Amazon Share Sale : అపర కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆ సంస్థలో తనకు చెందిన 1.2 కోట్ల షేర్లను విక్రయించారు. వీటి విలువ దాదాపు రెండు బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ విషయాన్ని ఆయన శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించారు. తాజాగా 11,997,698 షేర్లను బుధ, గురువారాల్లో అమ్మేసినట్లు బెజోస్ వెల్లడించారు.
169.71 - 171.02 డాలర్ల మధ్య వివిధ ధరల వద్ద వీటిని అమ్మినట్లు తెలిపారు. శుక్రవారం అమెజాన్ షేరు 174.45 దగ్గర స్థిరపడింది. గత 12 నెలల్లో దీని విలువ 78 శాతం పుంజుకుంది. 2023 ఫిబ్రవరి నాటికి బెజోస్‌కు కంపెనీలో 12.3 శాతం వాటా ఉంది. ప్రణాళికలో భాగంగా ఐదు కోట్ల స్టాక్స్‌ను విక్రయించినా ఇంకా ఆయనకు 11.8 శాతం వాటా ఉంటుందని అంచనా.
2025 జనవరి నాటికి ఐదు కోట్ల షేర్లు
బ్లూ ఆరిజన్ సహా తన మిగతా ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టడానికి బెజోస్ 2021లో అమెజాన్ సీఈఓ పదవి నుంచి వైదొలిగారు. అయితే సీఈఓ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత షేర్లను అమ్మడం ఇదే తొలిసారి. 2025 జనవరి నాటికి ఐదు కోట్ల షేర్లను విక్రయించాలనుకుంటున్నట్లు గత ఏడాది నవంబర్‌లోనే వెల్లడించారు. 50 మిలియన్ల షేర్లను విక్రయించాలని ఫిబ్రవరి 7వ తేదీన సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో లిస్ట్ చేశారు బెజోస్.
600 మిలియన్ డాలర్ల పన్ను ఆదా
తన నివాసాన్ని సియాటెల్ నుంచి మియామీకి మారుస్తున్నట్లు గత నవంబర్‌లో బెజోస్ వెల్లడించారు. షేర్లు, బాండ్ల విక్రయం ద్వారా వచ్చిన లాభాలు 2,50,000 డాలర్లు దాటితే సియాటెల్‌లో ఏడు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా మియామీకి మారడం వల్ల ఐదు కోట్ల షేర్ల విక్రయంపై ఆయనకు 600 మిలియన్ డాలర్ల పన్ను ఆదా అవుతుందని అంచనా.
బెజోస్ ఎర్త్ ఫండ్
పర్యావరణ సమస్యలపై పోరాటానికి 2020లో 10 బిలియన్ డాలర్లతో బెజోస్ ఎర్త్ ఫండ్‌ను ఆయన ప్రారంభించారు. ఇళ్లులేని కుటుంబాలు, ప్రాథమిక పాఠశాలల కోసం 2018లో రెండు బిలియన్ డాలర్లతో బెజోస్ డే వన్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు.