున్నారా? ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా? - Fixed Deposit Interest Rates 2024