Amazon launches AI Bot Rufus : దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, తమ వినియోగదారుల షాపింగ్ అనుభూతిని మెరుగుపరచడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐ-ఆధారిత షాపింక్ టూల్ 'రూఫస్' (Rufus AI Shoping Assistant)ను ఆవిష్కరించింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ రూఫస్‌ను డిజైన్ చేసినట్లు తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో దాదాపు అన్ని పరిశ్రమలు తమ వ్యాపారాలను ఏఐతో అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో రిటైల్ మార్కెట్లో అమెజాన్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ కారణాల వల్ల పోటీ తట్టుకుని నిలబడేలా, మార్కెట్లో తమ షేర్‌ను నిలబెట్టుకునేలా అమెజాన్ రూఫస్‌ను తీసుకొచ్చింది.
అమెజాన్ రూఫస్తో కీవర్డ్ సెర్చ్ లేకుండా షాపింగ్ చేయొచ్చు. రూఫస్‌ను వివిధ ప్రశ్నలు అడిగి షాపింగ్ గురించి సలహాలు తీసుకోవచ్చు. వినియోగదారులకు మంచి షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్ కలిగించడానికి రూఫస్ ఏఐకి- అమెజాన్ షాపింగ్ కాటలాగ్, కస్టమర్ రివ్యూస్, కమ్యూనిటీ క్వశ్చన్ & ఆన్సర్స్‌పై శిక్షణ ఇస్తున్నారు. తద్వారా రూఫస్ వినియోగదారులకు ప్రొడక్ట్ రికమెండేషన్స్, కంపారిజన్ వంటి సేవలు సులభంగా అందిస్తుంది.
ఉదాహరణకు 'ట్రయిల్, రోడ్ రన్నింగ్ షూల మధ్య తేడాలు ఏమిటి', 'రన్నింగ్ షూలను కొనుగోలు చేసేటప్పుడు ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి?' అనే ప్రశ్నలు అడిగితే వెంటనే రూఫస్ సమాధానం చెబుతుంది. 'ఈ వాలెంటైన్స్ డేకు మంచి గిఫ్ట్స్ ఏమిటి' అని అడిగితే పలు రికమెండేషన్స్ మీ కళ్ల ముందు ఉంచుంది. అయితే దీని కోసం యూజర్లు సెర్చ్ బార్లో కీవర్డ్ టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. రూఫస్ వాయిస్ చాట్ అసిస్టెంట్ కనుక దానికి మనం వాయిస్ కమాండ్స్ ఇస్తే సరిపోతుంది.
ప్రస్తుతం ఈ షాపింగ్ అసిస్టెంట్‌ను ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంచి పరీక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా తీసుకొచ్చేందుకు అమెజాన్ ప్రయత్నాలు చేస్తోంది. అమెజాన్ షాపింగ్ యాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా టూల్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
పేటీఎం షేర్లు మరో 20% పతనం - కంపెనీకి రూ.17వేల కోట్లకు పైగా నష్టం!
జియో Vs వీఐ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ - వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్?