Air India New Baggage Rules : టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా (Air India) విమానయాన సంస్థ తన బ్యాగేజ్ పాలసీలో పలు మార్పులు చేసింది. దేశీయ విమాన ప్రయాణాల విషయంలో ఫ్రీ బ్యాగేజ్‌పై ఉన్న గరిష్ఠ పరిమితిని తగ్గించింది. తక్కువ ధర టికెట్‌తో ప్రయాణం చేసేవారు గతంలో 20 కేజీలు వరకు బ్యాగేజ్ తీసుకెళ్లడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ బ్యాగేజ్‌ని 15 కేజీలకు కుదించింది. అంటే ఎవరైతే ఎకానమీ క్లాస్‌లో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ ఫేర్ కేటగిరీ టికెట్లు తీసుకుని ప్రయాణిస్తారో, వారు ఇప్పటి నుంచి గరిష్ఠంగా 15 కేజీలు వరకు మాత్రమే చెక్-ఇన్ బ్యాగేజ్ తీసుకెళ్లగలుగుతారు. ఈ కొత్త నిబంధనలు మే 2 నుంచే అమల్లోకి వచ్చాయని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
15 కేజీలు మాత్రమే!
వాస్తవానికి ఇంతకు ముందు ఎయిర్ ఇండియా 25 కేజీల వరకు బ్యాగేజ్ తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చేది. అయితే ఎయిర్ ఇండియా - టాటా గ్రూప్ చేతికి వచ్చాక గతేడాది ఆ పరిమితిని 20 కేజీలకు తగ్గించారు. తాజాగా ఈ ఫ్రీ బ్యాగేజ్ పరిమితిని 15 కేజీలకు తగ్గించారు.
డీజీసీఏ ఆదేశాల ప్రకారం, విమానయాన సంస్థలు కనీసం 15 కేజీల వరకు బ్యాగేజ్‌ని ఉచితంగానే అనుమతించాల్సి ఉంటుంది. అందుకే దాదాపు అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఈ మేరకు ఫ్రీ బ్యాగేజ్‌ని అనుమతిస్తున్నాయి. అయితే, కొన్ని సంస్థలు ఒక్క బ్యాగ్‌ను మాత్రమే అనుమతిస్తున్నాయి. కానీ ఎయిర్ ఇండియా మాత్రం బరువు పరిమితికి లోబడి ఎన్ని బ్యాగులు అయినా తీసుకెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తోంది.
కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్, ఫ్లెక్స్
ఎయిర్ ఇండియా గతేడాది వివిధ రకాల ఫేర్ క్లాసెస్‌ను ప్రవేశపెట్టింది. వీటిలో ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్, ఫస్ట్‌క్లాస్‌లు ఉన్నాయి. వీటితోపాటు కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్, ఫ్లెక్స్ పేరిట మరో మూడు ఉపతరగతులను కూడా తీసుకొచ్చింది. వీటి టికెట్ ధరలు, సౌకర్యాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ మీరు ఎకానమీ ఫ్లెక్స్ కేటగిరీ టికెట్ తీసుకుంటే, 25 కేజీల వరకు బ్యాగేజ్ తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. సాధారణంగా బరువు అనేది విమానం ఇంధనాన్ని ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది. ఎయిర్ ఇండియా తీసుకొచ్చిన ఈ న్యూ బ్యాగేజ్ పాలసీ, కంపెనీ తన బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరుచుకునేందుకు ఉపయోపడుతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
క్యాబిన్ క్లాస్ | బ్రాండ్ | బ్యాగేజ్ |
ఎకానమీ | కంఫర్ట్ | 15 kg/33 lb |
కంఫర్ట్ ప్లస్ | 15 kg/33 lb | |
ఫ్లెక్స్ | 25 kg/55 lb | |
ప్రీమియం ఎకానమీ | కంఫర్ట్ ప్లస్ | 15 kg/33 lb |
ఫ్లెక్స్ | 25 kg/55 lb | |
బిజినెస్ | కంఫర్ట్ ప్లస్ | 25 kg/55 lb |
ఫ్లెక్స్ | 35 kg/77.1 lb | |
ఫస్ట్ | ఫస్ట్ | 40 kg/88 lb |