How To Protect Yourself From Bank Fraud : బ్యాంకులు ఎప్పుడూ ఖాతాదారులకు నేరుగా ఫోన్ చేయవు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అయితే చాలా మంది బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది అనగానే కంగారు పడుతుంటారు. వాళ్లు అడిగిన వివరాలను వెంటనే చెప్పేస్తుంటారు. కానీ ఎప్పుడూ ఇలాంటి పనులు చేయకూడదు. మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీలను ఎవరికీ చెప్పకూడదు. సైబర్ నేరగాళ్లు పంపించే మోసపూరితమైన లింక్‌లను కూడా ఎప్పుడూ క్లిక్ చేయకూడదు.
ఏపీకే ఫైల్ స్కామ్స్
How To Avoid APK File Scams : సైబర్ నేరగాళ్లు యూజర్ల ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకొని, అందులోని మొత్తం సమాచారాన్ని తెలుసుకొని, బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఇది ఎలా చేస్తున్నారంటే, ముందుగా ఏపీకే ఫైల్స్ (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ)ను యూజర్లకు పంపిస్తారు. పొరపాటున వాటిపై క్లిక్ చేయగానే, అవి ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతాయి. అక్కడి నుంచి మీ ఫోన్ హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిపోతుంది. అందుకే ఈ ఏపీకే మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటే ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు సూచనలు జారీ చేశాయి. ముఖ్యంగా కేవైసీ అప్డేట్, రివార్డు పాయింట్స్ వంటి వాటిపేరుతో పంపిస్తున్న ఏపీకే ఫైల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాయి. బ్యాంకులు ఇలాంటి లింక్‌లు ఉన్న మెసేజ్‌లను ఎప్పుడూ పంపించవని స్పష్టం చేస్తున్నాయి.
వీటిని ఎలా గుర్తించాలి:
మీ మొబైల్ ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లో ఏవైనా ఏపీకే ఫైల్స్ ఉంటే, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్స్టాల్ చేయకూడదు. ఇది కేవలం కొన్ని కేబీల్లోనే ఉంటుంది. ఫోన్లో ఇన్స్టాల్ చేసిన వెంటనే, మీ ఫోన్లోని నంబర్లు, యాప్స్, కెమెరాలాంటివన్నీ ఉపయోగించుకునేందుకు పర్మిషన్ అడుగుతుంది. వీటిని బట్టి అది మోసమని మీరు అర్థంచేసుకోవాలి. కేవలం గూగుల్‌ప్లే స్టోర్ లాంటి అధికారిక స్టోర్ల నుంచి మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి.
మెసేజ్‌లతో జాగ్రత్త:
బ్యాంకుల నుంచి పలు స్కీమ్‌లు, బీమా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారంతో మెసేజ్‌లు వస్తుంటాయి. అవి నిజమే అనుకుని ఆ లింకులపై క్లిక్ చేస్తే, మన పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులు తమ కస్టమర్లకు సూచిస్తున్నాయి. మీకు ఏదైనా సమాచారం కావాలంటే, నేరుగా బ్యాంకును సంప్రదించాలని స్పష్టం చేస్తున్నాయి.
ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దు!
బ్యాంకు నుంచి వచ్చిన ఓటీపీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యాక్సెస్ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ కస్టమర్లకు సూచించాయి. ఖాతాదారులు ఏవైనా లావాదేవీలు చేసినప్పుడు మాత్రమే ఓటీపీలు వస్తాయని, దాన్ని ఎంటర్ చేస్తే ఆ లావాదేవీ పూర్తవుతుందని పేర్కొన్నాయి. అందుకే ఎలాంటి ఆన్లైన్ లావాదేవీలు చేయకుండా, మీకు ఓటీపీ వచ్చిందంటే, దానిని కచ్చితంగా అనుమానించాలి.
క్విషింగ్
ఈ క్విషింగ్ అనేది కొత్త రకం మోసం. ఖాతాదారుల ఫోన్‌కు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. దీనిలో మోసపూరిత వెబ్సైట్ లింక్స్ ఉంటాయి. క్యూఆర్ కోడ్స్‌లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయగానే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన సమాచారం మొత్తం ఆరా తీస్తుంది. చూసేందుకు అచ్చం బ్యాంకు వెబ్సైట్ల మాదిరిగానే ఉంటుంది. కొన్నిసార్లు క్యూఆర్ కోడ్‌ను ఓపెన్ చేసిన వెంటనే డబ్బులు పంపించేందుకు పిన్ను ఎంటర్ చేయాలని అడుగుతాయి. పొరపాటున పిన్ ఎంటర్ చేశామా, ఇక అంతే, మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బులు మొత్తం ఖాళీ చేస్తారు. తర్వాత ఎంత బాధపడినా లాభం ఉండదు.