How To Check Credit Score Online : బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణాలు మంజూరు చేస్తుంటాయి. అందుకే క్రెడిట్ స్కోర్‌ను బాగా మెయింటైన్ చేస్తుండాలి. అయితే చాలా మంది క్రెడిట్ స్కోర్‌ను ఏవిధంగా చెక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఈ ఆర్టికల్‌లో ఆన్లైన్లో క్రెడిట్‌స్కోర్‌ను ఏ విధంగా చెక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.
క్రెడిట్ స్కోరును చెక్ చేయడానికి ముందు దాని గురించి అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. మనదేశంలో ఉన్న నాలుగు ప్రధాన క్రెడిట్ బ్యూరోలలో 'క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్' (సిబిల్) ఒకటి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అధికారం పొందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. క్రెడిట్ స్కోరు ఎంత ఉంది అనే విషయాన్ని సిబిల్ ద్వారా తెలుసుకోవచ్చు. సిబిల్ స్కోరు అనేది మీకు రుణం మంజూరు చేయవచ్చో లేదో నిర్ణయించే మూడంకెల సంఖ్య. ఈ స్కోరు 300 - 900 వరకు ఉంటుంది. ఇది ఒక వ్యక్తి, కంపెనీ లేదా పబ్లిక్/ ప్రైవేట్ సంస్థల క్రెడిట్ హిస్టరీకి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తుంది. క్రెడిట్ కార్డులు జారీ, లోన్ల మంజూరు విషయంలో సిబిల్ స్కోర్ చాలా కీలకం. క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉంటే పర్సనల్ లోన్స్, హోమ్ లోన్, క్రెడిట్ కార్డుల ఆమోదానికి అర్హత ఎక్కువగా ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్‌ను చూసే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు(నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణాలు మంజూరు చేస్తుంటాయి.
మనదేశంలో ఉన్న ప్రధాన క్రెడిట్ ఎజెన్సీలు
ఆర్బీఐ ఈ క్రెడిట్ ఏజెన్సీలన్నింటికి లైసెన్సులను మంజూరు చేసింది. క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకునేందుకు మన దేశంలో ఉన్న ప్రధాన క్రెడిట్ ఎజెన్సీల వివరాలను తెలుసుకుందాం.
- CIBIL : భారత్‌లో అత్యంత ప్రసిద్ధ క్రెడిట్ ఏజెన్సీగా సిబిల్‌కు పేరుంది. సిబిల్‌ను 2000లో స్థాపించారు 60 కోట్లకు పైగా భారతీయుల, రూ.3.2 కోట్ల కార్పొరేట్ సంస్థల క్రెడిట్ రిపోర్ట్‌లను ఇది నిర్వహిస్తోంది.
- Experian : ఇది కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) గుర్తింపు పొందింది. 2006లో ఈ ఎక్స్‌పీరియన్‌ను స్థాపించారు. 2010 నుంచి భారత్‌లో పనిచేయడం ప్రారంభించింది.
- CRIF High Mark : ఈ సంస్థను 2007లో స్థాపించగా 2010లో నిర్వహణ లైసెన్స్ దక్కించుకుంది. ఇది అందించిన స్కోర్‌ల పరిధి 300 -850 వరకు ఉంటుంది.
- Equifax : ప్రపంచంలోని మూడు అతిపెద్ద క్రెడిట్ బ్యూరోల్లో ఈక్విఫాక్స్ ఒకటి. 1899లో ఇది ఒక రిటైల్ క్రెడిట్ బిజినెస్‌గా ప్రారంభమైంది. ఈ సంస్థ 2010లో ఆపరేటింగ్ లైసెన్స్‌ను పొందింది. ఇది క్రెడిట్ స్కోర్‌ను 1 నుంచి 999 పాయింట్లతో సూచిస్తుంది.
సిబిల్ రిపోర్ట్ అంటే ఏమిటి?
