Isha Ambani Piramal IVF : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ పిరమాల్ తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు. ఐవీఎఫ్( In Vitro Fertilization) పద్ధతిలో తాను కవలలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"నేను ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలకు జన్మనిచ్చిన విషయాన్ని చాలా త్వరగా బయటపెడుతున్నాను. అంతా ఈ పద్ధతిని సాధారణంగా భావించాలనే ఉద్దేశంతో ఈ విషయం చెబుతున్నా. దీని గురించి ఎవరూ సిగ్గుపడాల్సిన పని లేదు. ఐవీఎఫ్ చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఆ చికిత్స తీసుకుంటున్నప్పుడు శారీరకంగా చాలా అలసిపోతారు. మనకు మోడర్న్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు, సంతానం కోసం దానిని ఎందుకు ఉపయోగించుకోకూడదు? అది మీరు సంతోషపడాల్సిన అంశం, దాచే విషయం కాదు. దీనిగురించి మీరు ఇతర మహిళలతో మాట్లాడితే, ఈ పద్ధతి సులభంగా అనిపించొచ్చు" అని ఈశా అభిప్రాయపడ్డారు. ఈశా అంబానీ, ఆనంద్ పిరమాల్‌కు 2018లో వివాహం జరిగింది. ఆమె 2022లో ఆద్యశక్తి, కృష్ణలకు జన్మనిచ్చారు.
ఆమె తల్లి, ముకేశ్ సతీమణి నీతా అంబానీ కూడా ఈశా, ఆకాశ్‌కు జన్మనిచ్చేందుకు ఈ ఐవీఏఫ్‌నే ఆశ్రయించారు. ఈ విషయం గురించి ఓ సందర్భంలో నీతా వెల్లడించారు. "నేను గర్భం దాల్చలేనని వైద్యులు చెప్పినప్పుడు ఎంతో వేదనకు గురయ్యా. అప్పుడు నా వయసు 23 సంవత్సరాలు. అయితే నా డాక్టర్ స్నేహితురాలు నాకు ఆ బాధను తొలగించింది. ఐవీఎఫ్ వల్ల నేను కవలలకు జన్మనిచ్చా" అని నీతా తెలిపారు. ఈ ఐవీఎఫ్ క్లిష్టమైన ప్రక్రియే అయినా, ఇది ఎన్నో జంటల్లో ఆనందాన్ని నింపుతోందని వైద్య నిపుణులు వెల్లడించారు. ఈశా ఈ విషయాన్ని బయటకు వెల్లడించడం చాలా గ్రేట్ అని, అదేమీ మచ్చ కాదు అని నీతా అంబానీ వెల్లడించారు.
ఐవీఎఫ్ అంటే ఏమిటి?
ఐవీఎఫ్ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్)నే టెస్ట్‌ట్యూబ్ బేబీ విధానం అంటారు. ఇందులో ఆడవారి నుంచి పక్వమైన అండాలను బయటకు తీసి, ప్రయోగశాలలో ఒక టెస్ట్ ట్యూబ్‌లో పెట్టి, మగవారి వీర్య కణాలతో ఫలదీకరణ చెందిస్తారు. ఈ ప్రక్రియలో ఏర్పడిన తొలి దశ పిండాల్లో రెండు, మూడింటిని ఆడవారి గర్భంలో ప్రవేశపెడతారు. అవి అక్కడ కుదురుకొని పెరగటం మొదలెడతాయి. ఈ పద్ధతిలో సాధారణంగా ట్విన్స్‌కు జన్మనిచ్చే రేటు పది శాతం ఉంటుంది. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ జరుగుతుంది.