Youngest And Oldest Ministers In PM Modi Cabinet : అదివారం కొలువుదీరిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో అతిపిన్న వయస్కుడిగా టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు(36) నిలిచారు. ఈయన తర్వాత మహారాష్ట్ర బీజేపీ నేత రక్షా నిఖిల్ ఖడ్సే(37), లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) ఎంపీ చిరాగ్ పాసవాన్(41), రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) ఎంపీ జయంత్ చౌదరి(45) అతి పిన్న వయస్కులుగా ఉన్నారు. ఇక ఈ కొత్త మంత్రివర్గంలో అతి పెద్ద వయస్కుడిగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ ఆవామ్ మోర్చా(హెచ్ఏఎమ్) వ్యవస్థాపక అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ(79) ఉన్నారు.
37మందికి దక్కని చోటు
మోదీ 2.0 సర్కారులో పనిచేసిన మంత్రుల్లో 37 మందికి ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో దక్కలేదు. వారిలో ఏడుగురు క్యాబినెట్ ర్యాంకు మంత్రులు ఉండగా, మిగిలిన 30మంది సహాయమంత్రులు. వీరిలో స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకుర్, నారాయణ్ రాణె, పరుషోత్తం రూపాలా, అర్జున్ ముండా, ఆర్‌కే సింగ్, మహేంద్రనాథ్ పాండే ఉన్నారు. వీరికి మోదీ 3.0 మంత్రివర్గంలో స్థానం లభించలేదు. ప్రస్తుతం మంత్రి పదవిని కోల్పోయినవారిలో 18 మంది ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. గత ప్రభుత్వంలో సహాయమంత్రిగా ఉండి, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పదవి నిలబెట్టుకున్న ఏకైక నేత ఎల్ మురుగన్.
గత కేబినెట్లో సహాయమంత్రులుగా పనిచేసి ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు దక్కనివారు వీరే
- వి.కె.సింగ్
- ఫగ్గణ్‌సింగ్ కులస్తే
- అశ్వినీ చౌబే
- దన్వే రావ్‌సాహెబ్ దాదారావ్
- సాధ్వీ నిరంజన్ జ్యోతి
- సంజీవ్ బల్యాన్
- రాజీవ్ చంద్రశేఖర్
- సుభాష్ సర్కార్
- నిశిత్ ప్రమాణిక్
- రాజ్‌కుమార్ రంజన్ సింగ్
- ప్రతిమా భౌమిక్
- మీనాక్షి లేఖి
- ముంజపరా మహేంద్రభాయ్
- అజయ్ కుమార్ మిశ్ర
- కైలాశ్ చౌధరీ
- కపిల్ మోరేశ్వర్ పాటిల్
- భారతీ ప్రవీణ్ పవార్
- కౌశల్ కిశోర్
- భగవంత్ ఖుభా
- వి.మురళీధరన్
- భాను ప్రతాప్‌సింగ్ వర్మ
- జాన్ బార్లా
- బిశ్వేశ్వర్ టుడు
- భగవత్ కిషన్‌రావ్ కరాడ్
- దేవుసిన్హ్ చౌహాన్
- అజయ్ భట్
- ఎ.నారాయణ స్వామి
- సోమ్ ప్రకాశ్
- రామేశ్వర్ తేలి
- దర్శనా విక్రమ్ జర్దోశ్
మోదీ 3.0 కేబినెట్ మంత్రుల విద్యార్హతలు
మోదీ 3.0 మంత్రివర్గంలోని 30మంది కేబినెట్ మంత్రుల్లో ఆరుగురు లాయర్లు, ముగ్గురు ఎంబీఏ డిగ్రీ, 10మంది పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్‌కు మాస్టర్ డిగ్రీ పట్టా ఉంది. లాయర్ పట్టా కలిగిన వారిలో నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, పీయూశ్ గోయల్, సర్బానంద సోనోవాల్, భూపేందర్ యాదవ్, కిరెన్ రిజిజు ఉన్నారు. మనోహర్ లాల్, హెచ్డీ కుమారస్వామి, జీతన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్, ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్‌కు డిగ్రీ పట్టా ఉంది. కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో 33మంది కొత్తవారికి చోటు లభించింది.