EPF Death Claim Process : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) డెత్ క్లెయిమ్ ప్రాసెస్‌ను చాలా సులభతరం చేసింది. ఉద్యోగులు మరణించినప్పుడు వారి డెత్ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడంలో ఫీల్డ్ ఆఫీస్‌లు పలు సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వాటిని పరిష్కరించడానికే ఈపీఎఫ్ఓ డెత్ క్లెయిమ్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. దీని ప్రకారం, ఇకపై ఆధార్ ధ్రువీకరణ లేకున్నా, ఫిజికల్ క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి అవకాశం ఏర్పడింది.
ఈపీఎఫ్ఓ సభ్యుల మరణం తరువాత వారి ఆధార్ వివరాలు సరిదిద్దడానికి లేదా అప్డేట్ చేయడానికి వీలుపడడం లేదు. దీని వల్ల వారి డెత్ క్లెయిమ్స్ ప్రాసెస్ చేసేందుకు వీలుకావడం లేదు. అందుకే ఆధార్ సీడింగ్ చేయకుండానే, ఫిజికల్ క్లెయిమ్ ప్రాసెస్ చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఇది కచ్చితంగా ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో మేలు చేస్తుంది.
షరతులు వరిస్తాయి!
ఆధార్ ధ్రువీకరణ లేని సందర్భాల్లో, ఆఫీసర్ ఇంఛార్జ్ (ఓఐసీ) నుంచి కచ్చితంగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే, మరణించిన వ్యక్తి ఈపీఎఫ్ఓ సభ్యత్వాన్ని, హక్కుదారుల చట్టబద్ధతను ధ్రువీకరించడానికి ఓఐసీ ఆమోదించిన ఈ-ఆఫీస్ ఫైల్ కచ్చితంగా ఉండాలి. మోసపూరిత డెత్ క్లెయిమ్‌ను నివారించడానికి ఇది తప్పనిసరి అని ఈపీఎఫ్ఓ 2024 మే 17న విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.
యూఏఎన్ (UAN)లో సభ్యుని వివరాలు అన్నీ సరిగ్గా ఉంటేనే ఈ వెసులుబాటు ఉంటుంది. అప్పుడే యూఐడీ (UID) డేటాబేస్‌లో సరైనా సమాచారం లేకపోయినా, లేదా అసంపూర్తి సమాచారం ఉన్నా డెత్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
"యూఏఎన్‌లో సభ్యుని ఆధార్ వివరాలు సరిగ్గా ఉంటే ఫర్వాలేదు. ఒకవేళ ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోతే, ఫీల్డ్ ఆఫీసులు తప్పనిసరిగా 2024 మార్చి 26 నాటి జేడీఎస్ఓపీ వెర్షన్-2లోని 6.9, 6.10 పేరాల్లో వివరించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. యూఏఎన్, ఆధార్ సీడింగ్ డేటాను కూడా వీలైతే సరిదిద్దాలి. అలా వీలుకానప్పుడు మాత్రమే ఫిజికల్ క్లెయిమ్ ప్రాసెస్ ప్రారంభించాలి."
- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సర్క్యులర్
ఫీల్డ్ ఆఫీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు
ఈపీఎఫ్ఓ సర్క్యూలర్ ప్రకారం, ఫీల్డ్ ఆఫీసులు మరణించిన వ్యక్తుల ఆధార్ సీడింగ్, ప్రామాణీకరణలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఏమిటంటే?
- ఆధార్ రికార్డుల్లోని సభ్యుల వివరాల్లో దోషాలు ఉంటున్నాయి. లేదా సదరు వ్యక్తుల వివరాలు చాలా వరకు అసంపూర్తిగా ఉంటున్నాయి.
- ఆధార్ ప్రవేశపెట్టక ముందు నుంచే ఉన్న సభ్యుల వివరాలు అందుబాటులో ఉండడంలేదు.
- డీయాక్టివేట్ అయిన ఆధార్ అకౌంట్లు చాలానే ఉంటున్నాయి.
- యూఐడీఏఐ డేటాబేస్ ద్వారా ఆధార్‌ను ధ్రువీకరించడంలో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.
- ఈ సమస్యల వల్ల ఫీల్డ్ ఆఫీసర్లు, డెత్ క్లెయిమ్‌లను త్వరగా ప్రాసెస్ చేయలేకపోతున్నారు. దీనితో బాధిత కుటుంబానికి పరిహారం అందించడంలో తీవ్రమైన జాప్యం ఏర్పడుతోంది.
ఆధార్ సీడింగ్ చేయకుండానే క్లెయిమ్ ప్రాసెస్!
ఈపీఎఫ్ఓ తాజాగా డెత్ క్లెయిమ్ రూల్స్‌ను సరళీకరించింది. కనుక ఇకపై ఆధార్ సీడింగ్ చేయకుండానే, ఫిజికల్ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి వీలు ఏర్పడింది. దీని ప్రకారం,
- ఉద్యోగి మరణించినప్పుడు ఆధార్ సీడింగ్ లేకుండానే ఫిజికల్ క్లెయిమ్ ద్వారా తాత్కాలికంగా భత్యం (Temporary allowance) అందిస్తారు.
- అయితే ఇందుకోసం ఈ-ఆఫీస్ ఫైల్ ద్వారా ఆఫీసర్ ఇన్ఛార్జ్ (ఓఐసీ) నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది.
- మరణించిన ఉద్యోగి ఈపీఎఫ్ఓ సభ్యత్వం గురించి, హక్కుదారుల ప్రామాణికతను నిర్ధరించడానికి తగిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది.
- మోసపూర్తిత క్లెయిమ్‌లను నిరోధించడానికి ఓఐసీ నిర్దేశించిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది.
విద్య, వివాహం కోసం!
2023-24లో ఏకంగా 2.84 కోట్ల అడ్వాన్స్ క్లెయిమ్స్ సహా 4.45 కోట్ల క్లెయిమ్‌లను ఈపీఎఫ్ఓ పరిష్కరించింది. జీవన సౌలభ్యాన్ని (ఈజ్ ఆఫ్ లివింగ్) పెంచేందుకు - విద్య, వివాహం, గృహ నిర్మాణం కోసం కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ఈపీఎఫ్ఓ వీలు కల్పిస్తోంది.
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ అన్నీ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా! - Mobile App Safety Check