Tips To Increase Credit Score : క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత సులభంగా లోన్లు మంజూరు అవుతాయి. అలాగే వడ్డీ రేటు కూడా క్రెడిట్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు విధిస్తాయి. సకాలంలో చెల్లింపులు చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. లేదంటే తగ్గిపోతుంది. అయితే చాలా మంది క్రెడిట్ స్కోర్‌పై చాలా సందేహాలు, అపోహలు ఉంటాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
ఇటీవల కాలంలో కొత్తగా ఉద్యోగంలో చేరగానే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య ఎక్కువైపోయింది. తొలి క్రెడిట్ కార్డును పొందడం కష్టం, తర్వాత దానికి సకాలంలో బిల్లు చెల్లిస్తే చాలు కార్డులు ఇస్తామంటూ బ్యాంకులు ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో క్రెడిట్ స్కోరును పెంచుకునే దశలో చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటిని అధిగమించినప్పుడే క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది.
ఆదాయంతో సంబంధం లేదు
క్రెడిట్ స్కోరు బాగుండాలంటే ఆదాయం ఎక్కువ ఉండాలనే అపోహ చాలా మందిలో ఉంటుంది. క్రెడిట్ బ్యూరోలు చెప్పే వివరాల్లో బ్యాంకు అకౌంట్ల పేర్లు ఉంటాయి. కానీ, బ్యాంకు అకౌంట్లలో బ్యాలెన్స్ ఎంత ఉంది, ఖాతాదారుల ఆదాయం ఎంత అనేది అందులో కనిపించదు. రూ.5 లక్షలు సంపాదిస్తున్నవారికి మంచి క్రెడిట్ స్కోర్ ఉండవచ్చు. కొన్నిసార్లు రూ.20లక్షల ఆదాయం ఉన్నవారికి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండొచ్చు. ఆదాయంతో సంబంధం లేకుండా సకాలంలో బిల్లులు చెల్లించడం, తక్కువ క్రెడిట్ వినియోగం వంటివి క్రెడిట్ స్కోర్‌ను పెంచుతాయి. క్రెడిట్ స్కోరుపై ఆదాయ స్థాయి ఎటువంటి ప్రభావం చూపించదు.
లిమిట్ మించి వాడినా ఇబ్బందే!
చాలామంది క్రెడిట్ కార్డు లిమిట్ మేరకు వాడకపోయినా స్కోరుపై ప్రభావం చూపించిందని అపోహ పడుతుంటారు. నిజానికి కార్డు పరిమితిలో 40 శాతానికి మించి వాడినప్పుడు, క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే మీ కార్డు లిమిట్ రూ.2లక్షలు ఉందనుకుందాం. బిల్లింగ్ సైకిల్లో ఎప్పుడూ రూ.80వేలకు మించి వాడకూడదు. కొంతమంది కనీస నిల్వ చెల్లించి, కార్డును కొనసాగిస్తుంటారు. క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలనుకున్నప్పుడు ఇది ఏమాత్రం మంచిది కాదు. పూర్తి బిల్లును ఒకేసారి చెల్లించినప్పుడే మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.
అందులో నిజం లేదు!
పాత క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలను రద్దు చేయడం వల్ల క్రెడిట్ స్కోరు పెరుగుతుందనే మాటల్లో అసలు నిజం లేదు. దీనివల్ల మీ క్రెడిట్ హిస్టరీ తగ్గిపోతుంది. దీంతో క్రెడిట్ స్కోరు తగ్గే ప్రమాదమూ లేకపోలేదు. సుదీర్ఘ క్రెడిట్ చరిత్ర ఉన్నప్పుడే, రుణదాతలకు మీ ఆర్థిక క్రమశిక్షణపై ఒక అవగాహన వస్తుంది. కాబట్టి, దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సిల్ చేసుకోకపోవడం ఉత్తమం.
క్రెడిట్ స్కోరు బాగుంటేనే
కొత్త క్రెడిట్ కార్డు, రుణానికి దరఖాస్తు చేసిన ప్రతిసారీ మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. మెరుగైన క్రెడిట్ స్కోరున్నప్పుడే మీ దరఖాస్తులు ఆమోద ముద్ర పొందుతాయి. తక్కువ కాలంలోనే రెండు మూడు బ్యాంకుల దగ్గర లోన్ తీసుకునేందుకు ప్రయత్నించినా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. మీరు దరఖాస్తు చేసిన ప్రతిసారీ మీ క్రెడిట్ నివేదికపై అది కనిపిస్తుంది. అందువల్ల సాధ్యమైనంత మేరకు రుణ దరఖాస్తులను తగ్గించుకోవడం మంచిది.
క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చా?
చాలామంది తమ క్రెడిట్ స్కోరును పెంచుకోలేమని ఆందోళన పడుతుంటారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. మీ క్రెడిట్ స్కోరు మీ ఆర్థిక చరిత్రను ప్రతిబింబిస్తుంది. ఇదే శాశ్వతం కాదు. రుణాలను సకాలంలో తీర్చడం ద్వారా కాలక్రమేణా మీ క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. సాధారణంగా క్రెడిట్ హిస్టరీలో లావాదేవీలు మూడు నుంచి నాలుగేళ్లపాటు ఉంటాయి. అదే సమయంలో చెల్లించని రుణాల వివరాలు పదేళ్ల వరకూ ఉంటాయి. కనీసం 3-5ఏళ్లపాటు మీ ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తే క్రెడిట్ స్కోరును మెరుగుపర్చుకోవచ్చు.
రుణం చెల్లించినా క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా? కారణం ఇదే! - Credit Score Drop