Zorawar Tank Indian Army : తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీనరేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ-DRDO, ప్రైవేటు సంస్థ ఎల్ అండ్ టీ సంయుక్తంగా జొరావర్ అనే తేలికపాటి యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ యుద్ధ ట్యాంకును పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దేశీయంగా రూపొందించారు. పరీక్షల నేపథ్యంలో DRDO చీఫ్ డాక్టర్ సమీర్ వీ కామత్ గుజరాత్‌లోని ఎల్ అండ్ టీ ప్లాంట్‌ను సందర్శించి ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
జొరావర్ తేలిక పాటి యుద్ధ ట్యాంకులను 2027లో సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమీర్ వీ కామత్ తెలిపారు. తూర్పు లద్ధాఖ్‌లోని ఎత్తైన ప్రదేశాలలో మోహరించేందుకు ఉద్దేశించిన ఈ యుద్ధ ట్యాంకులను రెండేళ్లలోనే అభివృద్ధి చేశారు. రక్షణ ఉత్పత్తులను దేశీయంగా అభివృద్ధి చేయడంలో భారత్ సాధించిన పురోగతికి ఇది నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలతో జొరావర్ తేలికపాటి యుద్ధ ట్యాంకులో అన్ మ్యాన్డ్ సర్ఫేస్ వెహికిల్(Unmanned Surface Vehicle(USV)) అనే సాంకేతికతను జోడించారు. అంటే మానవ ప్రమేయం లేకున్నా పని చేసే విధంగా రూపొందించారు.
![Zorawar Tank Indian Army](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-07-2024/21886118_z1.png)
"ఇది మాకు చాలా ముఖ్యమైన రోజు. పరీక్షలో భాగంగా తేలికపాటి యుద్ధ ట్యాంకు చేస్తున్న విన్యాసాలు చూడటం నాకు ఆనందంతో పాటు గర్వంగా ఉంది. DRDO, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేస్తే ఏం సాధిస్తామో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రెండు నుంచి రెండున్నర ఏళ్లలో మేము యుద్ధ ట్యాంకును డిజైన్ చేయడమే కాకుండా ఒక నమూనాను తయారు చేశాం. రాబోయే ఆరు నెలలు ఈ యుద్ధ ట్యాంకు పరీక్షలను ఎదుర్కొంటుంది. అనంతరం క్షేత్రస్థాయిలో పరీక్షించడానికి సైన్యానికి అందజేస్తాం."
-- డాక్టర్ సమీర్ వీ కామత్, డీఆర్డీవో అధిపతి
గుజరాత్‌లోని హజీరాలో ఉన్న ఎల్ అండ్ టీ ప్లాంట్‌లో జొరావర్ తేలికపాటి యుద్ధ ట్యాంకులను ఉత్పత్తి చేయనున్నారు. 25 టన్నుల బరువు ఉన్న ఈ యుద్ధ ట్యాంకును అతి తక్కువ సమయంలో రూపొందించడమే కాకుండా ట్రయిల్స్‌కు సిద్ధం చేశారు. పరీక్షల్లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే తొలి విడతలో సైన్యానికి 59 ట్యాంకులను ఎల్ అండ్ టీ సంస్థ అందించనుంది.
![Zorawar Tank Indian Army](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-07-2024/21886118_z2.png)
పరీక్షలు పూర్తి కావడానికి 12 నుంచి 15 నెలల సమయం పడుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బరువు తక్కువగా ఉండటం వల్ల లోయల్లో వేగంగా వెళుతుందని చెప్పారు. యుద్ధ ట్యాంకులో అమర్చడానికి కావల్సిన మందుగుండు సామగ్రి తొలుత బెల్జియం నుంచి రానుంది. ఆ తర్వాత DRDO వాటిని దేశీయంగా అభివృద్ధి చేయనుంది. భారత వాయుసేనకు చెందిన సీ-17 సరకు రవాణా విమానం ఒకేసారి రెండు యుద్ధ ట్యాంకులను లక్షిత ప్రాంతాలకు చేర్చగలదు.