Iconic Budgets Of India : బడ్జెట్ అంటే దేశానికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళిక. ఇది కేవలం డబ్బులతో ముడిపడిన విషయం కాదు. దేశంలోని అన్ని వర్గాల జీవితాలతో ముడిపడిన అత్యంత కీలకమైన అంశం. దేశ భావితరాల తలరాతను నిర్దేశించగల అతి ముఖ్యమైన పథకాల ప్రకటనలకు వేదిక బడ్జెట్. ఇలా బడ్జెట్ ప్రాధాన్యత గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటివరకు మన దేశంలో కొన్ని బడ్జెట్‌లు ఐకానిక్‌గా నిలిచిపోయాయి. వాటితో ముడిపడిన ఆసక్తికర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
- 1947 - తొలి బడ్జెట్ : మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా 1947 సంవత్సరంలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నాటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం శెట్టి దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 మధ్యనున్న ఏడున్నర నెలల వ్యవధి కోసం ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ మొదటి బడ్జెట్‌లో మన దేశానికి సంబంధించిన మొత్తం ఆదాయ అంచనా కేవలం రూ.171.15 కోట్లు మాత్రమే. ద్రవ్య లోటు దాదాపు రూ.204.59 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
- 1951 - ప్లానింగ్ కమిషన్ ప్రతిపాదన : మన దేశం రిపబ్లిక్‌గా అవతరించిన తర్వాత తొలిసారిగా 1951లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి ఆర్థిక మంత్రి జాన్ మథాయ్ ఈ బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. మన దేశానికి ప్రత్యేకంగా 'ప్లానింగ్ కమిషన్' (ప్రణాళికా సంఘం) ఉండాలని ఈ బడ్జెట్‌లోనే ప్రతిపాదించారు. దాని ఏర్పాటుకు అవసరమైన రోడ్ మ్యాప్‌ను ఈ సందర్భంగా పార్లమెంటుకు జాన్ మథాయ్ వివరించారు. ప్రణాళికా సంఘం దేశంలోని అన్ని వనరులను అంచనా వేస్తుంది. ఈ వనరులను అత్యంత ప్రభావవంతంగా ఎలా వినియోగించుకోవాలి అనేది ప్లానింగ్ కమిషనే ప్లాన్ చేస్తుంది. మన దేశ ప్లానింగ్ కమిషన్‌కు మొదటి ఛైర్మన్ జవహర్‌లాల్ నెహ్రూ.
- 1968 - పీపుల్ సెంట్రిక్ బడ్జెట్ : 1968 సంవత్సరంలో నాటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ప్రజారంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అందరి మన్ననలు అందుకున్నారు. అప్పటిదాకా అమల్లో ఉన్న బ్రిటీష్ కాలం నాటి ''స్పౌజ్ అలవెన్సు''ను రద్దు చేస్తున్నట్లు ఆయన బడ్జెట్‌లో ప్రకటించారు. దీనివల్ల ఉద్యోగాలు చేస్తున్న ఎంతో మంది దంపతులకు ఆనాడు ''స్పౌజ్ అలవెన్సు'' భారం నుంచి విముక్తి లభించింది. భర్తపై భార్య ఆధారపడిందా, భార్యపై భర్త ఆధారపడ్డాడా అనేది డిసైడ్ చేసే హక్కు మూడో వ్యక్తికి లేదని ఆయన పార్లమెంటులో వ్యాఖ్యానించారు. అప్పట్లో దేశంలోని ఫ్యాక్టరీల్లో తయారయ్యే వస్తువులను ఎక్సైజ్ విభాగం దశల వారీగాలు తనిఖీలు చేసేది. ఆ తర్వాతే వాటిని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చేది. ఈ నిబంధనకు మొరార్జీ దేశాయ్ స్వస్తి పలికారు. చిన్న, పెద్ద కంపెనీలన్నీ సొంతంగా ప్రోడక్ట్స్ నాణ్యతను తనిఖీ చేసుకునే వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు.
- 1973 - బ్లాక్ బడ్జెట్ : మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత యశ్వంతరావు బి.చవాన్ కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో 1973 ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ ఏడాది బడ్జెట్‌లో అత్యధికంగా రూ.550 కోట్ల లోటు ఉంటుందని అంచనా వేశారు. అందుకే దీనికి 'బ్లాక్ బడ్జెట్' అనే పేరు వచ్చింది. ఈ బడ్జెట్‌లో సాధారణ బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్ప్, బొగ్గు గనుల జాతీయీకరణకు రూ.56 కోట్లు కేటాయించారు. తద్వారా విద్యుత్, సిమెంట్, ఉక్కు రంగాల పరిశ్రమలలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గును నిరంతరాయంగా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- 1986 - క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్ : 1986 ఫిబ్రవరి 28న నాటి ఆర్థిక మంత్రి వీపీ సింగ్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వివిధ రంగాలకు చెందిన వారికి జరిమానాలు, రివార్డులు రెండూ అందించేలా మిశ్రమ ప్రతిపాదనలతో ఉండటంతో దీనికి "క్యారెట్ అండ్ స్టిక్" బడ్జెట్ అనే పేరొచ్చింది. అప్పట్లో కంపెనీలు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే పెద్దఎత్తున లైసెన్సులు తీసుకోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో కంపెనీల నిర్వాహకులు తీవ్ర ఒత్తిడిని, వ్యయాన్ని ఎదుర్కొనేవారు. దీన్ని దూరం చేసేలా లైసెన్సుల జారీ వ్యవస్థను సరళతరం చేసే ప్రతిపాదనలను వీపీ సింగ్ ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. పరోక్ష పన్నుల వ్యవస్థలో సంస్కరణలు చేసే దిశగా అడుగులు వేస్తామని ఆయన అప్పట్లో వెల్లడించారు.
- 1987 - గాంధీ బడ్జెట్ : బాగా లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు తప్పనిసరిగా ఆదాయపు పన్ను చెల్లించేలా బాటలు వేసింది 1987 బడ్జెట్. ఈ నిర్ణయం వల్ల తర్వాతి కాలంలో మన దేశ ఖజానాకు భారీ ఆదాయం లభించింది.
- 1991 - ఎపోచల్ బడ్జెట్ : 1991 సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో మన దేశ ప్రధానమంత్రిగా పీవీ నర్సింహారావు, కేంద్ర ఆర్థికమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఈ బడ్జెట్‌లో లైసెన్స్ రాజ్‌కు ముగింపు పలికే కీలక ప్రకటనలను మన్మోహన్ సింగ్ చేశారు. దీనివల్ల కంపెనీల లైసెన్సింగ్ ప్రక్రియ చాలా సులభతరంగా మారింది. అందుకే ఆ సమయాన్ని ఆర్థిక సరళీకరణల యుగంగా చెబుతుంటారు. దీనికి "ఎపోచల్ బడ్జెట్" అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే ఈ బడ్జెట్‌లో ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ విధానాలను సరిదిద్దారు. దిగుమతి లైసెన్సింగ్ ప్రక్రియను తగ్గించారు. ఎగుమతులను ప్రోత్సహించేలా కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. ప్రపంచీకరణను స్వాగతించేలా మన్మోహన్ సింగ్ కీలక ప్రకటనలు చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాతి నుంచి మన దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనం వైపే సాగింది. ఈ బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీని 220 శాతం నుంచి 150 శాతానికి తగ్గించారు.
- 1997 - పన్ను సంస్కరణల బడ్జెట్ : 1997లో నాటి ఆర్థికమంత్రి పి చిదంబరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా పన్ను సంస్కరణలను ప్రతిపాదించారు. అందుకే దీన్ని "డ్రీమ్ బడ్జెట్" అని పిలుస్తారు. ఆయన సామాన్య వ్యక్తుల కోసం గరిష్ఠ ఉపాంత ఆదాయపు పన్ను రేటును 10 శాతం మేర తగ్గించారు. బడ్జెట్‌లో దేశీయ కంపెనీలకు భారీ ఆదాయపు పన్ను రాయితీని ఇచ్చి, దాన్ని 35 శాతానికి తగ్గించారు.
- 2000 - మిలీనియం బడ్జెట్ : 2000 సంవత్సరంలో నాటి ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారతదేశాన్ని సాఫ్ట్‌వేర్-ఐటీ హబ్‌గా మార్చే లక్ష్యం అనేది ఈ బడ్జెట్‌లో స్పష్టంగా కనిపించింది.
- మన దేశ సాఫ్ట్‌వేర్ ఎగుమతులను పెంచాలనే సంకల్పం తీసుకున్నది ఈ బడ్జెట్‌లోనే. సాఫ్ట్‌వేర్ ఎగుమతి సంస్థలపై ప్రోత్సాహకాలను ఒకేసారి కాకుండా దశలవారీగా తగ్గించాలని ప్రతిపాదించారు. కంప్యూటర్, కంప్యూటర్ ఉపకరణాలు వంటి 21 వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. దీనివల్ల దేశంలోని ఐటీ పరిశ్రమ వృద్ధికి ఊతం లభించింది. అందుకే దీన్ని 'ది మిలీనియం బడ్జెట్' అని పిలుస్తారు.
- 2002 - రోల్‌బ్యాక్ బడ్జెట్ : 2002 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తరఫున యశ్వంత్ సిన్హా ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లోని కొన్ని ప్రతిపాదనలు కఠినంగా, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే తదుపరిగా వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే దీనికి 'రోల్‌బ్యాక్ బడ్జెట్'గా పేరు వచ్చింది. అయితే డివిడెండ్ ఆదాయాలపై పన్ను విధింపు, చిన్న పొదుపు రేట్లను మార్కెట్ ఆధారిత వడ్డీ రేట్లకు లింక్ చేయడం వంటి కీలక మార్పులను కొనసాగించడంలో యశ్వంత్ సిన్హా సక్సెస్ అయ్యారు.
- 2005 - ఆమ్ ఆద్మీ బడ్జెట్ : 2005 సంవత్సరంలో నాటి ఆర్థిక మంత్రి పి చిదంబరం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులోనే ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా నిరుద్యోగులందరికీ ఏటా కనీసం 100 రోజుల ఉపాధి కల్పించడం మొదలైంది. బడ్జెట్‌లో కార్పొరేట్ పన్ను రేట్లు, కస్టమ్స్ సుంకం కూడా తగ్గించారు. సమాచార హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీనివల్ల ప్రభుత్వ సంస్థల నుంచి సకాలంలో ప్రతిస్పందనలను కోరుకునే అవకాశం సామాన్యులకు దక్కింది. ఇవన్నీ ఉండటం వల్లే దీనికి 'ఆమ్ ఆద్మీ బడ్జెట్' అనే పేరు వచ్చింది.
- 2021 - శతాబ్దానికి ఒకసారి వచ్చే బడ్జెట్ : దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో పెట్టుబడులను పెంచాలని 2021 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇది 'శతాబ్దానికి ఒకసారి వచ్చే బడ్జెట్' అని ఆర్థిక మంత్రి నిర్మల పిలిచారు. ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసే వ్యూహాన్ని ఇందులో ప్రకటించారు. బలమైన పన్ను వసూళ్ల వ్యవస్థ నిర్మాణానికి ఆమె ప్రతిపాదనలు చేశారు.
ఐటీఆర్ ఫైల్ చేశారా? వెంటనే 'e-Verify' చేసుకోండి - లేదంటే? - Income Tax Return eVerification