Risky Dating Trends: డేటింగ్లో ఉన్నప్పుడు భాగస్వామి చూపించే బిహేవియర్‌ను 100% పర్‌ఫెక్ట్ అని ఫిక్సయిపోవచ్చా అంటే.. కాదని సమాధానమిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే కొంతమంది బయటికి ప్రేమగానే కనిపించినా.. అంతర్గతంగా మోసపూరితంగా ఉంటారని హెచ్చరిస్తున్నారు. అలాంటి వారిని కొన్ని విషయాల ఆధారంగా పసిగట్టవచ్చని సూచిస్తున్నారు. మరి, ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పగటి కలలు: తమకు నచ్చిన భాగస్వామి లైఫ్‌లోకి రాగానే.. కొంతమంది ఊహల్లో విహరిస్తుంటారు. ప్రేమ, పెళ్లి, పిల్లలు.. లైఫ్ మొత్తం బిందాస్‌గా సాగిపోతుందని కలలు కంటూ ఉంటారు. ఇలా.. ఊహల్లో జీవించే పార్ట్నర్తో భవిష్యత్తులో తప్పక ఇబ్బందులు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారితో చేసే డేటింగ్ను "డెల్యూజన్‌షిప్ డేటింగ్"గా పిలుస్తారు. భాగస్వామి ఇలా పరిచయం కాగానే, అలా పగటి కలలు కనేవారితో ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు. లేదంటే.. ఆ తర్వాత ఇద్దరూ ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
రెండోసారి మాట కలిపితే: విడిపోయిన భాగస్వామితోనే రెండోసారి ప్రేమలో పడుతుంటారు కొందరు. వీరిలో చాలా మంది మనస్ఫూర్తిగా కాదు.. మరోసారి మోసం చేయడానికే ఎత్తుల మీద ఎత్తులు వేస్తుంటారట. తొలిసారి చేసిన తప్పులకు క్షమాపణ కోరుతూ భాగస్వామి జీవితంలోకి వస్తుంటారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి వారిని నమ్మిస్తుంటారు. ఈ తరహా మోసపూరిత ప్రేమనే "ఈవిల్ డెడ్ రైజ్" డేటింగ్ ట్రెండ్‌గా పిలుస్తారు. ఇలాంటి వారి వలలో మరోసారి పడకుండా ఉండాలని.. వారు చెప్పే మాటలకు పడిపోకుండా వారి ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలంటున్నారు.
మనిషిని బట్టి మారడం: కొంతమంది పార్ట్నర్ను బట్టి తమ ఇష్టాయిష్టాలు, ఆసక్తులు, ప్రవర్తన మార్చుకుంటుంటారు. ఇది కేవలం భాగస్వామిని ఇంప్రెస్ చేయడానికే అని.. ఒకవేళ అవతలి వారు ఇంప్రెస్ కాకపోయినా, ఈ ప్రవర్తన అవతలి వారికి నచ్చకపోయినా.. వెంటనే యూటర్న్ తీసుకుంటారట. మరో భాగస్వామిని వెతుక్కునే పనిలో ఉంటారని నిపుణులు అంటున్నారు. ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించే భాగస్వామితో జాగ్రత్తగా మసలుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే మోసపోవడం గ్యారెంటీ అంటున్నారు.
Tips For Dating to Marriage: డేటింగ్ చేస్తున్నారా..? ఈ విషయాలు అస్సలు మరిచిపోవద్దు!
సడన్‌గా దూరమైతే: కొందరు.. అవతలి వారితో ఎంత త్వరగా ప్రేమలో పడతారో.. అంతే సడన్‌గా విడిపోతారు! ఈ తరహా డేటింగ్‌నే ‘ఘోస్టింగ్’ అంటున్నారు నిపుణులు. భాగస్వామితో అప్పటివరకు ప్రేమగా మాట్లాడినా.. సడన్‌గా మనసు మార్చుకోవడం, వారితో ఫోన్స్, మెసేజ్‌లు ఆపేయడం, కనీసం ఎందుకు విడిపోవాలనుకున్నారో కూడా చెప్పకుండా తెగతెంపులు చేసుకుంటారట! దీంతో.. ఇవతలి వారు తీవ్ర మనోవేదనకు గురవుతారు. అందుకే ప్రేమలో ఉన్న జంటలు భాగస్వామిని మరీ అంతలా నమ్మకుండా.. వారిపై ఎక్కువగా ఆధారపడకుండా ఉంటే మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా సడన్‌గా విడిపోవాల్సి వచ్చినా.. అవతలి వారి గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం ఉండదంటున్నారు.
డబ్బు చూసి ప్రేమిస్తే: నిజమైన ప్రేమ ఆస్తులు కోరుకోదంటారు. కానీ కొంతమంది ఏరికోరి డబ్బు, పలుకుబడి ఉన్న వారినే ఎంచుకుంటుంటారు. ఏవేవో అబద్ధాలు చెప్పి వారిని నమ్మిస్తుంటారు. ఇదంతా తమ స్టేటస్‌ని పెంచుకోవడానికే! ఈ తరహా ప్రేమనే ‘త్రోనింగ్’ అంటారట. ఇలాంటి వారు డేటింగ్లో ఉండగానే మరో రిలేషన్ కూడా పెట్టుకుంటారని అంటున్నారు. అంతేకాదు.. అనుకున్నట్లుగానే తమకు డబ్బు, పలుకుబడి రాగానే.. వాళ్లను మోసం చేసి, మరొకరి వెంటపడతారట. అందుకే.. అవతలి వారి ప్రవర్తన నమ్మశక్యంగా లేకపోతే వారిని దూరం పెట్టడం వల్ల ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.
పబ్లిసిటీ పిచ్చోళ్లు: ప్రేమికులైనా, దంపతులైనా.. కొన్ని విషయాలు ఇద్దరి మధ్య ఉంటేనే అందం. అయితే.. కొందరు తమ ప్రేమ, భాగస్వామికి సంబంధించిన అన్ని విషయాలనూ సామాజిక మాధ్యమాలల్లో షేర్ చేస్తుంటారు. జంటగా దిగిన ఫొటోలు, వీడియోలు మొదలు.. భాగస్వామితో ఏదైనా గొడవైనా కూడా బహిర్గతం చేస్తుంటారు. ఈ ధోరణి ప్రదర్శించే వారిని "ఇన్‌స్టా గేటర్స్"గా పిలుస్తున్నారు నిపుణులు. ఇలాంటి బంధాలూ ఎక్కువ కాలం కొనసాగవంటున్నారు నిపుణులు. అందుకే.. ఈ తరహా ప్రవర్తన ఉన్న భాగస్వామిని ఆదిలోనే పసిగట్టి దూరం పెట్టడం వల్ల.. నలుగురిలో నవ్వులపాలు కాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.