How To Choose A Best Credit Card : భారతదేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం క్రెడిట్ కార్డులను విరివిగా వాడుతున్నారు. క్రెడిట్ కార్డులు వాడడం వల్ల రివార్డ్ పాయింట్ల ప్రయోజనాలను కూడా పొందుతున్నారు. అయితే ఏ క్రెడిట్ కార్డు వాడడం మంచిదో తెలియక అయోమయానికి గురవుతుంటారు చాలామంది. మీరు క్రెడిట్ కార్డు సరిగ్గా వాడకుంటే మీ సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అలాకాకుండా, అధిక క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తి మంచి రివార్డులతో మంచి క్రెడిట్ కార్డులను పొందవచ్చు.
సరైన క్రెడిట్ కార్డులను ఎలా ఎంచుకోవాలి?
బ్యాంకులు ఆన్లైన్ పోర్టల్స్‌తో కలిసి రకరకాల క్రెడిట్ కార్డులను అందజేస్తున్నాయి. ప్రజలు కొన్నిసార్లు ఏ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయాలో తెలియక గందరగోళానికి గురవుతుంటారు. అందుకే క్రెడిట్ కార్డును ఎంచుకునే ముందు ఏయే అంశాలు పరిశీలించాలో ఇప్పుడు చూద్దాం.
1. మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోండి!
మీరు క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే క్రెడిట్ కార్డును ఎంచుకోవడంలో క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. మీకు క్రెడిట్ కార్డు జారీచేయడానికి ముందు బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను, అలాగే మీ క్రెడిట్ హిస్టరీని కచ్చితంగా చూస్తాయి. అంతే కాకుండా బాగా రివార్డ్ పాయింట్లు రావాలంటే, మంచి క్రెడిట్ స్కోర్ ఉండడం చాల ముఖ్యం.
సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ లాంటి క్రెడిట్ బ్యూరోల నుంచి ఉచితంగా క్రెడిట్ స్కోర్‌ను పొందవచ్చు. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ ఎక్కువ క్రెడిట్ కార్డులు కోసం అస్సలు దరఖాస్తు చేసుకోవద్దు. ఎందుకంటే ఇది మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతుంది.
2. మీ ఖర్చులను అంచనా వేయండి
క్రెడిట్ కార్డు తీసుకునే ముందు మీ ఖర్చుల సరళిని అంచనా వేయడం కూడా చాలా ముఖ్యం. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటే ట్రావెల్ క్రెడిట్ కార్డును ఎంచుకోవడం ఉత్తమం. మీరు తరచుగా రెస్టారెంట్లకు వెళ్తున్నట్లయితే డైనింగ్ క్రెడిట్ కార్డును తీసుకోవడం మంచిది. అంటే మీ ఖర్చులను బట్టి క్రెడిట్ కార్డును ఎంచుకోవడం ఉత్తమైన పద్ధతి. తద్వారా మీరు రివార్డులతో పాటు, డిస్కౌంట్స్ కూడా పొందవచ్చు.
3. మీ అవసరాలు ఏంటి?
క్రెడిట్ కార్డుకు అప్లై చేసే ముందు మీకున్న అవసరాన్ని తెలుసుకోండి. దీని వల్ల మీకు క్రెడిట్ కార్డు ఎందుకు అవసరమో స్వయంగా విశ్లేషించుకోగలగుతారు. సాధారణంగా వ్యక్తులు ఈ కింది అవసరాల కోసం క్రెడిట్ కార్డులను తీసుకుంటూ ఉంటారు.
- క్రెడిట్ స్కోర్ మెరుగుపరుచుకోవడానికి
మీకు సరైన క్రెడిట్ హిస్టరీ లేకపోతే బేసిక్ క్రెడిట్ కార్డును పొందడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డు ఇందుకు అనుకూలంగా ఉంటుంది. మీ క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోవడమే కాకుండా మీ క్రెడిట్ స్కోరును మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. - అవుట్‌స్టాండింగ్ రుణ భారాన్ని తగ్గించుకోవడానికి
చాలా మంది క్రెడిట్ కార్డులను వాడి, వాటి బకాయిలను చెల్లించలేక ఇబ్బంది పడుతుంటారు. వాటి బకాయిలను ఒకే కార్డుకు బదిలీ చేసుకోవచ్చు. లేదా తక్కువ వడ్డీ రేట్లు ఉండే క్రెడిట్ కార్డును ఎంచుకోవచ్చు. ఇలా మీ రుణభారాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. - ఖరీదైన వస్తువుల షాపింగ్ కోసం
చాలా మంది తమ దగ్గర ఉన్న నగదును ఒకేసారి ఖర్చు చేయకుండా, ఈఎంఐ ద్వారా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డులను వాడుతుంటారు. ఇందుకోసం రిటైల్ షాపింగ్ లేదా స్టోర్స్ రివార్డులతో కూడిన క్రెడిట్ కార్డులను తీసుకోవడం మంచిది.
4. రీసెర్చ్ చేయడం చాలా ముఖ్యం
క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసే ముందు, మీరే స్వయంగా ఆ కార్డుకు సంబంధించిన ప్రతి విషయాన్నీ తెలుసుకోవడం చాల ముఖ్యం. ఇందుకోసం ఆన్లైన్లో చాలా వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీరు తీసుకోవాలనుంటున్న క్రెడిట్ కార్డుల వివరాలు, వాటి వల్ల చేకూరే ప్రయోజనాలు వివరంగా ఉంటాయి. ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కూడా వీటిని బేరీజు వేసుకోవచ్చు. ఓ మంచి క్రెడిట్ కార్డును ఎంచుకోవడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.
5. కార్డు కోసం అప్లై చేసుకోండి!
అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత క్రెడిట్ కార్డు కోసం అప్లై చేయండి. ఇది సరైన పద్దతి. బ్యాంకు వెబ్‌సైట్‌కు వెళ్లి ఆఫర్లను సరిగ్గా చెక్ చేసుకొని మీ అవసరాలకు సరిపోయే క్రెడిట్ కార్డులను మాత్రమే ఎంచుకోండి. అప్పుడే భవిష్యత్‌లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు.
ఎల్ఐసీ నయా ప్లాన్‌తో డబుల్ బెనిఫిట్స్ - జీవిత బీమా + సంపద వృద్ధి!
4నెలల వయస్సులోనే రూ.240 కోట్లు ఆస్తి- ఎవరీ ఇండియన్ యంగెస్ట్ మిలియనీర్?