Nagastra 1 Drone : భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన నాగాస్త్ర-1 భారత్ సైన్యం చేతికి వచ్చింది. 480 నాగాస్త్రాలను సైన్యం ఆర్డర్ చేయగా, వాటిలో 120 సైన్యం ఆయుధ డిపోకు చేరాయి. వైమానిక దాడుల కోసం ఈ నాగాస్త్ర-1ను ఉపయోగిస్తారు. UAV ఆధారిత వ్యవస్థతో ఇది పని చేస్తుంది. ఏ శత్రు లక్ష్యాన్ని అయినా ఇది ఛేదించగలదు. GPS ఆధారంగా పని చేసే నాగాస్త్ర-1ను 2 మీటర్ల కచ్చితత్వంతో దాడి చేయగలదు. దీనిని ఆత్మాహుతి (సూసైడ్) డ్రోన్ అని కూడా అంటారు.
గంటసేపు ఎగరగల నాగాస్త్ర
తొమ్మిది కిలోలు బరువు ఉన్న ఈ డ్రోన్ సుమారు 4 వేల 500 మీటర్ల ఎత్తు వరకు ఎగురగలదు. రాడార్లు గుర్తించకుండా దాడుల చేసే సామర్థ్యం దీని సొంతం. ఉదాహరణకు ఎవరైనా శత్రు సైనికుల నేత ఒక నిర్దిష్ట ప్రదేశం వద్దకు వాహనంలో నిర్దిష్ట సమయానికి చేరుకునేలా ఉంటే నాగాస్త్ర అప్పటివరకు గాల్లోనే ఉంటూ టార్గెట్ వచ్చిన వెంటనే దాడి చేయగలదు. ఆత్మాహుతి డ్రోన్‌గా కూడా ఇది పని చేస్తుంది. 60 నిమిషాల పాటు ఇది ఎగురగలదు. మెన్‌ఇన్ లూప్‌లో 15 కిలోమీటర్లు, ఆటోనామస్ మోడ్‌లో 30 కిలోమీటర్ల రేంజ్ దీనికి ఉంది.
అభివృద్ధి చెందిన దేశాల డ్రోన్ల కంటే మెరుగ్గా
రాత్రి-పగలు పని చేసేలా నిఘా కెమెరాలు నాగాస్త్రకు ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే దీన్ని మెరుగ్గా రూపొందించారు. మధ్యలో నిలిపివేయడం, రికవర్, తిరిగి ఉపయోగించడం వంటి ఫీచర్లను నాగాస్త్ర కలిగి ఉంది. లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా లేదా మిషన్‌ను మధ్యలో రద్దు చేసినా నాగాస్త్రను తిరిగి వెనక్కి రప్పించవచ్చు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దీనికి పారాషూట్ సదుపాయం కూడా ఉంది. అధునాతన ఫీచర్లతో దేశీయంగానే దీన్ని రూపొందించడం గమనార్హం. ఇప్పటి వరకు ఇలాంటి డ్రోన్‌లను విదేశాల నుంచి కొనుగోలు చేసిన సంస్థ తొలి స్వదేశీ కంపెనీగా అవతరించింది.