India Unemployment Rate : మరికొన్నాళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరుతుందని, దీని వల్ల ఉపాధి అవకాశాలు బాగా పెరిగే అవకాశం ఉందని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF) ఇండియా ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ 2030 నివేదికలో పేర్కొంది. అందువల్ల 2028 నాటికి భారతదేశ నిరుద్యోగిత రేటు 97 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రామిక వర్గాల్లో ఉద్యోగాలు లేని వారి శాతం 2024లో 4.47 శాతం ఉండగా, 2028 నాటికి 3.68 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.
5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ
'కొవిడ్ మహమ్మారి తర్వాత భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. అందుకే భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. భారతీయ యువతీ, యువకులు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) పరిమాణం 2024లో 4 ట్రిలియన్ల అమెరికా డాలర్ల కంటే కాస్త తక్కువగా ఉంది. దేశంలోని 60 కోట్లకు పైగా జనాభా 18-35 ఏళ్ల మధ్యవారే. కనుక 7.8 శాతం GDP వృద్ధి రేటుతో భారత్ 2026-27 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంది' అని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ తన నివేదికలో పేర్కొంది.
సేవల రంగంలో ఉపాధి అవకాశాలు!
భారత్ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటే, ఉపాధి అవకాశాలు 22 శాతం వరకు పెరగవచ్చని నివేదిక పేర్కొంది. అందుకే నిరుద్యోగం 2028 నాటికి 97 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా సేవా రంగంలో గణనీయంగా ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపింది. డిజిటల్, ఆర్థిక సేవలు, ఆరోగ్యం, ఆతిథ్యం, రిటైల్, ఈ-కామర్స్, పునరుత్పాదక శక్తి, MSME రంగాల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న సేవా రంగం మహిళల ఉపాధికి ప్రోత్సాహన్ని ఇస్తుందని నివేదికలో తేలింది.
"భారత్లో తయారీ రంగానికి సంబంధించిన అంచనాలు కాస్త ఆశాజనకంగానే ఉన్నాయి. భారత్ నుంచి అమెరికాకు పెరుగుతున్న ఎగుమతులు, కార్మిక వనరులు, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రధాన పథకాల ద్వారా ప్రభుత్వం తయారీ రంగానికి ఊతమిస్తుంది. అయినా ఉద్యోగ కల్పనలో సేవా రంగమే ముందుంటుంది" అని నివేదికలో పేర్కొంది.
జొమాటో న్యూ సర్వీస్ - ఇకపై ఒకేసారి 50 మందికి సరిపడా ఫుడ్ డెలివరీ! - Zomato Large Order Fleet