Evergrande Liquidation Hong Kong : చైనా ప్రముఖ స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్ దివాలా అంశంలో కీలక తీర్పు వెలువడింది. రుణదాతలతో పునర్‌వ్యవస్థీకరణ ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైన నేపథ్యంలో ఆ గ్రూప్‌ను లిక్విడేట్ చేయాలని హాంకాంగ్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఓ ఆచరణాత్మక పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంలో ఎలాంటి పురోగతి లేనందున ఎవర్‌గ్రాండ్ తన వ్యాపారాన్ని మూసివేయటం ( Evergrande Winding Up ) సముచితంగా అనిపిస్తోందని హాంకాంగ్ కోర్టు న్యాయమూర్తి లిండా ఛాన్ పేర్కొన్నారు.
300 బిలియన్ డాలర్ల రుణ పునర్వ్యవస్థీకరణపై ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు గతంలో ఎవర్‌గ్రాండ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు న్యాయస్థానం ఓ అవకాశం ఇచ్చింది. కానీ, రుణ పునర్‌వ్యవస్థీకరణ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని న్యాయస్థానం తాజాగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో లిక్విడేషన్‌కు ఆదేశించింది. ఈ మేరకు సంస్థకు ఉన్న ఆస్తులను విక్రయించి రుణదాతలకు చెల్లింపులు చేయనున్నారు.
ఆ నిబంధనలతో ఎవర్‌గ్రాండ్‌కు చిక్కులు
ప్రపంచంలోనే అత్యధిక అప్పులు ఉన్న సంస్థగా ఎవర్‌గ్రాండ్ పేరు సంపాదించింది. ఈ సంస్థకు సుమారు 300 బిలియన్ డాలర్ల అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీకి మొత్తం 240 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. స్థిరాస్తి రంగంలో అదుపుతప్పిన రుణాల అంశంపై గతంలో దృష్టిసారించిన చైనా నియంత్రణ సంస్థలు కఠిన నిబంధనలను తీసుకొచ్చాయి. ఫలితంగా నిర్మాణ రంగంలోని అనేక కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. అందులో ఎవర్‌గ్రాండ్ కూడా ఒకటి. 2021లో వాయిదాలు చెల్లించడంలో కూడా విఫలమైంది ఎవర్‌గ్రాండ్. దీంతో దివాలా తీసినట్లు ప్రకటించింది.
'మా కార్యకలాపాలు కొనసాగుతాయి'
లిక్విడేషన్ తీర్పుపై స్పందించిన ఎవర్‌గ్రాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సియూ షాన్- కంపెనీ చేపట్టిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. లిక్విడేషన్ ఆర్డర్ వచ్చినా తమ కస్టమర్లకు ఇళ్లు డెలివరీ చేస్తామని చెప్పారు. కోర్టు తీర్పు కంపెనీ ఆఫ్‌షోర్, ఆన్‌షోర్ కార్యకలాపాలపై ప్రభావం చూపదని అన్నారు.
Evergrande Share Price :
కోర్టు తీర్పు నేపథ్యంలో ఎవర్‌గ్రాండ్ షేర్లు భారీగా పడిపోయాయి. 20 శాతానికి పైగా పతనమయ్యాయి. దీంతో హాంకాంగ్ స్టాక్ మార్కెట్లలో ఈ షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేశారు.
Evergrande: సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ కంపెనీలు
ఇరాన్‌కు చైనా వార్నింగ్- నౌకలపై దాడులు ఆపకపోతే వ్యాపార సంబంధాలు కట్!