Hindenburg on SEBI Chief : సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌పై, అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొనసాగిస్తోంది. ఆమెకు వాటాలున్న కన్సల్టింగ్ సంస్థలకు సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని హిండెన్‌బర్గ్ సవాలు విసిరింది. ఈ ఆరోపణలు మాధబి దంపతలు స్పందించిన గంటల వ్యవధిలోనే హిండెన్‌బర్గ్ ఈ వ్యాఖ్యలు చేసింది. బెర్ముడా/మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్లలో తనకు పెట్టుబడులు ఉన్నట్లు మాధబి ఒప్పుకొన్నారని, అదానీ సంస్థలో డైరెక్టరుగా ఉన్న తన భర్త బాల్యమిత్రుడు ఆ ఫండ్‌ను నిర్వహించినట్లు కూడా ధ్రువీకరించారని హిండెన్‌బర్గ్ తెలిపింది. ఇవన్నీ చూస్తే కొన్ని కొత్త సందేహాలూ వస్తున్నాయని పేర్కొంది.
SEBI Chairperson Madhabi Buch’s response to our report includes several important admissions and raises numerous new critical questions.
— Hindenburg Research (@HindenburgRes) August 11, 2024
(1/x) https://t.co/Usk0V6e90K
తాజా ఆరోపణలు
'భారత్, సింగపూర్‌లలో తాను ఏర్పాటు చేసిన రెండు కన్సల్టింగ్ కంపెనీల కార్యకలాపాలను, 2017లో తాను సెబీలో చేరాక నిలిపివేసినట్లు మాధబి స్వయంగా తెలిపారు. 2019లో వాటిని ఆమె భర్త టేకోవర్ చేసుకున్నారని పేర్కొన్నారు. తాజా వాటాదార్ల వివరాల ప్రకారం, అగోరా అడ్వయిజరీ లిమిటెడ్ (ఇండియా)లో 2024 మార్చి 31 నాటికి మాధబి పురి బచ్ 99% వాటా కలిగి ఉన్నారు. ఇప్పటికీ ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తూ, ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అగోరా అడ్వయిజరీ లిమిటెడ్ (సింగపూర్)లో మాధబికి 100 శాతం వాటాలు ఉన్నాయి. సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన 2 వారాల తర్వాత, ఆ సంస్థలో తన వాటాను ఆమె తన భర్తకు బదిలీ చేశారు. అయితే సింగపూర్ సంస్థ తన లాభదాయ వివరాలను బహిర్గతం చేయలేదు. దీంతో సెబీ పూర్తికాల సభ్యురాలిగా ఉన్న సమయంలో మాధబి ఈ సంస్థ ద్వారా ఎంత ఆర్జించారో తెలుసుకోవడం కష్టం' అని హిండెన్‌బర్గ్ పేర్కొంది.
భర్త పేరు మీద వ్యాపారం
ఇక భారత సంస్థలో మాధబి పురి బచ్ పేరు మీదుగా 99% వాటా ఉండగా, ఆమె సెబీ ఛైర్‌పర్స్‌గా ఉన్న సమయంలో ఈ సంస్థ రూ.2.40 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిందని హిండెన్‌బర్గ్ వెల్లడించింది. 'సెబీలో పూర్తి కాల సభ్యురాలిగా ఉన్న సమయంలోనే, మాధబి తన వ్యక్తిగత ఈ-మెయిల్‌ను ఉపయోగించి తన భర్త పేరు మీద వ్యాపారం నిర్వహించినట్లు ప్రజావేగు దస్త్రాలు చెబుతున్నాయి. ఇవన్నీ చూస్తే ఆమె అధికారిక హోదాలో ఉంటూ, మరేదైనా ఇతర వ్యాపారాలను తన భర్త పేరు మీద నిర్వహించారా? అనే సందేహాలు వస్తున్నాయి. వీటన్నింటిపై పారదర్శక దర్యాప్తునకు మాధబి సిద్ధంగా ఉండాలి. ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలి' అని హిండెన్‌బర్గ్ సూచించింది.
మాధబికి రీట్స్ సంఘం మద్దతు
మరోవైపు ఈ విషయంలో సెబీ ఛైర్‌పర్సన్ మాధబికి స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టు (రీట్స్), ప్రత్యామ్నాయ పెట్టుబడుల సంఘాలు మద్దతుగా నిలిచాయి. రీట్స్‌పై సెబీ రూపొందించిన విధానం, కొంత మందికి ప్రయోజనం చేకూర్చడమే కోసమే’ అంటూ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఇండియన్ రీట్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. దేశీయ, అంతర్జాతీయ మదుపర్లతో పాటు చిన్న మదుపర్ల ప్రయోజనాలకు అత్యంత భద్రత చేకూర్చేలా వివిధ వర్గాల సూచనలతో సెబీ కఠిన నియంత్రణా విధానాలను రూపొందించిందని ప్రశంసించింది. బచ్‌కు అండగా నిలుస్తున్నామని ద ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ కేపిటల్ అసోసియేషన్ పేర్కొంది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సెబీ, సెబీ ఛైర్‌పర్సన్ మాధబి తమ స్పందన తెలియజేశారని, అంతకుమించి తాము చెప్పేది ఏమీ లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ అన్నారు.
'న్యాయ విచారణ చేపట్టాలి'
సెబీ ఛైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ చేపట్టాలంటూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మాజీ బ్యూరోక్రాట్ ఇఎఎస్ శర్మ లేఖ రాశారు. 'సెబీ ఛైర్‌పర్సన్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరం. సెబీ కాకుండా ప్రభుత్వం, దాని సంస్థలతో సంబంధం లేని ఒక స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఆదేశించాలి. హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో నిజానిజాలను వెలుగులోకి తేవాలి' అని శర్మ లేఖలో తెలిపారు.
హిండెన్‌బర్గ్ ఆరోపణల ఎఫెక్ట్ - అదానీ గ్రూప్ స్టాక్స్ ఢమాల్ - Adani Shares Today Graph