Bajaj CNG Bike Launch Soon : బజాజ్ ఆటో కంపెనీ ప్రపంచంలోనే మొదటి సీఎన్జీ మోటార్ సైకిల్‌ను రూపొందించింది. త్వరలోనే దీనిని ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద రూ.5000 కోట్ల ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది.
జూన్‌లో లాంఛ్
బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ 2024 జూన్ నెలలో ఈ సరికొత్త సీఎన్జీ మోటార్‌సైకిల్‌ను లాంఛ్ చేస్తామని ప్రకటించారు. అయితే దీనిని నేరుగా బజాజ్ బ్రాండ్‌తో కాకుండా, బజాజ్ సబ్-బ్రాండ్ కింద తెస్తామని వెల్లడించారు.
ఎక్కువ మైలేజ్!
చాలా మంది మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లు కొనాలని ఆశపడుతూ ఉంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే, బజాజ్ కంపెనీ ఈ నయా సీఎన్జీ బైక్‌ను రూపొందించింది. అయితే ఈ బైక్ ధర పెట్రోల్ వేరియంట్ కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈ సీఎన్జీ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌ను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా దీనిలో సీఎన్జీ, పెట్రోల్ ఫ్యూయెల్ ఆప్షన్లు రెండూ కల్పిస్తున్నారు. ఫలితంగా సీఎన్జీ బైక్ తయారీ ఖర్చులు కాస్త పెరుగుతాయి. అందుకే ఈ నయా సీఎన్జీ బైక్ ధర, పెట్రోల్ బైక్ కంటే కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
సీఎస్ఆర్
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల కోసం బజాజ్ గ్రూప్ రూ.5000 కోట్లను ఖర్చు చేస్తుందని బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్ స్పష్టం చేశారు. దీని వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 2 కోట్ల మంది యువతీ, యువకులకు ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. తద్వారా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో నేటి యువత భాగస్వామ్యులు అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
బజాజ్ ఛారిటీ కార్యక్రమాలు
బజాజ్ కంపెనీ మొదటి నుంచి అనేక ఛారిటీ కార్యక్రమాలు చేస్తోంది. ముఖ్యంగా జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్, జానకీదేవీ బజాజ్ గ్రామ వికాస్ సంస్థ, కమల్‌నయన్ బజాజ్ హాస్పిటల్స్ ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు.
గతేడాది బజాజ్ ఇంజినీరింగ్ స్కిల్స్ ట్రైనింగ్ (బెస్ట్) కూడా ప్రారంభించారు. దీని ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. దీని వల్ల 'ఇంజినీరింగ్ కాలేజ్‌ల్లో థియరిటికల్‌గా నేర్చుకున్న అంశాలకు, ఫ్యాక్టరీల్లో ప్రాక్టికల్‌గా జరిగే ప్రొడక్షన్‌కు మధ్య ఉన్న అంతరాన్ని విద్యార్థులు తెలుసుకోగలుగుతారు. ఇండస్ట్రీ అవసరాలకు తగిన నైపుణ్యాలు నేర్చుకోగలుగుతారు' అని రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు.
కొత్త స్కూటీ కొనాలా? ఆ మోడల్‌పై ఏకంగా రూ.45వేలు డిస్కౌంట్! - Scooter Offers In March 2024
'కైనెటిక్ ఇ-లూనా'కు గట్టి పోటీ ఇస్తున్న టాప్-2 వెహికల్స్ ఇవే! - Kinetic E Luna Vs Rivals Comparison