Loan Against Fixed Deposit : అత్యవసరాల కోసం మనం అప్పులు చేస్తూ ఉంటాం. లేదా అప్పటి వరకు పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సార్లు మనం పెట్టిన పెట్టుబడులు వెంటనే చేతికి అందకపోవచ్చు. అలాంటి సమయాల్లోనే మనల్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఆదుకుంటాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లోన్
మనం చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. కనుక ఆ లోన్స్‌ను మన అత్యవసరాల కోసం వాడుకోవచ్చు. దీని వల్ల డబ్బుల కోసం మనం ఫిక్స్‌డ్ డిపాజిట్లను మధ్యలోనే ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉండదు. పైగా అప్పటి వరకు జమైన వడ్డీని కోల్పోవాల్సిన అగత్యం ఏర్పడదు.
ఇటీవల బ్యాంక్‌బజార్ చేసిన అధ్యయనం ప్రకారం, భారతదేశంలో ఎఫ్‌డీలపై ఇచ్చే రుణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2022వ సంవత్సరంలో రూ.97.5 కోట్ల విలువైన ఎఫ్‌డీ రుణాలు మంజూరు కాగా, 2023లో ఆ మొత్తం రూ.113.9 కోట్లకు పెరిగింది. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణాలు తీసుకునే ముందు కొన్ని కీలక అంశాలను గుర్తించుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ లోన్స్‌కు ఎవరు అర్హతలు?
ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఉన్న భారత పౌరులు అందరూ ఈ తరహా రుణాలు తీసుకోవడానికి అర్హులు. అలాగే ట్రస్టులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUFs), సమాఖ్యలు, భాగస్వామ్య సంస్థలు, సొసైటీలు ఈ తరహా లోన్స్ తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటాయి.
ఎంత మొత్తం రుణం ఇస్తారు?
ఫిక్స్‌డ్ డిపాజిట్లోని మొత్తం సొమ్ములో, దాదాపు 85 శాతం వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది.
వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తాము ఇచ్చే వడ్డీరేటు కంటే, ఎఫ్‌డీలపై ఇచ్చే రుణాలపై 0.75% నుంచి 2% శాతం వరకు అధిక వడ్డీ వసూలు చేస్తాయి. కానీ వ్యక్తిగత రుణాలు లాంటి అన్సెక్యూర్డ్ లోన్స్‌తో పోలిస్తే, వీటిపై విధించే వడ్డీ రేటు తక్కువగానే ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎఫ్‌డీలపై రుణం తీసుకున్న తరువాత కూడా, దానికి వడ్డీ వస్తూనే ఉంటుంది.
ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది?
బ్యాంకులు చాలా త్వరగానే ఎఫ్‌డీలపై లోన్స్ మంజూరు చేస్తాయి. ఎందుకంటే, మీరు చేసిన ఎఫ్‌డీనే వారు తనఖాగా ఉంచుకుంటారు. అందుకే ఎఫ్‌డీలపై లోన్ కోసం పెద్దగా పత్రాలు, పూచీకత్తులు అవసరం ఉండదు.
ఈఎంఐ పద్ధతిలో లోన్ తీర్చవచ్చా?
రుణగ్రహీతలు ఈఎంఐ పద్ధతిలో అసలు, వడ్డీలను తీర్చవచ్చు. అయితే ఎఫ్‌డీ కాలపరిమితి ముగిసే నాటికే, ఈ లోన్ మొత్తాన్ని తీర్చేయాల్సి ఉంటుంది. పైగా మీకు వీలుంటే, ముందస్తుగానే ఈ లోన్ అమౌంట్ మొత్తాన్ని తీర్చేయవచ్చు. చాలా బ్యాంకులు ఎఫ్‌డీలపై తీసుకునే లోన్స్ ముందస్తు చెల్లింపులపై అదనపు రుసుములు కూడా వసూలు చేయవు.
2024లో లాంఛ్ అయిన టాప్-10 బైక్స్ & స్కూటర్స్ ఇవే!
మల్టిపుల్ హోమ్ లోన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!