Health Emergency : 'ఆరోగ్యమే మహాభాగ్యము' అంటారు పెద్దలు. అలాంటి ఆరోగ్యం విషయంలో అప్రమత్తత పాటించడం చాలా అవసరం. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా వస్తాయో చెప్పలేము. అలాంటప్పుడు మీరు ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. లేదంటే ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం కష్టంగా మారుతుంది.
ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు దాని చికిత్సకు పెద్ద మొత్తంలోనే ఖర్చవుతుంది. ఈ సమయాల్లో మెడికల్ ఎమర్జెన్సీ నిధుల కోసం పరిగెత్తడం కంటే అలాంటి పరిస్థితులకు ముందు నుంచే సిద్ధంగా ఉండడం ఉత్తమమైన మార్గమని గుర్తుంచుకోండి. అలాగే ఊహించని వైద్య ఖర్చుల కోసం ఒక ప్రణాళికను కలిగి ఉండడం కూడా ముఖ్యమే. అందుకే ఆర్థికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకునే కొన్ని మార్గాలు గురించి ఇప్పుడు చూద్దాం.
బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణకు చోటు
ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి వేర్వేరు ఆరోగ్య సంరక్షణ అవసరాలు ఉండవచ్చు. అందుకు మీ నెలవారీ బడ్జెట్‌లో కొంత మొత్తాన్ని మెడికల్ ఎమర్జెన్సీ ఫండ్ కింద ప్రత్యేకంగా కేటాయించాలని ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా బీమా ప్రీమియంలు, రెగ్యులర్ చెకప్‌లు, అత్యవసర ఆరోగ్య నిధి ఏర్పాటుకు అవసరమైన నిధులు కేటాయించాలి.
ఎమర్జెన్సీ ఫండ్
ఆర్థిక అత్యవసరాలను ఎదుర్కొనేందుకు ముందుగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అనారోగ్యాలు చెప్పిరావు. అకస్మాత్తుగా ఆసుపత్రి పాలైన వారిని ఎంతో మందిని చూస్తుంటాం. ఇవే సంఘటనలు ఎవరికైనా జరగవచ్చు. గనుక, ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, 6 నెలల సంపాదన మొత్తాన్ని అత్యవసర నిధిగా సమకూర్చుకోవాలి. దీనిని షార్ట్ టర్మ్ ఎఫ్‌డీలు లేదా సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో ఉంచవచ్చు.
రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు
మీరు ఆరోగ్యంగా ఉన్నా కూడా 45-50 సంవత్సరాలు దాటిన తర్వాత రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లను చేయించుకోవడం మంచిది. ఆరోగ్య పరీక్షల ద్వారా ముందస్తు అనారోగ్య లక్షణాలను గుర్తించడం సులువు అవుతుంది. దీనివల్ల రోగం మరింత ముదరకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది.
ఆరోగ్య బీమా మస్ట్
రోజురోజుకు వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. వీటిని తట్టుకోవడానికి తగిన ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవాలి. దీనివల్ల జీవితంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా దానిని ఎదుర్కోవడానికి ఆర్థికంగా సిద్ధంగా ఉండవచ్చు. అత్యవసర పరిస్థితులు, ఆసుపత్రిలో చేరడం, తీవ్రమైన అనారోగ్యాలను కవర్ చేసే ప్లాన్‌ల కోసం చూడండి.
వాటికోసం టెలిమెడిసిన్ సేవలు పొందండి
ఒకవేళ మీకు ఆరోగ్య బీమా ఉన్నట్లయితే నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో చేరవచ్చు. మారిన నిబంధనల ప్రకారం, ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ నగదు రహిత సేవలు పొందవచ్చు. అయితే ఇవి బీమా పరిమితి మేరకే నిధులు అందిస్తాయి. కనుక సాధ్యమైనంత వరకు ఖర్చుల గురించి ముందుగానే తెలుసుకోండి. కొన్నిసార్లు ఆసుపత్రులు డిస్కౌంట్స్, బిల్లుల తగ్గింపులను అందించవచ్చు.
అంతేకాకుండా ఈ రోజుల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కోసం భౌతికంగా ఆసుపత్రిని సందర్శించకుండా ఆన్‌లైన్‌లోనే డాక్టర్స్‌ను సంప్రదించడానికి వీలవుతోంది. చిన్న ఆరోగ్య సమస్యల కోసం పొందే టెలిమెడిసిన్ సేవలు పెద్దగా ఖర్చుతో కూడుకున్నవి కూడా కావు. పైగా పేషెంట్‌కు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా కవర్ చేసే బీమా పాలసీ కోసం అన్వేషించండి.
మెరుగైన క్రెడిట్ స్కోరు
ఏదైనా ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మీకు సహాయపడే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మంచి క్రెడిట్ స్కోర్‌ను మెయింటెయిన్ చేయడం. ప్రత్యేకించి అత్యవసర పరిస్థితుల్లో, మంచి క్రెడిట్ స్కోరు, వేగంగా రుణం పొందడానికి వీలు కల్పిస్తుంది. పైగా తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందేలా చేస్తుంది. ఒక్కోసారి అనారోగ్యం పాలయినప్పుడు బీమా లేకపోయినా లేదా సరిపోకపోయినా అత్యవసరంగా రుణాలు తీసుకోవాల్సి రావచ్చు. అలాంటి సమయాల్లో రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించవచ్చు. మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్నవారికి బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలిస్తాయి.
ముందు జాగ్రత్త చాలా ముఖ్యం
మీ బీమా కవరేజీ, అత్యవసర నిధి, ఆర్థిక ప్రణాళికలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మీ ఆరోగ్యం, ఆదాయం, కుటుంబ పరిస్థితుల్లో మార్పుల ఆధారంగా వాటిని అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఆరోగ్య అత్యవసర పరిస్థితులను నివారించడానికి తగిన చర్యలపై దృష్టి పెట్టాలి. మంచి అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల ఆహారం తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి.
అప్పులు త్వరగా తీర్చేసేందుకు సూపర్ మార్గం ఇది! - how to clear loans fast
జీవిత బీమా తీసుకుంటున్నారా? ఈ 'రైడర్ల'ను కచ్చితంగా యాడ్ చేసుకోండి! - Life Insurance Riders