How To Recover Money From Cyber Scams : ప్రస్తుత సాంకేతిక యుగంలో దాదాపు అందరూ స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారు. తరచూ డిజిటల్ పేమెంట్స్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు జరుపుతున్నారు. సోషల్ మీడియా వాడకం కూడా బాగా పెరిగిపోయింది. దీంతో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కాల్స్, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్, వాట్సాప్ ఇలా అందుబాటులోని ప్రతి అవకాశాన్ని వాడుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. అవగాహన లేక మోసపోయిన వారి బ్యాంకు ఖాతాలను లూటీ చేసేస్తున్నారు.
దోచుకుంటున్నారు - జర జాగ్రత్త!
ఇటీవలే దిల్లీకి చెందిన ఓ జూనియర్ డాక్టర్‌ను సైబర్ నేరగాళ్లు బోల్తా కొట్టించారు. డాక్టర్‌కు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలని సూచిస్తూ ఓ ఫ్రాడ్ ఫోన్ కాల్ చేశారు. దీనిని నమ్మిన సదరు డాక్టర్, సైబర్ నేరగాళ్లు చెప్పినట్లే చేశాడు. వెంటనే వైద్యుడి బ్యాంకు అకౌంట్ నుంచి రూ.2 లక్షలు డ్రా అయ్యాయి. మోసపోయినట్లు గుర్తించిన వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి సైబర్ మోసాలు, ఆన్‌లైన్ స్కామ్‌లు పెరుగుతుండటం వల్ల వినియోగదారుల అకౌంట్స్‌లోని నగదును కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఆన్‌లైన్ మోసానికి గురైతే ఏం చేయాలో తెలుసుకుందాం.
వెంటనే ఫిర్యాదు చేయాలి!
మొబైల్, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్ లేదా ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే సమస్యలు, ఇన్‌ఫర్మేషన్ గ్యాప్స్ లేదా బ్యాంకింగ్ సమస్యల వల్ల మీరు మోసానికి గురైతే, వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. అలాగే థర్డ్ పార్టీ కారణంగా మీ అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా అయితే, ఇలా పోగోట్టుకున్న డబ్బులకు రీఫండ్ పొందవచ్చు. అయితే ఎవరైనా ఆన్‌లైన్ మోసానికి గురైతే మూడు రోజుల్లోపుగానే, బ్యాంకుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ గైడ్ లైన్స్ స్పష్టం చేస్తున్నాయి.
How To Recover Your Money In Online Fraud : ఆర్బీఐ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ బ్యాంకులు రీఫండ్‌లను వాయిదా వేయవచ్చని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అందుకే బాధితులు రీయింబర్స్‌మెంట్ ప్రక్రియను అర్థం చేసుకుని అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకోసం ఏం చేయాలంటే?
- స్టెప్ 1 : మీరు ఆన్‌లైన్ మోసానికి గురైన వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అదే రోజు మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ఫైల్ అయ్యేటట్లు చేయాలి. అది సాధ్యం కాకపోతే, ఫైల్ చేసిన ఫిర్యాదు కాపీని తీసుకోవాలి.
- స్టెప్ 2 : సైబర్ మోసానికి గురైన రోజునే లేదా పోలీసు రిసిప్ట్ పొందిన వెంటనే మీ బ్యాంకును వెళ్లాలి. బ్యాంకులో ఫ్రాడ్ అప్లికేషన్ నింపి, పోలీసు రిసిప్ట్‌ను దానికి జత చేసి, బ్యాంక్ అధికారులకు ఇవ్వాలి.
- స్టెప్ 3 : ఆ తర్వాత ఈ రెండు డాక్యుమెంట్‌ల సాఫ్ట్ కాపీలను ఆర్బీఐ ఈ-మెయిల్ ఐడీ crpc@rbi.org.inకి పంపించాలి. అలాగే CCలో మీ బ్యాంక్ ఈ-మెయిల్ ఐడీని యాడ్ చేయాలి. ఈ విషయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ఏదేమైనా ఆన్‌లైన్ మోసానికి గురైన 3 రోజుల్లోపు ఈ తతంగం అంతా పూర్తి చేయాలి. ఒకవేళ ఇది కుదరకపోతే, సైబర్ మోసం జరిగిన 4 నుంచి 7 రోజుల్లోపు రిపోర్ట్ చేసినా, డబ్బులు రికవరీ చేసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది.
మరీ లేటైతే కష్టమే!
సైబర్ మోసానికి గురైన వెంటనే పోలీసులకు, బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. మరీ లేటైతే డబ్బులు రికవరీ చేసుకోవడం కష్టమే. 7 రోజుల తర్వాత బ్యాంకుకు లేదా పోలీసులకు మోసం జరిగినట్లు ఫిర్యాదు చేస్తే ఫండ్స్ తిరిగి పొందే ఛాన్స్ బాగా తగ్గిపోతుంది. బిట్‌కాయిన్, ఆన్‌లైన్ కరెన్సీ, ఆన్‌లైన్ గేమ్‌లు లేదా ఆన్‌లైన్ బెట్టింగ్‌ల్లో పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వెనక్కి రావని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మీరు ఏవైనా లావాదేవీలు జరుపుతున్నప్పుడు బ్యాంకు హెచ్చరించినా పట్టించుకోకపోవడం, అజాగ్రత్తతో మోసపోవడం లాంటివి జరిగినప్పుడు కూడా మీ డబ్బులు వెనక్కు రావు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.
రూ.6 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్-5 మోడల్స్ ఇవే! - Best Cars Under 6 Lakh