EPFO Interest Rate : ఉద్యోగుల భవిష్య నిధి(EPF) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25 శాతం వడ్డీరేటును నిర్ణయించారు. ఈ మేరకు శనివారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌వో (EPFO) వర్గాలు వెల్లడించాయి. గత మూడేళ్లలో ఇదే అత్యధికం.
సీబీటీ (CBT) నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ (EPFO) 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.15శాతంగా నిర్ణయించారు. అంతకు ముందు 2021-22లో 8.10శాతం వడ్డీ చెల్లించారు.
గత పదేళ్లలో వడ్డీ రేట్లు ఇలా!
- 2013-14 : 8.75 శాతం
- 2014-15 : 8.75 శాతం
- 2015-16 : 8.8 శాతం
- 2016-17 : 8.65 శాతం
- 2017-18 : 8.55 శాతం
- 2018-19 : 8.65 శాతం
- 2019-20 : 8.5 శాతం
- 2020-21 : 8.5 శాతం
- 2021-22 : 8.1 శాతం
- 2022-23 : 8.15 శాతం
పీఎఫ్ అకౌంట్లో ఎంత డబ్బుంది?
పీఎఫ్ అకౌంట్లో జమ అయిన నగదును చందాదారులు చెక్ చేసుకోవాలంటే గతంలో చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. అలాగే వైద్య, విద్య ఖర్చులు లేదా ఇంటి మరమ్మతుల వంటి అత్యవసర ఖర్చుల కోసం PF ఖాతా నుంచి డబ్బును విత్డ్రా చేసుకోవాలన్నా బ్యాంక్ లేదా పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఉన్న చోటు నుంచే మీ పీఎఫ్ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సేవలను సులభతరం చేయడానికి ఈపీఎఫ్‌వో 'UMANG' అనే మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా మీ పీఎఫ్ వివరాలు ఎలా చెక్ చేసుకోవాలో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.