Young Man Died During Weight Loss Surgery : బరువు తగ్గాలన్న ఆశతో డాక్టర్ల దగ్గరకి వెళ్లిన ఓ యువకుడు మృతిచెందాడు. వెయిట్ లాస్ సర్జరీ మధ్యలోనే గుండెపోటు రావడం వల్ల మరణించాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. అయితే ఆ యువకుడి మృతిపై అనుమానం ఉందని అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ జరిగింది
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, పుదుచ్చేరిలోని ముత్యాల్ పేట్‌కు చెందిన సెల్వనాథన్ లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. సెల్వనాథన్‌కి హేమచంద్రన్, హేమరాజన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 26 ఏళ్ల వయసున్న వారిద్దరు కవలలు. హేమచంద్రన్ 150 కిలోల బరువుతో ఊబకాయం సమస్యతో బాధపడుతున్నాడు. బరువు తగ్గేందుకు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని సంప్రదించాడు. బరువు తగ్గడం కోసం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. అందుకు రూ.8 లక్షలు అవుతుందని తెలిపారు.
అయితే పమ్మల్‌లోని మరో ఆస్పత్రిలో ఈ సర్జరీ కోసం రూ.4లక్షల ఖర్చు అవుతుందంటే ఏప్రిల్ 3న అక్కడికి వెళ్లాడు హేమచంద్రన్. అనంతరం ఆ ఆస్పత్రిలోనే హేమచంద్రన్ శస్త్ర చికిత్సకు కావాల్సిన వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం హేమచంద్రన్‌కు మధుమేహం ఎక్కువగా ఉందని, తర్వాత సర్జరీ చేస్తామని వైద్యులు చెప్పారు.
వైద్యులు చెప్పినట్లుగా కొన్ని రోజుల తర్వాత ఏప్రిల్ 21న ఉదయం ఆస్పత్రికి వెళ్లాడు హేమచంద్రన్. అనంతరం అతడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆ తర్వాతి రోజు సర్జరీ చేస్తామని చెప్పారు. చెప్పినట్లుగానే హేమచంద్రన్‌కు సర్జరీ చేసేందుకు సిద్ధమయ్యారు డాక్టర్లు. ఈ క్రమంలో అతడికి మత్తు మందు ఇచ్చారు. శస్త్ర చికిత్స చేస్తుండగానే హేమచంద్రన్ ఒక్కసారిగా ఆస్వస్థతకు గురయ్యాడు. వెంటనే డాక్టర్లు వేరే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హేమచంద్రన్ గుండెపోటుతో మరణించాడు. దీంతో తన కుమారుడి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ శంకర్‌నగర్ పోలీస్ స్టేషన్లో సెల్వనాథన్ ఫిర్యాదు చేశారు.
యూట్యూబ్‌లో చూసి
హేమచంద్రన్ బరువు తగ్గడానికి యూట్యూబ్‌లో పలు వీడియోలు చూసేవాడని సెల్వనాథన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే చెన్నైకి చెందిన డాక్టర్ పెరుంగో ఇంటర్వ్యూ చూసి ఆయనను సంప్రదించినట్లు చెప్పాడు. 'శస్త్ర చికిత్స కోసం మేము అంత ఖర్చు చేయలేమని, మా కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చెప్పమని అన్నాం. చికిత్స సంబంధించిన వివరాలు నా పీఏ ఫోన్ చెబుతారని డాక్టర్ బదులిచ్చారు. ఆ తర్వాత పీఏ ఫోన్ చేసి వైద్యం చేసేందుకు రూ. 8 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. పమ్మల్‌లో ఆస్పత్రిలో రూ.4 లక్షలతో సర్జరీ అయిపోతుందని చెప్పారు. తర్వాత మేము ఆ ఆస్పత్రికి వెళ్లాము. వైద్యం చేస్తుండగానే నా కుమారుడు మృతిచెందాడు' అని సెల్వనాథన్ ఆవేదన వ్యక్తం చేశారు.