'Zakir Naik's Extradition To India : పరారీలో ఉన్న వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ అప్పగింతపై మలేసియా నుంచి సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. తగిన ఆధారాలు సమర్పిస్తే, అతడిని భారత్‌కు అప్పగించే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం పేర్కొన్నారు.
భారత్ - మలేసియా ద్వైపాక్షిక సంబంధాల ఉన్నతీకరణకు ఈ ఒక్క అంశం అడ్డుపడదని ఇబ్రహీం స్పష్టంచేశారు. మంగళవారం ప్రధాని మోదీ సహా భారత బృందంతో జరిగిన చర్చల్లో జకీర్ నాయక్ అంశం అసలు ప్రస్తావనకే రాలేదని ఆయన తెలిపారు. కొన్నేళ్ల క్రితం ప్రధాని మోదీ ఇతర వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. "ఒక వ్యక్తి లేదా సమూహం గురించే కాకుండా తీవ్రవాదానికి సంబంధించిన ఎలాంటి అంశాన్నైనా మేం చాలా తీవ్రంగా పరిగణిస్తాం. ఆధారాలు సమర్పిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఆ దిశగా ఎలాంటి సలహాలు, సూచనలు చేసినా స్వీకరిస్తాం" అని ఇబ్రహీం అన్నారు.
"ఉగ్రవాదాన్ని ఉపేక్షించం. కఠినంగా వ్యవహరిస్తాం. ఉగ్రవాదాన్ని అణచివేయటంతో పాటు పలు అంశాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తున్నాం. భారత్, మలేసియాల మధ్య మరింత సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతాన్ని, ఈ ఒక్క కేసు (జకీర్ నాయక్ అంశం) ప్రభావితం చేస్తుందని నేను అనుకోను.’’
- ఇబ్రహీం, మలేసియా ప్రధాని
మూడు రోజుల పర్యటన కోసం అన్వర్ ఇబ్రహీం సోమవారం దిల్లీ వచ్చారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతోపాటు పలు రంగాల్లో సహకార విస్తృతికి ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. భారత్ నుంచి మలేసియాకు కార్మికులు, నిపుణులను అక్రమ మార్గాల్లో తీసుకెళ్తున్న ఘటనలు పెరుగుతున్నందున, వాటిని నివారించడానికి క్రమబద్ధంగా నియామకాలు జరపాలని రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
వ్యూహాత్మక భాగస్వామ్యం
గతంలో మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మొహమ్మద్ హయాంలో కొంత ఒత్తిడికి గురైన భారత్-మలేసియా సంబంధాలను పునరుద్ధరించడంపై ఈ మోదీ, ఇబ్రహీం దృష్టి సారించారు. ఇరు పక్షాల మధ్య మొత్తం ఎనిమిది ఒప్పందాలు కుదిరాయి. వీటిలో మలేషియాలో భారతీయ కార్మికుల రిక్రూట్‌మెంట్‌ను ప్రోత్సహించడం, వారి ప్రయోజనాల పరిరక్షణ కూడా ఒక అంశంగా ఉంది. డిజిటలైజేషన్, రక్షణ రంగం, సెక్యూరిటీ, సెమీకండక్టర్స్, కృత్రిమ మేధస్సు వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చల్లో ఎక్కువగా దృష్టి సారించారు. ఇద్దరు ప్రధానులు తీవ్రవాదాన్ని ఖండించారు. ఏ దేశమూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని, ఉగ్రవాదానికి పాల్పడిన వారిని త్వరితగతిన న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి కలిసి పనిచేయాలని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. మలేషియా నుంచి భారత్‌కు గత ఏడాది 5 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇరుపక్షాలు తమ జాతీయ కరెన్సీలలో వాణిజ్యాన్ని ప్రారంభించాయని చెప్పారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు మరింత విస్తరించాలని పేర్కొన్నారు.