Credit Card Changes From April 1st 2024 : క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్. 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో పలు కీలక మార్పులు చేపట్టనున్నాయి కొన్ని బ్యాంకులు. ఈ జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ లాంటి ప్రధాన బ్యాంకులు ఉన్నాయి. ఇవి లాంజ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్ల విషయంలో కీలక మార్పులు చేశాయి. ఇవి ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. ఇంతకీ ఆ మార్పులు ఏమిటంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల విధానాల్లో మార్పు చేసింది. ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందిస్తున్న బ్యాంక్, ఏప్రిల్ 1 నుంచి ఆ తరహా రివార్డులను నిలిపివేయనుంది. ముఖ్యంగా ఎస్‌బీఐ అందిస్తున్న AURUM, SBI కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్ ఎస్‌బీఐ కార్డులు వినియోగిస్తున్న వారిపై దీని ప్రభావం పడనుంది.
ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తున్న కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలోనూ నిబంధనలు మారాయి. రానున్న త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే, మునుపటి త్రైమాసికంలో కార్డ్ ద్వారా కనీసం రూ.35,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కోరల్ క్రెడిట్ కార్డ్, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ సహా వివిధ రకాల కార్డులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఈ మార్పులు కూడా కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 నుంచి అమల్లోకి రానున్నాయి.
యెస్ బ్యాంక్
యెస్ బ్యాంక్ కూడా లాంజ్ యాక్సెస్ విషయంలో నిబంధనల్ని మార్చింది. ఏప్రిల్ 1 నుంచి ఏ త్రైమాసికంలో అయినా లాంజ్ సదుపాయం పొందాలంటే అంతకు మునుపటి త్రైమాసిక త్రైమాసికంలో యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కనీసం రూ.10,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
యాక్సిస్ బ్యాంక్
ప్రైవేటు రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్, తాము అందిస్తున్న మాగ్నస్ క్రెడిట్ కార్డ్‌పై రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్‌తో పాటు వార్షిక రుసుముల్లో కీలక మార్పులను తీసుకొచ్చింది. బీమా, గోల్డ్ లేదా ఆభరణాలు, ఇంధనం కోసం క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి రివార్డ్ పాయింట్లు రావని స్పష్టంచేసింది. ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో కనీసం రూ.50,000 వెచ్చించాల్సి ఉంటుందని తెలిపింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో దేశీయ, అంతర్జాతీయ లాంజ్‌ల్లోకి కాంప్లిమెంటరీ గెస్ట్ సందర్శనల సంఖ్యను కూడా ఏడాదికి 8 నుంచి 4కు తగ్గించింది. ఈ కొత్త మార్పులు ఈ ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి వస్తాయని యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది.