LIC Saral Pension Plan Benefits : నేడు చాలా మంది ఎర్లీ రిటైర్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరికొందరు భవిష్యత్‌లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవించేందుకు మంచి పెట్టుబడి మార్గాలను వెదుకుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఎల్‌ఐసీ ఒక అద్భుతమైన పెన్షన్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. అదే ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ యోజన.
సాధారణంగా ఒక వ్యక్తికి 60 ఏళ్లు వచ్చిన తరువాత మాత్రమే పింఛన్ వస్తుంటుంది. కానీ ఈ ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ యోజన పథకంలో పెట్టుబడి పెట్టినవారికి 40 ఏళ్లకే పెన్షన్ అందిస్తారు. ఈ ఎల్‌ఐసీ పాలసీలో ఒక్కసారి పెట్టుబడి పెడితే, నెలకు కనీసం రూ.12,500 చొప్పున పెన్షన్ లభిస్తుంది.
ప్రైవేట్ ఉద్యోగులకు వరం
రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం ఆందోళన చెందే ప్రైవేటు ఉద్యోగులకు ఈ ఎల్‌ఐసీ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే పెన్షన్ సౌకర్యం, ప్రైవేటు రంగంలో పనిచేసిన వారికి ఉండకపోవచ్చు. అందుకే ప్రైవేటు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తర్వాత ఆదాయం లేక చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివారి కోసమే ఈ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ను డిజైన్ చేసింది ఎల్‌ఐసీ.
జీవితానికి పెన్షన్ ధీమా
ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ యోజన ద్వారా గ్యారెంటీ పెన్షన్ రూ.12,500 పొందవచ్చు. ఒకసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ఆదాయం వస్తుంది. పాలసీదారు మరణాంతరం జీవిత భాగస్వామికి లేదా నామినీకి పూర్తి పరిహారం అందిస్తారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో ఈ స్కీమ్‌లో చేరవచ్చు. మీ సౌలభ్యానికి తగ్గట్టు, ఎంత పెట్టుబడి పెట్టగలరో అంతమొత్తం పెట్టవచ్చు. పెట్టుబడులపై ఎలాంటి పరిమితులు లేవు. మీ ఆర్థిక లక్ష్యాలకు తగ్గట్టు ప్లాన్ మార్చుకోవచ్చు.
రుణ సౌకర్యం
ఈ ప్లాన్ 40 నుంచి 80 ఏళ్ల వయసువారికి వర్తిస్తుంది. పాలసీ కొనుగోలు సమయంలోనే ఒకేసారి ప్రీమియం మొత్తం చెల్లించాలి. సరళ్ పెన్షన్ ప్లాన్‌తో పాలసీ జారీ అయిన వెంటనే పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది. పాలసీ ప్రారంభతేదీ నుంచి 6 నెలల తర్వాత సరెండర్ చేసుకోవచ్చు.
LIC Saral Pension Yojana Premium Chart : రెండు రకాలుగా ఈ పాలసీని తీసుకోవచ్చు. అందులో మొదటిది సింగిల్ లైఫ్ పాలసీ. దీనిలో పాలసీదారులు జీవించినంత కాలం వారికి పింఛను వస్తుంది. అదే వారు చనిపోయిన తర్వాత పెట్టుబడి నగదు మొత్తం సంబంధిత నామినీకి తిరిగి ఇచ్చేస్తారు. ఇక రెండోది జాయింట్ లైఫ్ పాలసీ. ఇది దంపతులకు అనుకూలంగా ఉంటుంది. ఇందులోనూ పాలసీదారులు మరణించేవరకు పెన్షన్ పొందుతారు. మరణానంతరం వారి భాగస్వామికి పింఛను వస్తుంది. ఒకవేళ దంపతులిద్దరూ మరణిస్తే, డిపాజిట్ అమౌంట్‌ను నామినీకి ఇస్తారు.
వివిధ పెన్షన్ ఆప్షన్స్..
- మినిమం పెన్షన్ : ఈ పథకం కింద నెలకు కనీసం రూ.1000 పింఛను పొందవచ్చు.
- అపరిమిత పెన్షన్ : ఈ రకంలో పెన్షన్ మొత్తానికి గరిష్ఠ పరిమితి లేదు. పెట్టుబడి మొత్తం మీద పింఛన్ ఆధారపడి ఉంటుంది.
- ఫ్రీక్వెన్సీ : ఈ రకంలో నెలవారీ, అర్ధ వార్షిక, వార్షిక పింఛను విధానాల్ని ఎంపిక చేసుకోవచ్చు.
ఉదాహరణకు 42 ఏళ్ల ఒక వ్యక్తి రూ.30 లక్షల విలువైన యాన్యుటీ కొనుగోలు చేస్తే, అతను నెలకు సుమారు రూ.12,500 పింఛను రూపంలో పొందుతాడు.
వాలెంటైన్స్ డే స్పెషల్ : లైఫ్‌లో ప్రేమ మాత్రమే కాదు ఇదీ కీలకమే!