Who is Navya Haridas : వయనాడ్‌లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై డైనమిక్ లీడర్, రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ నవ్య హరిదాస్‌ను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఇద్దరు మహిళా నేతల మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో అసలెవరా నవ్య హరిదాస్? ఆమె రాజకీయ నేపథ్యం ఏంటి? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నవ్య హరిదాస్ నేపథ్యమిదే!
భారతీయ జనతా పార్టీ వయనాడ్ అభ్యర్థిగా నవ్య హరిదాస్(39) పేరును ఖరారు చేయడం వల్ల ఆమె ఎవరు? రాజకీయ ప్రస్థానం ఏంటి? అనే చర్చ నడుస్తోంది. కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశారు నవ్య. ప్రస్తుతం కోజీకోడ్ కార్పొరేషన్లో బీజేపీ కౌన్సిలర్‌గా ఉన్నారు. వరుసగా ఆమె రెండు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు
2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కోజీకోడ్ సౌత్ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా నవ్య హరిదాస్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ దేవర్కోవిల్ చేతిలో ఓడిపోయారు. తాజాగా వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్యపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు.
'కాంగ్రెస్‌కు వయనాడ్ సెకండ్ ఆప్షన్'
మరోవైపు, వయనాడ్ ఎన్డీఏ అభ్యర్థిగా తనను ప్రకటించిన గంటల వ్యవధిలోనే నవ్య హరిదాస్ కాంగ్రెస్‌పై పదునైన విమర్శలు గుప్పించారు. గాంధీ కుటుంబం వయనాడ్‌ను కేవలం సెకండ్ ఆప్షన్‌గా పరిగణిస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని వయనాడ్ ప్రజలు గ్రహించారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు తమకు అండగా ఉండి, సమస్యలు పరిష్కరించే నాయుకుడినే కోరుకుంటున్నారని తెలిపారు. కోజీకోడ్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌పై నవ్య ఈ మేరకు విమర్శలు గుప్పించారు.
'వయనాడ్ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తడం వల్ల విఫలమైన గాంధీ కుటుంబానికి ప్రతినిధిగా ప్రియాంక వస్తున్నారు. వయనాడ్ ప్రజలు వచ్చే ఐదేళ్ల పాటు రాహుల్ గాంధీ తమ వెంట ఉంటారనే నమ్మకంతో ఆయనకు ఓట్లేశారు. కానీ రాయబరేలీని ఆయన ఎంచుకుని, వయనాడ్‌ను వదిలేశారు' అని నవ్య హరిదాస్ విమర్శించారు.
రాహుల్ రాజీనామాతో ఉపఎన్నిక
ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానాల నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. ఆ తరువాత రాయ్‌బరేలీ సీటులో కొనసాగాలని నిర్ణయించుకుని, వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. నవంబరు 23న ఫలితం తేలిపోనుంది.
కాంగ్రెస్ వ్యూహాలు
కాగా, వయనాడ్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తమ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని బరిలో నిలిపింది. అక్టోబరు 23న యూడీఎఫ్ అభ్యర్థిగా ప్రియాంక నామపత్రాలు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ప్రియాంకకు పోటీగా బీజేపీ నవ్య హరిదాస్‌ను రంగంలోకి దించింది. అలాగే ఎల్డీఎఫ్ తరఫున సీపీఐ నేత సత్యన్ మోకేరీ పోటీలో ఉన్నారు. దీంతో వయనాడ్‌లో ఆసక్తికర పోరు నెలకొంది.