Gas Cylinder Price Today : గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.30.50 వరకు తగ్గించాయి. దీంతో దిల్లీలో దీని ధర రూ.1764.50కు చేరుకుంది. అలాగే 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ ధర కూడా రూ.7.50కు తగ్గింది. తగ్గిన ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
నేటి నుంచి (ఏప్రిల్ 1)కొత్త ఆర్థిక ఏడాది షురూ అయ్యింది. దీనితో అనేక కొత్త ఆర్థిక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీన, 15వ తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయన్న సంగతి తెలిసిందే. సిలిండర్ ధరలను పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం లాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. తాజాగా ఒకటో తేదీన గుడ్ న్యూస్ చెప్పాయి చమురు సంస్థలు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ30.50 వరకు తగ్గించాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. దీంతో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర దేశ రాజధాని దిల్లీలో రూ.1764.50కు చేరింది. అంతకుముందు ధర రూ.1795గా ఉండేది.
వాణిజ్య గ్యాస్ ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే?
- కోల్‌కతా రూ.1879
- ముంబై రూ.1717
- చెన్నై రూ.1930
- హైదరాబాద్ రూ.2027 ఉండేది. ఇప్పుడు దీనిపై రూ.30.50 తగ్గింది.
గత కొన్నాళ్లుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇంట్లోని వంటగ్యాస్ ధరలు తగ్గిస్తున్నా, కమర్షియల్ సిలిండర్ ధరలను మాత్రం పెంచుకుంటూ పోయాయి చమురు సంస్థలు. వాణిజ్య సిలిండర్లను బయట షాపుల్లో వినియోగిస్తారు. కాబట్టి హోటల్స్‌లో, ఫుడ్ కోర్టుల్లో తయారు చేసే ఆహార పదార్థాల ధరలు స్వల్పంగా తగ్గే ఛాన్స్ ఉంది.
డొమెస్టిక్ సిలిండర్ ధరల విషయానికి వస్తే, ప్రస్తుతం దిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.803గా ఉంది. హైదరాబాద్ రూ.855గా ఉంది. ప్రస్తుతం రూ.300 వరకు సబ్సిడీ ఇస్తున్నారు. కనుక ప్రస్తుతానికి రూ.503, రూ.555కే గ్యాస్ సిలిండర్లు లభిస్తున్నాయి.
ఎఫ్టీఎల్ సిలిండర్ ధరల తగ్గింపు!
5కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ ధరను రూ.7.50 వరకు తగ్గించినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
రెండుసార్లు తగ్గిన దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలు:
పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు, కేంద్ర ప్రభుత్వం గత 6 నెలల్లో దాదాపు రెండుసార్లు ఎల్పీజీ సిలిండర్ల ధరలను తగ్గించింది. గత మార్చి 9వ తేదీన ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది. అలాగే రక్షాబంధన్ సందర్భంగా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ.200 తగ్గించింది.
పేదలకు గుడ్‌న్యూస్- రూ.100 తగ్గిన వంట గ్యాస్ ధర, మహిళలకు మోదీ ఉమెన్స్ డే గిఫ్ట్
రూ.500కే గ్యాస్ సిలిండర్ల లెక్క తేలింది - ఏడాదికి గరిష్ఠంగా ఎన్ని వాడుకోవచ్చో తెలుసా?