భారత్‌లో క్రెడిట్ యోగ్యతకు సిబిల్ స్కోర్ బెంచ్‌మార్క్ మారింది. సిబిల్ రిపోర్ట్‌ను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (సీఐఆర్) అని కూడా పిలుస్తారు. ఇది మీ అన్ని లోన్లు, చెల్లింపు చరిత్రలను నిర్వహించే పత్రం. ఈ నివేదికలో చెల్లింపు చరిత్ర, లోన్ల సంఖ్య, రుణాలకు సంబంధించిన బకాయిల వివరాలు అన్నీ ఉంటాయి. మీరు లోన్ తీసుకునేందుకు క్రెడిట్ స్కోర్ అనేది క్రెడిట్ రిపోర్ట్‌లా పనిచేస్తుంది. సిబిల్ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే అంతమంచిది. ఈ క్రెడిట్ స్కోరును ఉచితంగా తెలుసుకోవచ్చు. పూర్తి డేటాను డబ్బులు చెల్లించి కూడా పొందవచ్చును. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెడిట్ స్కోర్‌ను ఫ్రీగా చెక్ చేసుకోవడం ఎలా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ పొందిన నాలుగు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు 2017 నుంచి సంవత్సరాని ఒకసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేసుకోవడానికి అనుమతినిస్తున్నాయి. ఉచితంగా సిబిల్ స్కోరును ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టెప్ 1: ముందుగా సిబిల్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: మీ పేరు, ఫోన్ నంబరు, ఇ-మెయిల్ అడ్రస్ వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 3 : సిబిల్ వెబ్సైట్లో మీ పాన్ నంబరు సహా అక్కడ అడిగిన ఇతర వివరాలను ఇవ్వండి.
స్టెప్ 4 : మీ లోన్స్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
స్టెప్ 5 : ఈ దశలో స్క్రీన్‌పై వివిధ చెల్లింపు సభ్యత్వాలు డిస్ప్లే అవుతాయి. మీకు ఒకసారి ఉచిత క్రెడిట్ స్కోరు, రిపోర్ట్ మాత్రమే అవసరం కనుక No Thanksపై క్లిక్ చేయండి. దీనితో మీకు ఫ్రీ అకౌంట్ క్రియేట్ అవుతుంది. లాగిన్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతాయి.
స్టెప్ 6 : ఈ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి, మీ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. మీ రిజిస్టర్డ్ ఇ-మెయిల్‌కు వచ్చిన వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, అథంటికేషన్ పూర్తి చేయాలి. తర్వాత మీ పాస్‌వర్డ్‌ను మార్చి మళ్లీ లాగిన్ చేయమని అడుగుతుంది.
స్టెప్ 7 : ఈ విధంగా మీరు లాగిన్ చేసిన తర్వాత, మీరు ఇంతకు ముందు నమోదు చేసిన వ్యక్తిగత వివరాలన్నీ డిఫాల్ట్‌గా స్క్రీన్‌పై కనిపిస్తాయి. మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి
స్టెప్ 8 : డ్యాష్‌బోర్డ్‌పై మీ సిబిల్ స్కోరు డిస్ప్లే అవుతుంది.
ఆన్లైన్లో పేమెంట్ చెల్లించడం ద్వాారా
అధికారిక సిబిల్(CIBIL) వెబ్‌సైట్‌కు లాగిన్ చేసి, Know your Score ఆప్షన్‌పై క్లిక్ చేయండి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా, గుర్తింపు వివరాలు, గత క్రెడిట్ హిస్టరీ, సంబంధిత ఇతర వివరాలను ఆన్‌లైన్ ఫారంలో పూర్తిచేయండి. ఆ తర్వాత పేమెంట్స్ పేజీలోకి వెళతారు. అక్కడ పేమెంట్ చేసేందుకు ప్రీపెయిడ్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ లాంటి ఆప్షన్స్‌ను ఎంచుకోవచ్చు. ఇక్కడ క్రెడిట్ నివేదికను పొందడానికి CIBILకు రూ.550/- చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన తర్వాత ప్రమాణీకరణ (అథెంటికేషన్) పేజీకు వెళతారు. ఇక్కడ మీ క్రెడిట్ చరిత్రకు సంబంధించిన 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో CIBILతో మీ గుర్తింపును అథెంటికేట్ చేయడానికి కనీసం 3 ప్రశ్నలకు సరిగా సమాధానం ఇవ్వాలి. అనంతరం మీ క్రెడిట్ రిపోర్ట్ 24 గంటల్లో మీ నమోదిత ఇ-మెయిల్‌కు పంపుతారు.
ఇలా చేస్తే మీ క్రెడిట్ స్కోర్ ఎప్పుడూ తగ్గదు! అసలు ఎలా లెక్కిస్తారో తెలుసా?
బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!