West Bengal Train Accident Assistant Loco Pilot : బంగాల్లోని దార్జిలింగ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో గూడ్సు ట్రైన్ అసిస్టెంట్ లోకో పైలట్ మను కుమార్ సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మను కుమార్ సిలిగుడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. ప్రమాదం జరిగిన రోజే గూడ్సు ట్రైన్ లోకో పైలట్‌తో పాటు అసిస్టెంట్ కూడా చనిపోయారని రైల్వే బోర్డ్ ప్రకటించించడం గమనార్హం.
వైరల్ అవుతున్న వీడియోలో అస్టిసెంట్ లోకో పైలట్ మను కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కనిపిస్తున్నారు. ఆ సమయంలోనే లోకో పైలట్ ఎలా ఉన్నారని మను అడుగుతున్నట్లు ఉంది.
సోమవారం జరిగిన ప్రమాదంలో గాయపడిన మనును తొలుత రైల్వే ఆస్పత్రిలో చేరినట్లు, అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
'మూడు రోజులు వరుసగా నైట్ డ్యూటీ'
రైల్వే సిగ్నలింగ్ విభాగంలో సిబ్బంది కొరత ఉండటం వల్ల ఉద్యోగులపై అదనపు ఒత్తిడి పడుతుందని మను సహోద్యోగి తెలిపారు. సాధారణంగా రెండు రోజులు నైట్ డ్యూటీ తర్వాత ఒక రోజు సెలవు ఉంటుంది. కానీ మను వరుసగా మూడు రోజులు నైట్ డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఒక రోజు సెలవు ఉన్నప్పటికీ మనును సోమవారం డ్యూటీకి రావాలని అడిగారని అతడి సహోద్యోగి పేర్కొన్నారు.
మరోవైపు మను ఒక రోజు సెలవు తీసుకుని అంటే 30గంటలు విశ్రాంతి తీసుకున్న తర్వాతే డ్యూటీకి వచ్చారని రైల్వే అధికారులు చెబుతున్నారు. విచారణ పూర్తి కాక ముందే డ్రైవర్లను బాధ్యులుగా చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ ప్రమాదం
అసోంలోని సిల్చార్ నుంచి కోల్ కతాలోని సెల్దాకు వెళ్తున్న కాంచన్‌జంగా ఎక్స్ ప్రెస్‌ను ఓ గూడ్స్ రైలు దార్జిలింగ్ వద్ద ఢీకొట్టింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో 8మంది మరణించగా, మరో 25 మంది గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రైల్వే శాఖ అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఘటనా స్థలి ఫన్సీదేవా ప్రాంతంలో పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
'మృతదేహాన్ని మాయం చేసేందుకు రూ.30 లక్షలు ఇచ్చా'- నేరం అంగీకరించిన దర్శన్! - Darshan Renuka Swamy
కల్తీ మద్యం తాగి 33మంది మృతి- ICUలో 20మంది- రంగంలోకి సీఎం - Hooch Tragedy Tamil Nadu