Kisan Credit Card Details in Telugu : దేశంలో రైతులు పంట పండించాలంటే.. ముందుగా వడ్డీ వ్యాపారుల గడప తొక్కాల్సిన పరిస్థితి. దుక్కి దున్నడం దగ్గర్నుంచి.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అంటూ.. పెట్టుబడి కోసం రైతు చేతిలో చాలా డబ్బు ఉండాలి. అందుకే మెజార్టీ రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తుంటారు. అయితే ఇలాంటి దుస్థితి నుంచి రైతన్నలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. అలాంటి వాటిలో కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం ఒకటి. దీని ద్వారా, రైతులు చాలా తక్కువ వడ్డీకి స్వల్పకాలిక రుణం పొందొచ్చు. మరి దీనికి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వ్యవసాయ కార్యకలాపాల్లో ఆర్థిక సాయం అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఒకసారి కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకంటే.. ఐదు సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. ఈ 5 ఏళ్ల కాలంలో రూ.3 లక్షల వరకు రుణం అందుతుంది. ఇందుకు వడ్డీ 4% లేదా అంతకన్నా తక్కువగా ఉంటుంది. ఈ రుణం ఇచ్చే ముందు.. రైతు ఆదాయం, గత రుణ చరిత్ర, ఎంత వ్యవసాయ భూమి ఉంది? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంత రుణం ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. వాస్తవానికి వడ్డీ రేటు ఏడాదికి 7% ఉంటుంది. అయితే.. తీసుకున్న రుణాలు సంవత్సరం లోపు చెల్లించే రైతులకు వడ్డీ రేటు 3% తగ్గిస్తారు. అందువల్ల.. కిసాన్ క్రెడిట్ కార్డు వార్షిక వడ్డీ రేటు 4% మించదన్నమాట.
ఈ సౌకర్యాలు కూడా: KCC ఉన్న రైతులకు రుణంతో పాటు మరికొన్ని సౌకర్యాలు కూడా లభిస్తాయి. KCC హోల్డర్‌కు బీమా రక్షణ ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్న రైతు మరణిస్తే, బీమా కంపెనీ నుంచి అతని కుటుంబానికి రూ. 50 వేల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఒకవేళ ఆ రైతు శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ. 50వేల వరకు సాయం లభిస్తుంది. ఇతర నష్టాలకు రూ. 25 వేల వరకు బీమా రక్షణ ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు రైతులకు పొదుపు ఖాతా, డెబిట్ కార్డ్, స్మార్ట్ కార్డ్ అందిస్తారు. ఆ ఖాతాలో చేసే పొదుపుపై వడ్డీ వస్తుంది.
ఎవరు అర్హులు? ఎవరికి ఇస్తారు?
- కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే రైతు వయసు 18 నుంచి 75 సంవత్సరాల లోపు ఉండాలి.
- వ్యవసాయ భూమి యజమానులు (ఆ భూమిని వీళ్లు సాగు చేస్తుండాలి)
- కౌలు రైతులు
- మత్స్యకారులు
- ఆక్వా రైతులు
- రైతు సంఘాల గ్రూప్‌లోని వ్యక్తులు (వ్యవసాయం చేస్తున్న వ్యక్తులై ఉండాలి)
- గొర్రెలు, కుందేళ్లు, మేకలు, పందులు, పక్షులు, కోళ్ల పెంపకం రైతులు
- పశు పోషణ వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో ఉన్న రైతులు లేదా పాడి రైతులు
కావాల్సిన పత్రాలు:
- అప్లికేషన్ ఫారం
- ఆధార్ కార్డ్/పాన్ కార్డ్/ఓటర్ ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్ వంటి వ్యక్తిగత గుర్తింపు డాక్యుమెంట్. ఇవి దరఖాస్తుదారు ప్రస్తుత చిరునామాతో ఉండాలి
- భూమి పత్రాలు
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- బ్యాంక్ కోరిన సెక్యూరిటీ పత్రాలు
కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు:
ఆన్లైన్లో..
- ముందుగా ఏ బ్యాంక్ నుంచైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలో కనిపించే ఆప్షన్స్ నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఎంచుకోండి.
- అప్లై బటన్ మీద క్లిక్ చేయాలి.
- ఇప్పుడు, స్క్రీన్ మీద ఒక దరఖాస్తు ఫారం వస్తుంది.
- అక్కడ అడిగిన వివరాలన్నీ నమోదు చేసి, Submit బటన్‌పై క్లిక్ చేయండి.
- మీరు సమర్పించిన వివరాలను బ్యాంక్ ధృవీకరించుకుంటుంది. అన్నీ సరిగా ఉంటే, కొన్ని రోజుల్లో KCC జారీ అవుతుంది.
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు కోసం... మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్న బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి KCC అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి. ఆ ఫారానికి, అవసరమైన పత్రాలు జత చేసి బ్యాంక్‌లో సమర్పించండి. మీ దరఖాస్తును బ్యాంక్ ప్రాసెస్ చేసి.. కొన్ని రోజుల్లో KCC జారీ చేస్తుంది.
KCC క్రెడిట్ పరిమితి పెంచుకోవచ్చా..?: ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉండే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా.. 3 లక్షల రుణాన్ని బ్యాంకులు అందిస్తాయి. ఒకవేళ ఈ పరిమితిని పెంచుకోవాలని భావిస్తే.. మొదటిసారే అది సాధ్యపడదు. తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించడం ద్వారా.. మీ సిబిల్ స్కోరును పెంచుకోవాలి.
కిసాన్ క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు డ్రా చేయవచ్చా? : కిసాన్ క్రెడిట్ కార్డ్ నుంచి నగదు డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను కొనుగోలు చేయడానికి.. కార్డు నుంచి డబ్బు విత్‌డ్రా అవకాశం కూడా ఉంది.
అప్పు చేసి ఇల్లు కొంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - Buying A House With Loan