Credit Card Using Precautions: మన జీవితంలో అకస్మాత్తుగా అనేక ఆర్థిక అవసరాలు వస్తుంటాయి. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం క్రెడిట్ కార్డులు నిత్యావసరంగా మారాయి. ఈ రోజుల్లో చెల్లింపులు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు.
అయితే క్రెడిట్ కార్డును సరైన పద్ధతిలో ఉపయోగించుకున్నట్లయితే మీకు అత్యవసర సమయాల్లో ఆర్థిక సాధనంగా ఉపయోగపడుతుంది. అనవసరమైన ఖర్చుల కోసం క్రెడిట్ కార్డును వాడితే మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెడుతుంది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డు ఉన్నవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 5 విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్‌లు
చాలా క్రెడిట్ కార్డులు బోనస్ రివార్డ్ పాయింట్లు, కాంప్లిమెంటరీ మెంబర్ షిప్‌లు, డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఉచిత విమాన టిక్కెట్లు మొదలైన ప్రయోజనాలను అందిస్తాయి. ఉదాహరణకు, ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్స్‌కు మొదటి స్విగ్గీ ఆర్డర్ పై 50 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది. మరికొన్ని సంస్థలు గిఫ్ట్ వోచర్లను అందిస్తాయి.
క్రెడిట్ కార్డును జారీ చేసే సంస్థలు స్వాగత ప్రయోజనాలు అందించేటప్పుడు కొన్ని నిబంధనలు, షరతులను పెడతాయి. ఈ ప్రయోజనాలను పొందేందుకు మీరు మొదటి 30 రోజుల్లో లేదా మొదటి మూడు నెలల్లో కొంత మొత్తాన్ని వెచ్చించాల్సి రావచ్చు. ఉదాహరణకు HDFC రెగాలియా గోల్డ్‌పై కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్‌ను పొందేందుకు మీరు కార్డ్ జారీ చేసిన 90 రోజులలోపు రూ.1 లక్ష ఖర్చు చేయాల్సి ఉంటుంది.
వాల్యూ బ్యాక్ అందిస్తాయి
క్రెడిట్ కార్డులు రివార్డ్ పాయింట్ల రూపంలో వాల్యూ బ్యాక్‌ను అందిస్తాయి. మరికొన్ని సార్లు వాల్యూ- బ్యాక్‌తో పాటు ఎక్కువ ఖర్చులపై క్యాష్ బ్యాక్ అందిస్తాయి. కొన్ని కార్డులు ఎంపిక చేసిన బ్రాండ్‌లపై అదనపు బెనిఫిట్స్ ఇస్తాయి. క్రెడిట్ కార్డు రివార్డులపై కూడా కొన్ని మినహాయింపులు, షరతులు ఉంటాయి. ఉదాహరణకు మీరు ఇంధనం, ఆభరణాలు మొదలైన వాటిపై ఎలాంటి రివార్డ్స్ ను పొందలేకపోవచ్చు.
ఆర్థిక భద్రతకు ప్రమాదకరం!
కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్నవారు చేసే అతి తీవ్రమైన తప్పులలో బకాయి ఉన్న కనీస మొత్తాన్ని (Minum Bill) మాత్రమే చెల్లించడం. మీరు క్రెడిట్ బిల్లు మొత్తం కట్టకుండా బకాయి ఉన్న కనీస మొత్తాన్ని చెల్లించడం వల్ల తర్వాత ఇబ్బందులు పడతారు. క్రెడిట్ కార్డు జారీ సంస్థలు మీపై ఫైనాన్స్ ఛార్జీలను విధిస్తాయి. దీంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. మరోవైపు, కనీస బకాయి చెల్లింపును కూడా చెల్లించలేకపోతే ఫైనాన్స్ ఛార్జీలతో, ఆలస్య చెల్లింపు ఛార్జీలు కూడా పడతాయి. ఇది మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. అలాగే క్రెడిట్ హిస్టరీని దెబ్బతిస్తుంది.
నగదు విత్ డ్రా చేయకండి
కొన్ని క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేస్తే ఫైనాన్స్ ఛార్జీలు పడతాయి. మీరు నగదు విత్ డ్రా చేసిన ప్రతిసారీ రుసుము పడుతుంది. ఇది విత్ డ్రా చేసిన మొత్తంలో 2- 5 శాతం ఉండవచ్చు. అంతేకాకుండా నగదును విత్ డ్రా చేస్తే కొత్త లావాదేవీలపై వడ్డీ రహిత కాలాన్ని పొందలేరు. దీంతో అప్పులు మరింత పెరుగుతాయి.
కార్డుతో ప్రయోజనాలివే
రివార్డులు, క్యాష్ బ్యాక్‌తో పాటు క్రెడిట్ కార్డులు మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి. ప్రయాణికుల కోసం రూపొందించిన ట్రావెల్ క్రెడిట్ కార్డులు ఎయిర్ మైల్స్, హోటల్‌లో బస, ఇతర ప్రయాణ సంబంధిత పెర్క్‌ల రూపంలో రివార్డ్స్ ను అందిస్తాయి. అయితే దీని కోసం మీరు ముందుగా హోటల్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవాలి.
అదేవిధంగా సాధారణ క్రెడిట్ కార్డులతో పోలిస్తే కో-బ్రాండెండ్ క్రెడిట్ కార్డుల వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. నిర్దిష్ట బ్రాండ్లు, వ్యాపారాలు, రిటైలర్లు, సర్వీస్ ప్రొవైడర్లు ఇలా మొదలైన వాటితో కలసి బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు వీటిని తీసుకొస్తాయి. ఈఎంఐలపై తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ రుసుములపై రాయితీ వంటి ప్రయోజనాలు ఉంటాయి.
ఉద్యోగం లేకున్నా క్రెడిట్ కార్డు పొందవచ్చు - ఎలాగో తెలుసా? - How To Get Credit Card Without Job
మీరు క్రెడిట్ కార్డ్ యూజర్లా? 'గ్రేస్ పీరియడ్'ను తెలివిగా వాడుకోండిలా! - Credit Card Grace Period