IRDAI Removes Age Limits On Health Insurance : 65 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు IRDA శుభవార్త తెలిపింది. ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలుకు ఉన్న వయోపరిమితిని ఎత్తివేసింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 ఏప్రిల్ 1 నుంచే ఈ మార్పు అమల్లోకి వచ్చినట్లు IRDA తెలిపింది.
ఇంతకు ముందు కొత్త ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయాలంటే గరిష్ఠ వయో పరిమితి 65ఏళ్లుగా ఉండేది. ఇకపై వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయవచ్చని IRDA తెలిపింది. అంటే అన్ని వయస్సుల వారికీ బీమా సంస్థలు పాలసీలు జారీ చేయవచ్చని స్పష్టం చేసింది.
సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణులతో సహా, కాంపిటెంట్ అథారిటీ పేర్కొన్న అన్ని వయసుల వారికి బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు డిజైన్ చేవచ్చని IRDA తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల మరింత మందికి ఆరోగ్య సంరక్షణ ఏర్పడుతుంది. కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను పెంచుకోవటానికి వీలు పడుతుంది.
పీఈడీ వెయిటింగ్ పీరియడ్ మూడేళ్లే!
హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిములకు సంబంధించిన పలు నిబంధనలను కూడా ఐఆర్‌డీఏఐ సవరించింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్ (PED), మారటోరియం పీరియడ్‌లను తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల ఆరోగ్య బీమా పాలసీని తీసుకునే వారికి మరింత ప్రయోజనం కలుగనుంది. పాలసీని తీసుకునే టైంలో పాలసీ తీసుకుంటున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వివరాలను తొలుత తెలుసుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ప్రారంభం కావడానికి కొంతకాలం వెయింటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ ఈలోపే ఏవైనా అనారోగ్య సమస్యలు (పీఈడీ) తలెత్తి బీమా తీసుకున్న వ్యక్తి ఆస్పత్రి పాలైతే ఎలాంటి కవరేజీ లభించదు. దీన్నే పీఈడీ వెయిటింగ్ పీరియడ్ అని పిలుస్తుంటారు. ఇంతకుముందు నాలుగేళ్లుగా ఉన్న 'పీఈడీ వెయిటింగ్ పీరియడ్'ను ఇప్పుడు 3 సంవత్సరాలకు ఐఆర్‌డీఏఐ తగ్గించింది. దీనివల్ల బీమా పాలసీ తీసుకునేవారికి ప్రయోజనం కలుగుతుంది. అయితే విదేశీ ప్రయాణ పాలసీలు తీసుకునే వారికి ఈ రూల్ వర్తించదని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది.
మారటోరియం పీరియడ్ ఇక ఐదేళ్లే!
హెల్త్ ఇన్సూరెన్సుకు సంబంధించిన మారటోరియం పీరియడ్‌ను కూడా ఐఆర్‌డీఏఐ సవరించింది. ఇంతకుముందు వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మారటోరియం వ్యవధి 8 సంవత్సరాలుగా ఉండేది. ఇప్పుడు దాన్ని 5 ఏళ్లకు తగ్గించారు. అంటే పాలసీని తీసుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తే, ఒప్పందం ప్రకారం అన్ని క్లెయిమ్‌లను బీమా సంస్థ చెల్లించాల్సి ఉంటుంది.
వెయిటింగ్ పీరియడ్ ఇక మూడేళ్లే!
మనం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నప్పుడు కొన్ని వ్యాధులకు చికిత్సలపై నిర్దిష్ట కాలం పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే అప్పటివరకు ఆయా వ్యాధులకు ట్రీట్మెంట్ చేయరు. అయితే ప్రమాదాలు జరిగిన టైంలో వెయిటింగ్ పీరియడ్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంతకుముందు వెయిటింగ్ పీరియడ్ వ్యవధి 4 సంవత్సరాలుగా ఉంది. దీన్ని తాజాగా ఐఆర్‌డీఏఐ మూడేళ్లకు(36 నెలలకు) తగ్గించింది. ఈ వ్యవధి ముగిసిన తర్వాత పాలసీలో పేర్కొన్న చికిత్సలపై పాలసీదారుడు కవరేజీని పొందొచ్చు. వెయిటింగ్ పీరియడ్‌లోకి వచ్చే వ్యాధులేమిటి? చికిత్సలు ఏమిటి? అనే వివరాలను బీమా పాలసీని అందించేటప్పుడే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి వివరిస్తారు. ఈ మేరకు ఐఆర్‌డీఏఐ చేపట్టిన ఈ మూడు మార్పులు కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారితో పాటు, ఇప్పటికే పాలసీ తీసుకున్న వారికి కూడా వర్తించనుంది.
ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - Aadhaar Update
మల్టిపుల్ పాన్ కార్డులు ఉన్నాయా? వెంటనే సరెండర్ చేయండి - లేకుంటే ఇక అంతే! - Multiple Pan Card Issues