Bharti Airtel Scholarship 2024 : ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌కు చెందిన భారతీ ఎయిర్‌టెల్ ఫౌండేషన్ కీలక ప్రకటన చేసింది. ఐఐటీలతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (నిర్ఫ్)లోని టాప్-50 సాంకేతిక విద్యాసంస్థల్లో యూజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదివే పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ఈ విద్యాసంస్థల్లో చదివే 4వేల మంది నిరుపేద ప్రతిభావంతులకు ఏటా 'భారతీ ఎయిర్‌టెల్ స్కాలర్‌షిప్'ను అందిస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఏటా రూ.100 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధమని వెల్లడించింది. భారతీ ఎయిర్‌టెల్ ఫౌండేషన్ 25వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా మంగళవారం ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
ఈ ఏడాది 250 మందికి
'భారతీ ఎయిర్‌టెల్ స్కాలర్‌షిప్' పథకంలో భాగంగా తొలివిడతగా ఈ ఏడాది ఆగస్టులో 250 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను అందిస్తామని ఫౌండేషన్ తెలిపింది. ఈ స్కాలర్‌షిప్ పథకాన్ని క్రమంగా పెంచుతూ ఏటా 4వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు చేయూతను అందించే స్థాయికి విస్తరిస్తామని పేర్కొంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8.5 లక్షలకు మించని విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను మంజూరు చేస్తారు. దీనికి ఎంపికయ్యే వారిని 'భారతీ స్కాలర్స్' అని పిలుస్తారు. వీరికి కోర్సు చేసే వ్యవధిలో ప్రతి సంవత్సరం కళాశాల ఫీజు మొత్తాన్ని భారతీ ఎయిర్‌టెల్ ఫౌండేషన్ చెల్లిస్తుంది. భారతీ స్కాలర్స్‌కు ల్యాప్‌టాప్ కూడా ఉచితంగా అందిస్తుంది.
వారికి ప్రాధాన్యం
విభిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యం ఉన్నవారికి, ముఖ్యంగా విద్యార్థినులకు ఈ స్కాలర్‌షిప్‌లలో ప్రాధాన్యం ఇస్తామని భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ ఛైర్మన్, భారతీ ఎయిర్‌టెల్ ఫౌండేషన్ కో ఛైర్మన్ రాకేష్ భారతీ మిత్తల్ తెలిపారు. విద్యారంగ సేవా కార్యక్రమాల ద్వారా గత 25ఏళ్లలో 60 లక్షల మంది జీవితాలను తాము తీర్చిదిద్దామని ఆయన చెప్పారు. భవిష్యత్ సాంకేతిక విప్లవంలో పేద వర్గాల వారికి కూడా చోటు ఉండాలనేదే తమ సంకల్పమని వివరించారు. భారతీయ విద్యారంగం వికాసానికి తమవంతు సేవలను కొనసాగిస్తామని రాకేష్ భారతీ మిత్తల్ పేర్కొన్నారు.